Suryaa.co.in

Andhra Pradesh

బస్సు యాత్రను ‘క్షమాపణ యాత్ర’గా మార్చాలి

-బస్సు యాత్రకు ముందే తానిచ్చిన హామీల మోసానికి సమాధానం చెప్పాలి
-పాదయాత్ర, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 85శాతం అమలు చేయలేదు
-హామీలు అమలు చేయకుండానే 99% చేశానంటూ ప్రజల్ని మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పాలి
-అందుకే ‘మేమంతా సిద్ధం’ అనే బస్సు యాత్రను ‘క్షమాపణ యాత్ర’గా మార్చుకోవాలి
-టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

ఐదేళ్లుగా గడప దాటి బయటకు రాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఇప్పుడు బస్సు యాత్ర అంటూ ప్రజల్లోకి వెళ్లే కనీస అర్హత లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టి, ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మాకు ఓట్లు వేయమని ప్రజల్ని అడుగుతానంటున్నారు. వారు బస్సు యాత్రకు వెళ్లడంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, బస్సు యాత్రకు వెళ్లే ముందు ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరుతున్నాం. ప్రజల అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాలని అడుగుతున్నాం.

పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు 730కి పైగా హామీలిచ్చారు. ఆ హామీల్లో ఎన్ని నెరవేర్చారో సమాధానం చెప్పమని మేము అడుగుతున్నాం. 730 హామీలిచ్చిన జగన్మోహన్ రెడ్డి అందులో 85శాతం అంటే 631కి పైగా హామీలు అమలు చేయలేదు. దీనిపై బాధ్యతగల ప్రతిపక్షంగా ఇప్పటికే పుస్తకం కూడా ఆవిష్కరించాం. రాష్ట్ర ప్రజలకు పంచాం.

దానికి ప్రజలకు సమాధానం చెప్పకుండా.. 99శాతం హామీలు అమలు చేశామంటూ ముఖ్యమంత్రి హోదాలో అబద్దాలు చెప్పడం బాధాకరం. ఏ ఊరికి ఏ హామీ ఇచ్చారో.. వాటిని ఎందుకు అమలు చేయలేదో, ఎందుకు తుంగలో తొక్కారో ఆయా ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలి. మేమంతా సిద్ధం అంటున్న వారు ఎలా మీరు సిద్ధమో సమాధానం చెప్పాలి. మరోసారి హామీల పేరుతో మోసం చేయడానికి సిద్ధమా? మరోసారి మాయ చేసేందుకు సిద్ధమా అని అడుగుతున్నాం.

ఈ మేరకు పాదయాత్ర, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు సంబంబంధించిన వీడియో ప్రదర్శించారు. మద్య నిషేధం, ప్రత్యేక హోదా, 45 ఏళ్లకే పెన్షన్, 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, వారంలో సీపీఎస్ రద్దు లాంటి 99 హామీలతో కూడిన వీడియోను చూపించారు.

మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పింది మీరు కాదా? మద్య నిషేధం చేయకపోగా నాసిరకమైన మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్ది లక్షల మంది ఆరోగ్యం పాడు చేసింది మీరు కాదా. మీ నాసిరకమైన మద్యం తాగి వేలాది మంది ప్రాణాలు కోల్పోయింది నిజం కాదా? వారి భార్యల మాంగళ్యాలు తెగి మంటల్లో కాలిపోయింది నిజం కాదా? అందుకే రాష్ట్రంలోని ప్రతి మహిళకూ క్షమాపణ చెప్పి బస్సు యాత్ర ప్రారంభించండి.

ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా, 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డీఎస్సీ ఇస్తానని హామీలిచ్చి అమలు చేయనందుకు రాష్ట్రంలోని యువతకు క్షమాపణలు చెప్పి బస్సు యాత్ర ప్రారంభించాలి. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా, ఉద్యోగాల విప్లవం సృష్టిస్తానని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక కేంద్రం ముందు తన మెడలు వంచినందుకు రాష్ట్ర ప్రజానీకానికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. తర్వాతే క్షమాపణలు చెప్పి బస్సు యాత్ర ప్రారంభించాలి.

వారంలో సీపీఎస్ రద్దు చేసేస్తానంటూ బల్లగుద్ది మరీ చెప్పి అమలులో మోసం చేసిన జగన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగికి క్షమాపణలు చెప్పి బస్సు యాత్ర ప్రారంభించాల. పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల్ని జలయజ్ఞం ద్వారా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తామన్నారు. రైతులకు పగటి పూటే ఎలాంటి అవాంతరాలు లేకుండా 9 గంటల విద్యుత్ సరఫరా అన్నారు.

ఉచితంగా బోర్లు, ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీ, గిట్టుబాటు ధరలు, పంటకు ముందే మద్దతు ధర ప్రకటిస్తా అంటూ హామీలిచ్చారు. ఐదేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా అమలు చేయనందుకు రాష్ట్రంలోని రైతాంగానికి జగన్ రెడ్డి క్షమాపణ చెప్పి తన బస్సు యాత్ర ప్రారంభించాలి. ఉచిత వైద్యం హామీ గాలికొదిలారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో వైద్యానికి నిరాకరిస్తున్నాయి.

ఇలా.. ఒక్కటేమిటి.. ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలి దగా చేసినందుకు రాష్ట్ర ప్రజానీకానికి జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. బస్సు యాత్రకు ‘క్షమాపణ యాత్ర’గా పేరు మార్చి తన బస్సు యాత్ర కొనసాగించాలి.

జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏ వర్గమైనా సంతోషంగా ఉందా అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుండి.. వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు ఎవరు కూడా సంతోషంగా లేరు. అలాంటి మీకు మరోసారి ఓటు అడిగే హక్కుందా అని నిలదీశారు. బడిపిల్లల చిక్కీల బిల్లులు, ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు క్లియర్ చేయడానికి డబ్బులు లేవంటారు. మొన్న చేయూత పేరుతో బటన్ నొక్కినా, తర్వాత డబ్బులు పడతాయని నమ్మించి వంచించారు. ఇప్పటికీ ఎవరికీ రూపాయి పడలేదు.

కానీ, 5కిమీల దూరం వెళ్లడానికి హెలికాప్టర్ ఎక్కుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. ఐదేళ్లలో ఏ రోజూ ప్రజల వద్దకు వెళ్లలేదు. ఎందుకు వెళ్లడం లేదంటే ప్రాణ హాని ఉందని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఏ వర్గం నుండి మీకు ప్రాణహాని ఉందో సమాధానం చెప్పాలి. ప్రాణహాని ఉందంటూ ప్రత్యేక వ్యవస్థల్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల్ని కనీసం పట్టించుకోని మిమ్మల్ని ప్రజలు ఎలా పట్టించుకుంటారు?

ఎప్పుడు ఐదేళ్ల పాలన పూర్తవుతుందా, జగన్ రెడ్డి అరాచక పాలనకు ఎప్పుడు అంతం పలుకుదామా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. హామీల అమలులో చేసిన మోసాన్ని తలచుకుని రగిలిపోతున్నారు. ఓటు అనే ఆయుధంతో వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు కసితో ఎదురు చూస్తున్నారు.

ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ప్రజల్ని హామీల పేరుతో దగా చేసినందుకు తక్షణమే ఈ బస్సు యాత్రకు ‘క్షమాపణ యాత్ర‘గా పేరు మార్చాలి.  ప్రజల్ని క్షమాపణ అడిగిన తర్వాతే బస్సు యాత్ర ప్రారంభించాలి. అలా కాదు.. నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గు అనుకుంటే ఎవరేం చేయలేరని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE