-నిరుద్యోగుల పట్ల కేంద్ర వైఖరిపై ఆగ్రహం
-మృతుడి కుటుంబానికి సంతాపం
-క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
-వెంటనే కేంద్రం ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్
-సంయమనం పాటించాలని, శాంతియుతంగా పోరాడాలని నిరుద్యోగులకు పిలుపు
-సికింద్రాబాద్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం
హైదరాబాద్, జూన్ 17ః సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళన ఘటన దుర దృష్టకరం. ఆ ఆందోళనలో ఒకరు మృతి చెందినట్లు. ఆ మృతి చెందిన యువకుడు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేటకు చెందిన రాకేశ్ గా తేలడం, పలువురు గాయపడటం ఆవేదన కలిగిస్తున్నది. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలుపుతున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశిస్తున్నాను. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాను.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక ఆనాలోచిత, ఆపరిపక్వ, అసంబద్ధ ఆలోచన వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి. దేశాన్ని రక్షించే త్రివిధ దళాలలో కొత్తగా యువతను తీసుకోవడానికి తెచ్చిన అగ్నీపథ్ పథకమే అర్థంలేని విధంగా ఉంది. దేశ స్థాయిలో కేవలం 46 వేల మందిని తీసుకోవడానికి ఇంత పెద్ధ రాద్ధాంతం అవసరమా? పైగా 90 రోజులలో నియామకం, కేవలం రూ.30 వేల జీతం, 4 ఏండ్ల లో మళ్ళీ పరీక్ష పెట్టి, అందులో ఉత్తీర్ణులైన వారికే అవకాశం అన్నారు. 10వ తరగతి పాసైన విద్యార్థులను తీసుకుని, ఉద్యోగాలు రాని వారికి 4 ఏండ్లకు ఇంటర్ సర్టిఫికేట్ ఇస్తామనడం విడ్డూరం. మొన్న నల్ల వ్యవసాయ చట్టాలతో రైతుల, ఇవ్వాళ అగ్నిపథ్ లాంటి నిర్ణయాలతో యువత ఉసురు పోసుకుంటున్నారు.
ఇంతా చేసి, అల్లర్లలో పార్టీల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ యువతను అవమానిస్తున్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న అన్ని ఆందోళనల వెనుకా పార్టీలే ఉన్నాయా? కేంద్రంలో బిజెపి చేతగాని తనాన్నిపార్టీల మీద రుద్దడం న్యాయమా? మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగ శాతం 5.6 శాతం నుండి 7.83 శాతానికి పెరిగింది. వేతనాలు, ఫించన్ల భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్రం తీసుకున్న దిక్కుమాలిన, దరిద్రపుగొట్టు, తలాతోకాలేని ఆలోచన. అందుకే యువత ఆగ్రహానికి గురవుతున్నది. ఈ నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాను. విద్యార్థులలో ఆందోళనకు కారణమైన అగ్ని పథ్ ను వెంటనే విరమించుకోవాలి. దేశ భద్రతకు మరింత మెరుగైన ఆలోచనలు చేయాలి.
నిరుద్యోగులు సంయమనం పాటించాలి. శాంతియుత పోరాట దారులు ఎంచుకోవాలి. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అర్థాంతరంగా ఆగం కావద్దు. కేంద్ర వైఖరిని అంతా కలిసి కట్టుగా నిరసిద్దాం. కేంద్రం కూడా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు. వారి ఆలోచనలు, ఆశలకనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి.