Suryaa.co.in

Telangana

ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ 12 అంశాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది

– కాంగ్రెస్ ను గెలిపించుకుంటేనే దళిత గిరిజనులకు భవిష్యత్తు
– నీళ్లు రాకపోగా, ఆత్మగౌరవం లేకుండా, స్వేచ్ఛను సైతం బిఆర్ఎస్ ప్రభుత్వం హరించింది
– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

దశాబ్ధాల పాటు పోరాటం చేసి నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వేచ్ఛ కోసం తెలంగాణ తెచ్చుకుంటే… నీళ్లు రాకపోగా, ఆత్మగౌరవం లేకుండా, స్వేచ్ఛను సైతం బిఆర్ఎస్ ప్రభుత్వం హరించింది.

తెలంగాణ ప్రజానీకానికి సంపదలో భాగస్వామ్యం చేయడానికి, దళిత గిరిజనులు ఆత్మగౌరంతో బతకడానికి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం కోసం చేవెళ్లలో నిర్వహించిన ఈ సభ చారిత్రాత్మకం కానుంది.

ఏఐసిసి అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లోని అన్ని అంశాలు 2023-24 లో* కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేస్తాం. సంపద సృష్టించే భూమి, ఆత్మగౌరవంతో బతికేందుకు కావలసిన విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో దళిత గిరిజనులను హక్కుదారులుగా చేస్తాం.

పేద ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన అమరజీవి గద్దర్ అన్న ఆశయాలకు అనుగుణంగా ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లోని అంశాలను అమలు చేస్తామని, ఈ సభలో మరొకసారి గద్దరన్నకు నివాళులర్పిస్తున్నాం.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ నాయకుడిగా ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి చేవెళ్ల నుంచి పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు చేవెళ్లలో నిర్వహించే ఈ బహిరంగ సభ మరొకసారి కాంగ్రెస్ను పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి చారిత్రాత్మకం కానుంది.

తెలంగాణ సీఎల్పీ లీడర్ గా నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేసిన సమయంలో లక్షల మంది ప్రజలు తమ భూమి, ఇండ్లు, ఆర్థిక, ధరణి, ఇంటి స్థలాల సమస్యలను విన్నవించుకున్నారు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో దళిత గిరిజనులు చెప్పిన అనేక సమస్యలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు అనేకమంది కాంగ్రెస్ పార్టీ మేధావుల సలహాలు, సూచనలు తీసుకొని ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో పొందుపరిచిన అంశాలను నివేదికగా తయారు చేసి ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి దృష్టికి తీసుకువెళ్లి ఈరోజు బహిరంగ సభలో ప్రకటన చేయడం జరిగింది.

మూడెకరాల భూమి ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ మూడెకరాల భూమి ఇవ్వకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచిన లక్షల ఎకరాల భూములను బలవంతంగా గుంజుకుంటున్నది.

చేవెళ్ల నియోజకవర్గం చందనవెల్లి గ్రామంలో 18 వందల ఎకరాలు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సుమారు 8 వేల ఎకరాలు, ఇలా లక్షల ఎకరాలను దళిత గిరిజనులకు ఇచ్చిన భూములను కేసిఆర్ ప్రభుత్వం బలవంతంగా వెనక్కి గుంజుకుంటున్నది.

బిఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా గుంజుకున్న భూములను 2023 -24 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ భూములను ఎవరికి కేటాయించిన వెనక్కి తీసుకొని సంబంధిత లబ్ధిదారులకు సంపూర్ణమైన హక్కులు కల్పించే విధంగా తిరిగి అప్పగిస్తాం.

యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో తీసుకువచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కి గిరిజనులకు పోడు భూములు లేకుండా చేస్తున్నది.

నీళ్లలో నుంచి చేపను బయటకు తీస్తే గిల గిల కొట్టుకున్నట్లుగా గిరిజనులను అడవుల నుంచి దూరం చేస్తే వారి పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలోనే మరణించే గిరిజనులకు అడవి ఇల్లు లాంటిది. వారిని అడవి నుంచి వేరు చేయడం సమంజసం కాదు.

దళిత గిరిజనుల కోసం చేవెళ్ల బహిరంగ సభలో ప్రకటించిన 12 అంశాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తాం. 2023- 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కార్యకర్తలు కంకణ బద్ధులై ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభలో ప్రకటించిన 12 అంశాలను గడపగడపకు తీసుకువెళ్లి దళిత గిరిజనులను సమయాతం చేసి పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చి చెయ్యి గుర్తుపై ఓట్లు వేయించాలి.

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ప్రకటించిన ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ 12 అంశాలను తూ.చ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. కాంగ్రెస్ ను గెలిపించుకుంటేనే దళిత గిరిజనులకు భవిష్యత్తు.

LEAVE A RESPONSE