– జగన్‌ను తిట్టడం హీరోయిజం కాదు
– హీరోయిజం అంటే హామీలు అమలు చేయడం
– కానీ ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చలేదు
– ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు
– ఆరోగ్యశ్రీ లేక పేదలు అప్పుల పాలవుతున్నారు
– రైతులకు ఏ పంటకూ మద్ధతు ధర రావడం లేదు
– జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం
– మీ ప్రతి కష్టం అన్యాయం గమనిస్తున్నా
ను
– మీకు అన్యాయం చేసిన వారి పేరు రాసుకొండి
– వారెవ్వరినీ వదిలి పెట్టం. ఎక్కడున్నా తీసుకొస్తాం
– రిటైర్డ్ అయినా కచ్చితంగా చట్టం ముందు పెడదాం
– వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తాం
వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ సమావేశం
తాడేపల్లి: మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామా అని, ఆ కార్యక్రమంలో చంద్రబాబు ఫోజులిస్తూ బిల్డప్ ఇస్తున్నారని, ఈ ఏడాదిలో ఏం చేశామన్నది చెప్పలేకనే ఈ హంగామా చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కడపలో మహానాడు నిర్వహణ హీరోయిజమ్ కాదన్న ఆయన, జగన్‌ను తిట్టడం హీరోయిజం కాదని.. అసలు హీరోయిజం అంటే హామీలు అమలు చేయడమని వెల్లడించారు.
కానీ ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చలేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశంలో గుర్తు చేశారు.
రెండు ప్రభుత్వాల మధ్య తేడాను ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేశామని మహానాడు వేదిక నుంచి చెప్పే ధైర్యం మీకుందా?. అలాగే రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా ధైర్యంగా చెప్పుకోగలరా?.
టీడీపీ కార్యకర్తలు ఏ ఇంటికి వెళ్లినా ఆ ప్రతి ఇంట్లో వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి వీళ్లు చెప్పిన మాటలు ప్రజలకు ఇవాల్టికీ గుర్తు ఉన్నాయి. అందుకే వాళ్లు ఏ ఇంటికైనా వెళ్లి ఆశీర్వదించమని కోరితే.. ప్రతి ఇంటిలోనూ చిన్నపిల్లల నుంచి ప్రశ్నించడం మొదలవుతుంది.
నా రూ.15 వేలు ఏమయ్యాయని అడుగుతారు. అదే ఇంట్లో నుంచి వాళ్ల అమ్మ, చిన్నమ్మ వచ్చి నాకు ఇస్తామన్న రూ.18 వేలు ఏమయ్యాని ప్రశ్నిస్తారు. అంతటితో ఆగకుండా ఆ తల్లుల అమ్మలు, అత్తగారు వచ్చి 50 ఏళ్లకు పెన్షన్ అన్నావ్. మా రూ.48 వేల సంగతేంటని నిలదీస్తారు. కండువా కప్పుకున్న ప్రతి రైతూ ఎన్నికలప్పుడు నీకు రూ.26 వేలు అన్నావు. వాటి సంగతేంటని అడుగుతాడు. అదే ఇంట్లో నుంచి ఉద్యోగం కోసం వేచి చూస్తున్న 20 ఏళ్ల యువకుడు నాకు ఇస్తానన్న రూ.36 వేలు పరిస్థితి ఏంటని నిలదీస్తాడు.
హీరోయిజం అంటే కడప జిల్లాలో మహానాడు పెట్టడం కాదు. హీరోయిజం అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చడం. అంతే తప్ప సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం హీరోయిజం ఎలా అవుతుంది? చంద్రబాబూ గుర్తు పెట్టుకో. మీ కార్యకర్తను ఇంటింటికీ తిప్పే సత్తా ఉందా? అని ప్రశ్నిస్తున్నాను. ఇది వైయస్సార్సీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి తేడా.
కడపలో మహిళలు చంద్రబాబు ఎప్పుడు ఉచిత బస్సు అని చెబుతాడా.. విశాఖపట్నం వెళ్లి వద్దామా అని ఎదురు చూస్తున్నారు. మరో చిన్న హామీ ఉచిత గ్యాస్. ఆ గ్యాస్ సిలిండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు.
మనకు ఎన్ని సమస్యలున్నా చిక్కటి చిరునవ్వునే చూపించాం. ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ఉన్న ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న వ్యక్తి ఎలా పాలన చేయాలో చూపించాం. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. ఇంగ్లిషు మీడియం పడకేసింది. మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫెల్ చెప్పిస్తూ.. దాన్ని ఒక పీరియడ్‌గా ఏర్పాటు చేస్తే వీళ్లు వస్తూనే దాన్ని ఎత్తేశారు. సీబీఎస్‌ఈ, నాడు–నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన లేదు.
ఏడాది కావస్తోంది. పిల్లలకు కట్టాల్సిన ఫీజులు సున్నా. మన హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే వాళ్లం. ఇవాళ ఫీజులు గురించి పట్టించుకునే నాధుడు లేడు. పిల్లలను చదవించలేక తల్లిదండ్రులు చదువులు మానిపించేస్తున్న పరిస్థితి నెలకొంది.
ఆరోగ్య శ్రీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. మన హయాంలో 1000 ప్రొసీజర్లను 3000కు తీసుకుని పోయి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించి, గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ అందుబాటులోకి తీసుకొచ్చాం. గవర్నమెంటు ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ అందుబాటులోకి తెచ్చాం.
అలాంటి పాలన మనం అందిస్తే, ఇవాళ పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రూ.300 కోట్లు చొప్పున ఏడాది బకాయిలు పెట్టారు. నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పేషెంట్లను చూడ్డం ఆపేశారు. ఇవాళ పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు.
ఆర్బీకేలు, ఇ–క్రాపింగ్, ఉచిత పంటల బీమా గాలికి వదిలేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద సీజన్ అయ్యేలోగా రైతులకు తోడుగా సాయం చేసే కార్యక్రమం నిలిచిపోయింది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. రైతులకు ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడం లేదు. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) మాత్రమే కాదు.. జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.10 వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో, పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా ఇవాళ రైతులకు ధరలు రావడం లేదు.
మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపి, మోసం చేశాడు. వాళ్లలో ఇప్పుడు ఒక్కరికీ మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చిన పాపాన పోలేదు. వేతనాల సవరణ (పీఆర్‌సీ) ప్రస్తావన లేదు. మూడు డీఏలు పెండింగ్. అందుకే ఉద్యోగులు ఇవాళ చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని తల పట్టుకుంటున్నారు.
మరి ఆరోజు జగన్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?. నేను ఆశపడింది ఒక్కటే. నా మరణం తర్వాత ప్రతి ఇంట్లో బతికే ఉండాలని ఆశ పడ్డాను. అందుకే ఎక్కడా రాజీ పడలేదు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోగలిగాను.
అదే ఇవాళ చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కడం లేదంటే.. ప్రతి దాంట్లోనూ దోచుకోవడం. దోచుకున్నది పంచుకోవడం. అదే చేస్తున్నాడు.
కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత
ఈసారి జగన్ 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నాడు మనం అధికారంలోకి వస్తూనే కోవిడ్ వచ్చింది. జూన్‌లో అధికారంలోకి వస్తే మార్చిలో కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలు పూర్తిగా ప్రజల ఆరోగ్యం మీద, వారికి మంచి చేసే విషయంపైనే దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. కానీ ఈసారి జగన్ 2.0లో అలా ఉండదు. మనం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు. కార్యకర్తలకూ ప్రాధాన్యత ఉంటుంది. కార్యకర్తలు అన్నింటికన్నా పైస్థాయిలో ఉంటారు. ఆ విధంగా కార్యకర్తల బాగోగులన్నీ చూసుకుంటాం.
వారెక్కడున్నా చట్టం ముందు నిలబెడతాం:
ఇప్పుడు మన పార్టీ కార్యకర్తల ప్రతి కష్టం, వారికి జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నాను. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. మనం ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో వారి పేర్లు రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తాం. చేసిన వాళ్లే కాదు. వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించిన వారినీ వదిలిపెట్టం. వారు సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్డ్ అయినా సరే అందరినీ తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం. అన్యాయాలు చేయడానికి వీరికి యూనిఫాం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా విధులు నిర్వర్తించడానికి వీరికి యూనిఫాం ఇచ్చారు.
.