– ఆర్యవైశ్య మహాసభ అట్టర్ ఫ్లాప్!!
– తెలంగాణ నేతల బహిష్కరణ!!!
-రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్
హైదరాబాద్ : తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనమే కొనసాగుతోందని, తెలంగాణ వైశ్యనేతలు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యాంసుందర్ ఆరోపించారు. రాష్ట్ర మహాసభ అధ్యక్షుడిగా అమరవాది లక్ష్మీనారాయణ హైదరాబాద్లో శనివారం పదవీ స్వీకార ప్రమాణం చేయగా, జరిగిన సభ ఆశించిన స్థాయిలో సాగకపోగా, అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన అన్నారు. కేవలం ఆంధ్ర నాయకులకే పరిమితమైన ఈ సభకు తెలంగాణ నేతలెవరూ హాజరు కాలేదని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.
అమరవాది ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తెలంగాణ ఆర్యవైశ్య నేతలు, ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో బహిష్కరించడం ద్వారా అమరవాది వర్గానికి గట్టి బుద్ధి చెప్పారని శ్యామ్ విమర్శించారు. ముఖ్యంగా వైశ్య పితామహుడు గంజి రాజమౌళి గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త, వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ సుజాత వంటి హేమాహేమీలతో పాటు వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కోలేటి దామోదర్, ఉప్పల శ్రీనివాస్ గుప్త, బొల్లం సంపత్ వంటి వారు అమరవాది ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదన్నారు.
ప్రోటోకాల్ ఉన్న నాయకులు సైతం ఈ ‘అక్రమ ఎన్నిక’ను నిరసిస్తూ దూరంగా ఉండటం, అమరవాది వర్గం పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.గత 11 ఏళ్లుగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అమరవాది వర్గానికి తెలంగాణ వైశ్య సమాజం ఈ విధంగా చెంపదెబ్బ కొట్టిందని శ్యాంసుందర్ మండిపడ్డారు. నిన్నటి వరకు ఆంధ్ర నేతలను విమర్శించిన వారే, నేడు టీజీ వెంకటేష్, కనకరాజు వంటి ఆంధ్ర నాయకుల అండ కోసం పాకులాడటం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
గతంలో శ్రీశైలం సత్రం విషయంలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టిన అమరవాది, ఇప్పుడు తన పదవి కోసం ఆంధ్ర నేతలను ఆశ్రయించడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం 2-3 ఓట్ల సాంకేతిక మెజారిటీతో, అంగబలం, అర్థబలంతో గెలిచినంత మాత్రాన అది నిజమైన విజయం కాదని, తనకు వచ్చిన 520 ఓట్లు నీతినిజాయితీకి ప్రతీకలని ఆయన స్పష్టం చేశారు.
కేవలం కొద్దిమంది రైస్ మిల్లర్ల నాయకులతో తూతూమంత్రంగా సభ జరుపుకోవడం హాస్యాస్పదమని, ఈ అక్రమ పదవి శాశ్వతం కాదని ఆయన హెచ్చరించారు. వైశ్య మహాసభలో జరిగిన అక్రమాలు, అన్యాయంపై త్వరలోనే న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని, తప్పు చేసిన వారికి కోర్టు ద్వారా బుద్ధి చెబుతామని శ్యాంసుందర్ హెచ్చరించారు.
పదవుల కోసం, వ్యాపారాల కోసం కొందరు బానిసలుగా మారవచ్చు కానీ, ఆత్మాభిమానం ఉన్న ఆర్యవైశ్య జాతి అన్యాయాన్ని ఎప్పుడూ సహించదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ పేరుతో ఆంధ్రా నేతలతో సభ నిర్వహించి అమరవాది వర్గం ఏకాకిగా మిగిలిపోయిందని, భవిష్యత్తులో తమ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.