– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
– అమరవీరుల స్థూపాన్ని పాలతో శుద్ధి
ప్రధాని వ్యాఖ్యల వెనుక తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసే కుట్ర దాగుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని MG రోడ్ లో గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నల్ల
జెండాలతో నిరసన తెలుపుతూ మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం బైక్ ర్యాలీగా బోట్స్ క్లబ్, ట్యాంక్ బండ్, BRK భవన్, AG ఆఫీస్ మీదుగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వరకు చేరుకొన్నారు.
ఆక్కడ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, MLC ప్రభాకర్, MLA లో దానం నాగేందర్, మాగంటి గోపినాద్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ లతో కలిసి అమరవీరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన పై పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడి చేసిన వ్యాఖ్యలు అమరవీరుల త్యాగాలను కించ పరిచేలా ఉన్నాయని అన్నారు. బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర విభజనపై వ్యాఖ్యలు అసంబద్ధమైనవని పేర్కొన్నారు.
కులాలు, మతాల మద్య చిచ్చుపెట్టి పాలన సాగించడం BJP ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, కలసిమెలసి ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజల మద్య కూడా చిచ్చుపెట్టేందుకు BJP ప్రయత్నిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
నాయకత్వంలో మిషన్ భగీరధ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబందు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని, దీనిని ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. పూటకో డ్రెస్ ను మార్చడంపై ఉన్న శ్రద్ధ దేశ ప్రజల అభివృద్ధి పై ప్రధానమంత్రి కి లేదని దుయ్యబట్టారు.
లాభాలలో ఉన్న LIC, సింగరేణి వంటి ప్రధాన రంగాలను ప్రైవేట్ కు దారాదత్తం చేస్తామని బహిరంగంగా సిగ్గులేకుండా చెపుతున్నారని అన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి జోలికి వస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని
హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుందని, రాష్ట్రం నుండి ఒక కేంద్రమంత్రి, ముగ్గురు MP లు ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇచ్చారో, ఏం చేశారో BJP నేతలు ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి KCR రాజ్యాంగాన్ని మార్చాలంటే కుక్కల్లా మొరిగిన BJP నేతలు ప్రధాని వ్యాఖ్యలపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాలని, వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని వినియోగించుకోవాలని, విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని ముఖ్యమంత్రి KCR కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తే దానిపై నోరు ఎందుకు మెదపరని ప్రశ్నించారు. BJP నేతల బాష, వైఖరిని చూసి ప్రజలు అసహ్యించు కుంటున్నారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. స్థానిక BJP నేతలు డిల్లీ వెళ్ళి ప్రధాని తో ప్రధాని క్షమాపణలు చెప్పించాలని, లేదంటే TRS పార్టీ శ్రేణులు BJP నేతలను అడ్డుకొని నిరసనలు తెలుపుతాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి, మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, ఉప్పల తరుణి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, కొలన్ బాల్ రెడ్డి, వెంకటేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.