– ప్రత్యక్షసాక్షి వాంగ్మూలం
కర్నూలు: దేశంలో సంచలనం సృష్టించిన వి.కావేవి బస్సు దహనం కేసులో కొంత స్పష్టత వచ్చింది. ఇప్పటివరకూ బైక్‌ను బస్సు ఢీ కొట్టిందని ప్రచారం జరుగుతుండగా.. అది అబద్ధమని తేలింది. బైక్ వెనక కూర్చుని గాయపడిన ఎర్రిస్వామిని పోలీసులు విచారించారు.
ఎర్రిస్వామి కథనం ప్రకారం.. శివశంకర్, అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఇద్దరూ బైక్‌పై లక్ష్మీపురం నుంచి రాత్రి 2 గంటలకు బయలుదేరారు. ఎర్రిస్వామిని ఇంటి వద్ద దించేందుకు శివశంకర్ తుగ్గలి బయల్దేరాడు. మార్గమధ్యంలో కియా షోరూం వద్ద ఓ పెట్రోల్ బంకులో ఇంధనం నింపుకున్నారు. రోడ్డుపైకి వచ్చిన కొద్దిసేపటికే వారి బైక్ అదుపుతప్పి స్కిడ్ అయింది.
వేగంగా కుడివైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలైన ఎర్రిస్వామి, రోడ్డుపై ఎగిరిపడిన తన స్నేహితుడిని, రోడ్డు మధ్యలో ఉన్న బైక్ ను పక్కకి తీయాలని అనుకున్నాడు.
శివశంకర్‌ను రోడ్డు పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి ప్రయత్నిస్తున్న సమయంలోనే, ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చింది. రోడ్డు మధ్యలో పడి ఉన్న వారి బైక్‌ను చాలాదూరం ఈడ్చుకెళ్లింది. దాంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి.