– రిపోర్టు ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం
– జూన్ 1 లోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులు
– రెండేళ్లలో ప్రజా ప్రభుత్వంలో 67,760 ఉద్యోగ నియామకాలు
– ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం
– ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగ సంఘాల నాయకులు
– ముఖ్యమంత్రి నేతృత్వంలో గతంలో చాలావరకు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తుచేసుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు
– వైద్య విధాన పరిషత్ లో 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్న ఉద్యోగ సంఘాల నాయకులు
– పీఆర్సీ, హెల్త్ కార్డుల సమస్యలతోపాటు ఉద్యోగ సంఘాల ఇతర డిమాండ్లను పరిష్కరించాలని సీఎంకు విజ్ఞప్తి చేసిన నాయకులు
– ఈ నెల 5 న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతో పాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఉద్యోగుల JAC చైర్మన్ మారం జగదీశ్, TGEJAC చైర్మన్ లచ్చిరెడ్డి
హైదరాబాద్ : ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారు. ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగులకు ప్రతీ నెలా మొదటి తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నాం.
ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించాం. ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించాం.ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న టీచర్ల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తిచేశాం. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ రెండేళ్లలో ప్రజా ప్రభుత్వంలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టాం.
వంద రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 6 వేల కోట్లు చెల్లిస్తాం. ఈ నిధులను ఖర్చు ప్రాధాన్యతల నిర్ణయం మీదే. పీఆర్సీపై తక్షణమే రిపోర్టు అందించాలని అధికారుల కమిటీని ఆదేశించాం. రిపోర్టు ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటాం. జూన్ 1 లోగా ఆరోగ్య భద్రత కార్డులను ఉద్యోగులకు అందిస్తాం. ప్రతీ రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలి. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది.
మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నాం
– ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలను చాలా వరకు పరిష్కరించాం. మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నాం. రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు నిల్. పదేళ్ల బీఆరెస్ హయాంలో వేల కోట్ల బిల్లులు పేరుకుపోయాయి. దీనిపై ఒక కసరత్తు చేసి సమస్యల పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నాం.100 రోజుల్లో దాదాపు 6 వేల కోట్లు పెన్షనర్ బకాయిలు క్లియర్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వానికి ఉద్యోగులపై ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఉద్యోగుల హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవీయ దృక్పథంతో ఆలోచించారు. మీ సమస్యల పరిష్కారం కోసం సీఎం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారు.