– ఒక నిండు ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో.. చోటుచేసుకున్న ప్రమాదమిది
– సున్నితమైన అంశంపై విపక్షాలు రాజకీయం చేయకుండా సహకరించాలి
– బాధ్యతారహితంగా పనిచేసినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు
– తిరుపతి రుయా ఆస్పత్రిలో బాధిత కుటుంబాలకు హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శ
తిరుపతి: ఒక నిండు ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో తిరుపతిలోని బైరాగిపట్టెడ తొక్కిసలాట జరిగిందని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఒక ప్రాణం కాపాడబోయి ఎక్కువ రద్దీ కారణంగా జరిగిన అనుకోని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం ఎంతో దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలను తిరుపతి రుయా ఆస్పత్రిలో హోంమంత్రి అనిత పరామర్శించారు. చనిపోయినవారిని తలచుకుని విలపించిన బాధిత కుటుంబసభ్యులను ఆమె ఓదార్చారు.
తన తమ్ముడి భార్యను పోగొట్టుకున్నానంటూ ఆ తమ్ముడికి ఏం సమాధానం చెప్పాలని ఏడుస్తున్న మహిళను చూసి హోమంత్రి చలించిపోయారు. అన్ని విధాల అండగా ఉంటామని మృతుల కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
బాధ్యతారహితంగా పనిచేసినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు చేపడతామన్నారు. చనిపోయినవారిలో విశాఖ జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారన్నారు. జరిగిన ఘటనపై బాధితులు, కలెక్టర్, ఎస్పీల ద్వారా హోంమంత్రి అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్యూ లైన్ లో నిర్వహణ భక్తుల భద్రతను పెంచినట్లు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించినట్లు తెలిపారు.
సున్నితమైన ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయకుండా సహకరించాలి:
వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడాన్ని రాజకీయం చేయకుండా సహకరించాలని హోంమంత్రి అనిత విపక్షాలను కోరారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఇటువంటి కష్టం కలగడం విచారకరమన్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిన బైరాగి పట్టెడ లోని ఎంజీఎం ఉన్నత పాఠశాల వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ కేంద్రానికి పక్కన ఉన్న మునిసిపల్ పార్క్, సదరు స్కూల్ సంఘటన జరిగిన ప్రాంతాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి హోంమంత్రి పరిశీలించారు. హోంమంత్రితో పాటు బాధితులను పరామర్శించిన మంత్రుల బృందంలో రెవెన్యూ శాఖ మంత్రి , జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు.