బద్వేలులో బీజేపీకి ఘోర పరాజయం తప్పదు

– బద్వేలులో భారీ మెజార్టీతో గెలిపించి దేశానికి ఓ సందేశం ఇవ్వాలి
– బీజేపీ, జనసేన, టీడీపీల రాజకీయ రంగు బద్వేలు ఎన్నికలో బయటపడబోతోంది
– బాబు, పవన్ లు పోటీ పెట్టమని ప్రకటించి, బద్వేల్ లో ఏం రాజకీయం చేస్తున్నారో గమనించాలి
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రెస్‌మీట్‌
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…బద్వేల్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తున్నందున ఎన్నిక, పోలింగ్‌ అనివార్యం అయినా… దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి సుధ రేపు జరగబోయే ఎన్నికల్లో నూటికి నూరుపాళ్లు భారీ మెజార్టీతో గెలవబోతున్నారనేది సత్యం. అయితే గ్యారెంటీగా గెలిచేటటువంటి బద్వేల్‌లో వైయస్సార్‌ సీపీ నేతలు ఎందుకు శ్రమిస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మేము చాలా సూటిగా చెప్పే అంశం ఏంటంటే… మేము గెలిచే ఎన్నికే అయినా గత ఎన్నికల్లో వెంకటసుబ్బయ్యగారిని 44వేల ఓట్ల ఆధిక్యతతో ఇక్కడి ప్రజలు గెలిపించారు. బద్వేల్‌ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఒక్కటే. మా అభ్యర్థి సుధా ని గతంలో వచ్చిన మెజార్టీకన్నా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. దానికి ప్రజలంతా కూడా ఓటువేసేందుకు పోలింగ్‌లో పాల్గొనాలి. వన్‌సైడ్‌ ఎన్నిక అయినా.. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో వైయస్సార్‌ సీపీకి అత్యధిక మెజార్టీ రావాలనే ఉద్దేశంతో ప్రచారంలో పాల్గొన్నాం తప్ప, గెలుపు కోసమే రాలేదని చెబుతున్నాం.
ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశించేది ఒక్కటే. నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఓటర్‌ పోలింగ్‌లో పాల్గొని ఓటు వేయడమే. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిరంతరం శ్రమిస్తూ రెండున్నర ఏళ్ల పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. మమ్మల్ని నిలబెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో చెప్పమంటే కొన్నింటి పేర్లు చెప్పలేక మర్చిపోయే పరిస్థితి. ఎందుకంటే, రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలో కూడా ఎక్కడా అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పరిస్థితి.
బద్వేల్‌ ప్రచారంలో పాల్గొన్నప్పుడు.. ఓటర్లు తమకు అందుతున్న సంక్షేమ పథకాలు తమ గడప వద్దకే తెచ్చి వాలంటీర్లు ఇస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలు సంక్షేమ పథకాల అమలు పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలు అందిస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. బద్వేల్‌లో వైయస్సార్‌ సీపీకి ఎంత మెజార్టీ రాబోతున్నది అనేదే అందరూ చర్చిస్తున్నారు. కచ్చితంగా భారీ మెజార్టీ వస్తుంది.
జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలి? రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ చీల్చితే… బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా అమలు చేయలేదు. వీరిద్దరికీ ఎందుకు ఓటు వేయాలి? అని బద్వేలు ప్రజలు గుర్తు చేస్తున్నారు. బీజేపీకి ఘోర పరాజయం తప్పదు. ఈ సందేశాన్ని దేశ, రాష్ట్ర ప్రజలకు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ లు బద్వేల్‌లో పోటీ పెట్టనని చెప్పి, ఇక్కడ ఏం రాజకీయాలు చేస్తున్నాయో గమనించాలి. వాస్తవానికి బీజేపీ-జనసేన కలిసి సయోధ్యతో రాజకీయ ప్రయాణం చేస్తున్నాయి. మరి పోటీ పెట్టనని ప్రకటించిన జనసేన నాయకులు బీజేపీ వారితో కలిసి ప్రచారం చేస్తున్నాయి కదా? బయట ఒకటి చెప్పిన పవన్‌ కల్యాణ్‌… లోపల మరొకటి చేస్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పవన్‌ ద్వంద వైఖరి ఎందుకు అవలంభిస్తున్నారో చెప్పాలి? వీళ్ళ రాజకీయ పార్టీల రంగు ఏంటో బద్వేల్‌ ఎన్నికల్లో బయటపడబోతుంది.
కాంగ్రెస్‌, బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయో 2వ తేదీన కౌంటింగ్‌లో తేలబోతుంది. ప్రజలు చక్కని, స్పష్టమైన తీర్పును ఇస్తారని ఆశిస్తున్నాం. లక్షకు పైగా మెజార్టీ రావాలని మా కోరిక. అయితే లక్ష వస్తుందో, అంతకంటే ఎక్కువే వస్తుందో పోలింగ్‌ పర్సెంటేజీ ఎంత అవుతుందో తెలిస్తే కానీ మనం చెప్పలేం.
బద్వేల్‌ ప్రజలు ఏవిధంగా స్పందిస్తారు, ఎలాంటి తీర్పును ఇవ్వబోతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్షేమ ఫలాలు అందుకున్న ఏ ఒక్కరు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేసి, బద్వేల్‌లో బ్రహ్మాండమైన విజయాన్ని వైయస్సార్‌ సీపీకి ఇవ్వాలని బద్వేల్‌ ప్రజానీకాన్ని కోరుతున్నాం. మీడియా సమావేశంలో తిరుపతి ఎంపీ శ్రీ గురుమూర్తి, ఎమ్మెల్యే శ్రీ కోరుముట్ల శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు.