దేనిపైనా నియంత్రణ లేని టీడీపీకి నిరంతరం భయం లేదా సంబరం

( విజయసాయిరెడ్డి, వైసీపీపీ నేత)

ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏ పార్టీ అయినా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ఉత్సాహంతో ముందుకు సాగాలి. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లు పరిపాలించిన తెలుగుదేశం ఓడిపోయింది. ఇదే ఒరవడి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామనే ఆశ కూడా ఈ పార్టీ నేతకు ఉండాలి. కానీ, ఆ పరిస్థితి టీడీపీలో కనపడడం లేదు.

పాలకపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకు జనంలో బలపడుతోంది. మూడేళ్ల పాలన తర్వాత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వంపై ఏమాత్రం ప్రజా వ్యతిరేకత లేదు. వాస్తవానికి దానిపై జనాదరణ పెరుగుతోందని తాజాగా అనేక సర్వేలు చెబుతున్నాయి. దీంతో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో అంతులేని గందరగోళం, అయోమయం పొంగిపొర్లుతున్నాయి. జోడు ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో మిత్రపక్షం ఏదీ లేక దిక్కులు చూడడం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ల ఫుల్‌ టైం వ్యాపకంగా మారిపోయింది.

ఏపీలో విపక్షానికి దారీతెన్నూ లేని ఈ అధ్వాన్న పరిస్థితుల్లో– హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర హోంమంత్రి పర్యటన తెలుగుదేశంలోను, ఆ పార్టీ ‘అగ్రనేతల్లో’ మరింత అయోమయాన్ని నింపింది. నగరం సమీపంలోని ఓ మీడియా గ్రూపు అధిపతి ఇంటికి ఈ బీజేపీ మంత్రి వెళితే–అది తమకు అనుకూల పరిణామమని ఈ పచ్చచొక్కాల పార్టీ నేతలు, కార్యకర్తలు అనుకున్నారు. మిత్రపక్షం లేక కునారిల్లుతున్న టీడీపీకి కేంద్రంలోని పాలకపక్షం అండ లేదా పొత్తు దొరకడానికి ఈ భేటీ నాందీ అవుతుందేమోనని వారు ఆశపడ్డారు.

అలాగే, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌.టి.రామారావు మనుమడైన తెలుగు సినీ హీరోకు ఇదే కేంద్రమంత్రిని ఓ హోటెల్‌ లో కలవడానికి ఆహ్వానం అందితే– ఇదే పసుప పచ్చ శిబిరం కంగారు పడిపోయింది. ఎక్కడ ఈ యువ హీరో బీజేపీకి మద్దతుదారుగా మారిపోతాడోననే భయం టీడీపీని చుట్టుముట్టింది. ఇలా తన నియంత్రణలో లేని పరిణామాలను టీడీపీ, దాని నేతలు అర్ధంచేసుకోలేకపోతున్నారు. అయితే బెంబేలెత్తిపోవడమో లేక అనవసరంగా సంబరపడి పోవడమో చంద్రబాబు అండ్‌ కంపెనీకి అలవాటుగా మారిపోయింది.

Leave a Reply