– టీడీపీకి 20 లక్షల విరాళం ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తనయుడు భరత్
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఇది వారసుల యుగం. యువ‘గళం’ పెరుగుతున్న కాలం. తండ్రులు జనక్షేత్రంలో బిజీగా ఉంటే, తనయులు జనాలకు ఏం కావాలో తెరవెనక మంత్రాంగం నడుపుతున్న కాలం. సో..రాబోయేది ‘యువ’యుగమే. ఇప్పుడు రాజకీయాల్లో చాలామంది సీనియర్ల తనయులు, దాదాపు రాజకీయ తెరంగేట్రం చేశారు. అంటే దాదాపు వారి కుర్చీల్లో కర్చీఫుఉ వేశారన్నమాట! నియోజకవర్గాల్లో కార్యకర్తల ‘మంచి సెబ్బర్లన్నీ’ తనయులే చూసుకుంటున్నారు. తండ్రులకు చెప్పలేనివి తనయులకు చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు ఉండి నియోజకవర్గంలోనూ సేమ్ సీన్!
జగన్ ఐదేళ్ల జమానాలో.. ప్రజాస్వామ్యం నిప్పులమీద నడిచిన కాలంలో.. నాటి జగన్ అప్రజాస్వామిక పాలనపై తన గళంతో చండ్రనిప్పులు కురిపించి, చావుదాకా వెళ్లి.. కూటమిలో సమరోత్సాహం నింపిన, ‘పొలిటికల్ రెబల్‌స్టార్’ రఘురామకృష్ణంరాజుకూ ఆ వరసలో వారసుడొచ్చేశారు. ఆయన తనయుడు, యువ పారిశ్రామికవేత్త భరత్ మహానాడులో పార్టీ కోసం 20లక్షల రూపాయల విరాళం స్వయంగా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడుకు అందించారు.
యువ పారిశ్రామికవేత్తయిన భరత్ పూర్తిస్థాయిలో వ్యాపార నిర్వహణలో ఉంటారు. అటు తండ్రి వ్యాపార సామ్రాజ్యం చూసుకుంటూనే.. ఇటు తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న ఉండి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల కష్టసుఖాలు చూసుకుంటున్నారు. నిజానికి భరత్‌కు రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేకపోయినా, గత ఎన్నికల్లో ప్రచార నిర్వహణ, కార్యకర్యలతో సమన్వయం, తెరచాటు మంత్రాంగం అంతా తానై నడిపించారు.
దానితో ఉండి కార్యకర్తలతో ఏర్పడ్డ అనుబంధాన్ని అలా కొనసాగిస్తున్నారు. నెలకు మూడు, నాలుగుసార్లు ఉండికి వచ్చే భరత్ చుట్టూ యువకులు కాకుండా.. సీనియర్ కార్యకర్తలు మూగిపోతుండటం విశేషం. అంటే తండ్రికి చెప్పలేని విషయాలన్నీ తనయుడికి చెబుతుంటారన్నమాట.
మామూలుగానే రాజకీయాల్లో ఎప్పుడో ముదిరిపోయిన రాజుగారంటే ,అక్కడి సీనియర్లకు కొద్దిగా జంకు.ఆవులించకుండానే పేగులు లెక్కబెట్టగల రాజుతో కంటే, వాళ్లు ఆయన తనయుడు భరత్‌తోనే అన్ని సంగతులు చెప్పుకుంటారట. అందుకే ఉండిలో భరత్‌కు అంత క్రేజ్.
ఇటీవల భరత్ పుట్టినరోజున నియోజకవర్గంలో 200 మంది రక్తదానం చేయడం ఒక విశేషమయితే.. ఆరోజు తిరుపతికి వెళ్లిన ఆయనను స్వాగతిస్తూ, భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇది ఇంకో విశేషం. ఎక్కడ ఉండి? ఎక్కడ తిరుపతి? అలా.. మన ‘తెలుగు యంగటర్కు’లంతా ఆవిధంగా ముందుకెళుతున్నారన్నమాట!