అమరావతికి లక్షా 10వేల కోట్లు కావాలన్న సీఎం మాట పచ్చి అబద్ధం

-మిగిలిన రెండు ప్రాంతాలను రెచ్చగొట్టేందుకే ఆర్థిక నిందలు
-8 ఏళ్లకు సిఆర్డీఎ అడిగింది కేవలం 12,600 కోట్లు
-ఏటా ప్రభుత్వం చేయాల్సిన సాయం రూ.1575 కోట్లు మాత్రమే
-ఆర్థిక బూచి చూపెట్టి భయపెట్టాలన్నది మరో వ్యూహం
-అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య

అమరావతిని అంతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు వేసిన పిల్లి మొగ్గలు, ఆడిన అబద్ధాలు చాలక, ఒక్క అమరావతి కే లక్షా పదివేల కోట్లు ఖర్చు అవుతుందని అసెంబ్లీ వేదికగా పచ్చి ఆర్థిక అబద్ధం చెప్పారని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక నిందలు వేస్తే,సామాన్య ప్రజల్లోనూ, మిగిలిన రెండు ప్రాంతాల్లోనూ రాజధానికి వ్యతిరేకత తీసుకు రావచ్చు అన్నది సిఎం వ్యూహం అని తెలిపారు.

అమరావతికి లక్షా పదివేల కోట్లు కావాలని, వందేళ్లు పడుతుందని, అప్పటికి ఎన్ని లక్షల కోట్లు అవుతుందో అని,ఇంత డబ్బు ఒక ప్రాంతానికే పెట్టాలా? అంటూ నట చక్రవర్తి లా నటించి చెప్పారని పేర్కొన్నారు. మూడేళ్లలో అమరావతికి మూడు రూపాయలు పెట్టకపోయినా, అమరావతి నుంచే పాలన జరుగుతుందని గుర్తు చేశారు. 2018- 19 నుంచి 2025 -26 వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఆర్డీఏ కోరిన ఆర్థిక సహకారం కేవలం రూ.12,600 కోట్లు మాత్రమే అని, అంటే 8 ఏళ్లకు ఏటా కేవలం రూ.1575 కోట్లు కోరి, దీన్ని కూడా 2037 నాటికి తిరిగి ప్రభుత్వం కు చెల్లించేలా సిఆర్డిఏ ప్రణాళిక రూపొందించుకున్నట్లు చెప్పారు.

విభజన చట్టం ప్రకారం కేంద్ర దగ్గర్నుంచి నూతన రాజధాని కి నిధులు తెచ్చు కోవాల్సి ఉందని తెలిపారు. రాజధాని నిర్మాణం అంటే కేవలం భవంతులు, బిల్డింగ్ లు కావని అన్నారు. ఒక పరిణామం క్రమంలో జరిగేదే అభివృద్ధి అని, భాగ్యనగరం అభివృద్ధి అలానే జరిగింది అని చెప్పారు. ఇలాంటి నిజాలను వక్రీకరించినట్లు లక్షల కోట్లు అంటూ ఆర్థిక బూచి చూపెట్టి భయ పెట్టాలను కోవటం పాలకులకు సరైంది కాదని తెలిపారు.

ఇప్పటికి ప్పుడు రాజధానికి నిధులు ఖర్చు చేయాల్సి అవసరం కూడా లేదని, పరిపాలనకు కావాల్సిన అసెంబ్లీ, సచివాలయం, న్యాయస్థానం మూడూ ఉన్నాయని గుర్తు చేశారు. కేవలం రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లను అభివృద్ధి చేసి, 80శాతం,90శాతం పూర్తయిన భవన సముదాయాల పనులను చేస్తే సరిపోతుందని అన్నారు.

కట్టిన అసెంబ్లీ నుంచి కట్టని అమరావతి అంటూ సిఎం ప్రసంగం చేయటం, మంత్రులు బల్లలు చరచటం ఈ శతాబ్దపు గొప్ప చిత్రంగా అభివర్ణించారు. ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉంటుందన్న సంగతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అని,కానీ 2024 ఎన్నికల్లో ఆయనకు ఒక రాజకీయ నినాదం, ఆయుధం కావాలని, అది మూడు రాజధానుల వికేంద్రీకరణను తెరపైకి తెచ్చినట్లు చెప్పారు.2019లో చేపట్టిన విశ్వసనీయత ఈ సారి పని చేయదని, కొత్త నినాదం చేయాల్సిన అవసరం ఉందని, అందుకే ప్రాంతాల మధ్య విభజన రేఖ గీసి లబ్ధి పొందాలన్నదే సిఎం అభిమతంగా బాలకోటయ్య అభిప్రాయ పడ్డారు.

Leave a Reply