Suryaa.co.in

Andhra Pradesh

వైసిపి విధానాలనే కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం

– చైర్మన్ చేసిన ప్రకటనే ఈ ఘటనకు కారణం
– మృతుల కుటుంబాలకు రూ.50 వేలు, క్షతగాత్రులకు తక్షణ ఆర్థిక సాయం అందజేసిన బిసివై రామచంద్రయాదవ్
– టిటిడి బోర్డును రద్దు చేయాలి
– బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
– బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ డిమాండ్

తిరుపతి: గోవింద నామ స్మరణతో మార్మోగాల్సిన పవిత్ర పుణ్య క్షేత్రం…మరణ ఘోషతో విలపించడం చాలా బాధాకరమన్నారు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్. వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీలో జరిగిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. గురువారం ఆయన తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారికి తక్షణ ఆర్థిక సాయం అందజేశారు.

గతంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పేరుతో రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండేదని, వైసిపి ప్రభుత్వ హయాంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు శ్రీకారం చుట్టి, తిరుపతిలో టోకెన్ల విధానాన్ని ప్రవేశ పెట్టారన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇదే విధానాలపై విమర్శలు గుప్పించి అధికారంలోకి వచ్చాక వాటిని కొనసాగించడం దేనికి నిదర్శనమో చెప్పాలన్నారు. శ్రీవాణి టిక్కెట్ల విషయంలో కూడా రాద్దాంతం చేసిన కూటమి పెద్డలు… అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేయలేదని గుర్తు చేశారు. ప్రక్షాళన చేయాల్సింది వ్యవస్థలను కాదని, ప్రభుత్వ పెద్దల ఆలోచనలని ఆయన దుయ్యబట్టారు.
అనంతరం రుయా మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 వేల రూపాయల సాయాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం చాలా దారుణమన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చిన భక్తుల పట్ల ఇలా వ్యవహరించడం క్షమించరాని నేరమన్నారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి ధర్మకర్తల మండలి విఐపిల సేవలో తరిస్తోందని దుయ్యబట్టారు. ఆధ్యాత్మిక చింతన, అనుభవం లేని వారికి టిటిడి ధర్మకర్తల మండలిలో చోటు కల్పిస్తే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయన్నారు. వెంటనే టిటిడి ధర్మకర్త మండలిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టిటిడి ధర్మకర్తల మండలిలో చోటు కల్పించే సందర్భంలో సభ్యుల నుంచి స్థానికంగా నివాసం ఉంటామని డిక్లరేషన్ తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకులకు, కార్పోరేట్లకు టిటిడిని పునరావాస కేంద్రంగా మార్చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, దేవుడి దగ్గర ఆటలు పనికిరావని ఎద్దేవా చేశారు. ఘటనకు సంబంధించిన సిసి కెమెరా ద్రుశ్యాలను, క్షతగాత్రుల వివరాలను బయటపెట్టాలన్నారు.

రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం

తిరుమల శ్రీవారి దర్శనం రికార్డుల కోసం టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్, ఇవో, అదనపు ఇవోలు పాకులాడుతున్నారన్నారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మందికి దర్శనం చేయిస్తే తమ పేరు మీద రికార్డులు ఉంటాయనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. రోజుకు లక్ష మందికి దర్శనం చేయించడం కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న రన్నారు. 24 గంటల వ్యవధిలో లక్ష మందికి దర్శనం చేయించాలంటే ఒక్కో భక్తుడికి కసీసం అర సెకను కూడా దర్శన భాగ్యం కలగదని తెలిపారు. విఐపిల సేవలో తరిస్తూనే సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

టిటిడి ఛైర్మన్ చేసిన ప్రకటనే ఈ ఘటనకు కారణం

వైకుంఠ ఏకాదశితో పాటు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలంటే టోకెన్లు ఉండాల్సిందేనని, టోకెన్లు లేకపోతే దర్శనం ఆశించవద్దని టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు చేసిన ప్రకటనతోనే భక్తులు పెద్ద సంఖ్యలో టోకెన్ల కోసం బారులు తీరారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టోకెన్లు లేకపోతే తిరుమలకు వెళ్లలేమనే ఆందోళనతోనే భక్తులు ఒక రోజు ముందు నుంచే టోకెన్ల కోసం క్యూ లైన్లలోకి వచ్చారని తెలిపారు. సామాన్య భక్తులకు దర్శనం కోసం నిర్బంధ టోకెన్ల విధానం పెట్టడం సరికాదన్నారు. టిటిడి ఛైర్మన్ ఆ ప్రకటన చేయకపోతే ఈ ఘటన జరిగేది కాదన్నారు రామచంద్రయాదవ్.

LEAVE A RESPONSE