Suryaa.co.in

Features

దేశం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరచినట్లుంది

ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక సామాజిక మండలి  ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి రాజకీయ వేదిక ప్రతి సంవత్సరం జూలై నెలలో 8రోజులపాటు సమావేశమవుతుంది. ఈ సమావేశాల్లో సభ్యదేశాలు సమర్పించే  స్వచ్ఛంద జాతీయ సమీక్ష నివేదికలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రగతిపై సమీక్ష,  2030 అజెండా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అమలు చేయడానికి ఈ సమీక్షా నివేదికలు ఎంతో దోహదపడతాయి. ఆయా దేశాల ఆధ్వర్యంలో సమర్పించే  ఈ సమీక్షలన్నీ స్వచ్ఛందమైనవే. వివిధ దేశాలు తమ అనుభవాలను, విజయాలను, తాము ఎదుర్కొన్న  సవాళ్లను, నేర్చుకున్న పాఠాలను పరస్పరం పంచుకునేందుకు ఈ సమీక్షలు రూపొందిస్తారు.

ఏదైనా ఒక దేశానికి సంబంధించిన స్వచ్ఛంద జాతీయ సమీక్షా నివేదిక తయారీ ప్రక్రియ వివిధ వర్గాల భాగస్వామి వేదికగా ఉపయోగపడుతుంది. భారతదేశం తన తొలి నివేదిక 2017లో సమర్పించింది. సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2022 లేదా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ 2022లో భారతదేశం 121వ స్థానంలో నిలిచింది. ఈ ఇండెక్స్‌లో, దేశాలు 100కి స్కోర్‌తో ర్యాంక్ చేయబడ్డాయి. భారతదేశం స్కోర్ 60.03 గత సంవత్సరం భారతదేశం యొక్క ర్యాంక్ 117. ఇండెక్స్ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా దేశం యొక్క మొత్తం పురోగతిని కొలుస్తుంది. ఇండెక్స్‌లో ఫిన్‌లాండ్ అగ్రస్థానంలో ఉంది. దక్షిణాసియా  దేశాలలో పూర్తి దిగువన భారత్ చేరింది. పొరుగు దేశం పాకిస్థాన్ మనకంటే ఒక్క ర్యంకు ముందు ఉన్నది.   ఈ ర్యాంకింగ్‌లో మొదటి 5 దేశాలు  ఫిన్లాండ్, స్వీడన్,  డెన్మార్క్, జర్మనీ, బెల్జియం. ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2030 ఎజెండాలో భాగంగా సెప్టెంబర్ 2015లో UN జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.  ప్రపంచాన్ని మార్చడానికి 17 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు  పేదరికం వద్దు, శూన్య ఆకలి,  మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు,  నాణ్యమైన విద్య,  స్త్రీ పురుష సమానత్వం, పరిశుభ్రమైన నీరు మరియు పారిశుధ్యం,  సరసమైన మరియు స్వచ్ఛమైన శక్తి, మంచి పని మరియు ఆర్థిక వృద్ధ, పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలిక సదుపాయాలు, తగ్గిన  అసమానతలు,  స్థిరమైన నగరాలు మరియు సంఘాలు,  బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తి,  వాతావరణ చర్య,  నీటి క్రింద జీవితం,  భూమిపై జీవితం,  శాంతి మరియు న్యాయం బలమైన సంస్థలు, లక్ష్యాన్ని సాధించడానికి భాగస్వామ్యాలు. సుస్థిర అభివృద్ధిపై  భారతదేశానికి సంబంధించిన  స్వచ్చంద  జాతీయ సమీక్షను నీతీ ఆయోగ్ సమర్పించింది.

2022 వ సంవత్సరానికి సంబంధించిన ఈ సమీక్షను ఐక్యరాజ్యసమితికి చెందిన ఉన్నత స్థాయి జాతీయ వేదికపై నీతీ ఆయోగ్ సమర్పించింది. సుస్థిర  అభివృద్ధికి సంబంధించిన 17 లక్ష్యాల సాధనకు తీసుకోవలసిన తదుపరి చర్యలు, సమీక్ష కోసం ఈ సమీక్ష ను ఆవిష్కరించారు.  “క్రియాశీలక దశాబ్ది :  ప్రపంచ స్థాయి నుంచి స్థానిక స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు” అనే పేరుతో సమీక్ష నివేదిక  నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ సుమన్ బెర్రీ, నీతీ ఆయోగ్  ముఖ్య  కార్యనిర్వహణాధికారి అమితాబ్ కాంత్, సుస్థిర అభివృద్ధి అంశాల సలహాదారు శ్రీమతి సంయుక్త సమద్దార్   విడుదల చేశారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి సంక్షోభం తగ్గుదల నేపథ్యంలో ఈ ఏడాది సమావేశాన్ని   లో నిర్వహిస్తున్నారు. 2022 జూలై 10 న మొదలైన ఈ సమావేశం జూలై 16 వరకూ జరిగింది. ఈ  సమావేశంలో  47 సభ్యదేశాలు పాల్గొని తమ సమీక్షా నివేదికలను  సమర్పించారు. భారతదేశం రెండవసారి  2020వ సంవత్సరంలో  స్వచ్ఛంద జాతీయ సమీక్షా నివేదికను సమర్పించింది. భారథ్ తో పాటు రెండవసారి పాల్గొంటున్న బంగ్లాదేశ్, జార్జియా, కెన్యా, మొరాకో, నేపాల్, నైగర్, నైజీరియా, ఉగాండా వంటి దేశాలతో కలసి  తన సమీక్షా నివేదికను  సమర్పించింది. ఈ నివేదిక సమర్పణ లో భాగంగా ఒక లఘు చలనచిత్రాన్ని కూడా ప్రదర్శించారు. రెండవ స్వచ్ఛంద జాతీయ సమీక్ష నివేదికలో పొందుపరిచే అంశాలతో ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు. ప్రధానమైన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దేశం  సాధించిన  అభివృద్ధిని కూడా ఈ లఘుచిత్రంలో  వివరించారు.

సమావేశం ప్రారంభంలో నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్  మాట్లాడుతూ, కోవిద్  వైరస్  సవాళ్లను ఎదుర్కొనేందుకు పోరాటం సాగిస్తున్న అన్ని దేశాలకు తాము సంఘీభావం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్  మహమ్మారి విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద భారత్  చేపట్టిన కార్యక్రమంలో కీలక అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. “ఈ  పరిస్థితుల్లో మనం అన్ని విభేదాలకు అంతం పలకాలి. సుస్థిర అభివృద్థి లక్ష్యాల సాధన దిశగా ప్రగతిని వేగవంతం చేసేందుకు మనమంతా  ప్రస్తుత సంక్షోభాన్ని అవకాశాలుగా మలుచుకోవాలి. అందుకు సమైక్యంగా  కృషిచేయాలి” ఆయన తన ప్రారంభోన్యాసంలో పేర్కొన్నారు.  అభివృద్ధి లక్ష్యాల సాధనలో జరిగే కృషిలో ఎవరూ వెనకబడకుండా చూసేందుకు జరిగే ప్రయత్నాలను డా. రాజీవ్ కుమార్  వివరించారు. బహుముఖమైన పేదరికాన్ని తగ్గించేందుకు, అందరికీ ఆహార భద్రత, విద్య, విద్యుత్ సదుపాయం, కాలుష్యం లేని వంట ఇంధనం, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించే విషయంలో భారత్ సాధించిన గణనీయమైన ప్రగతిని ఆయన పేర్కొన్నారు. 50కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగించేలా ప్రపంచంలోనే అతి భారీ పథకం ఆరోగ్య బీమా కార్యక్రమం అమలు చేయడంలో భారత్ సాధించిన ప్రగతిని కూడా తెలియజేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకోసం అభివృద్ధి వేగవంతమయ్యేలా కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి, ఇప్పటికే అమలులో ఉన్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ముఖ్య కార్య నిర్వహణాధికారి అమితాబ్ కాంత్ చెప్పారు.  ఈ కృషిలో కొత్త విషయాలు తెలుసుకోవడం, తెలిసిన అంశాలను పరస్పరం  పంచుకోవడం వంటివి ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో వాటిని పంచుకుంటున్నారని ఆయన అన్నారు.  భారత్ ఈ ఏడాది సమర్పించిన స్వచ్ఛంద జాతీయ సమీక్ష నివేదిక, సంపూర్ణంగా సమాజానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా రూపొందించామని… ఈ నివేదిక రూపకల్పనలో స్థానిక పరిపాలన సంస్థలు నీతీ ఆయోగ్ ప్రమేయం కల్పించింది.

పౌర సమాజ సంఘాలు, స్థానిక సంఘాలు, ప్రైవేట్ రంగం ప్రతినిధులు, దయనీయమైన స్థితిలో ఉన్న పేద వర్గాలకు కూడా ప్రమేయం కల్పించారు. ఈ ప్రక్రియలో భాగంగా, భారత్ లోని ఐక్యరాజ్యసమితి సంస్థ ప్రతినిధులకు, పౌర సమాజ సంస్థలకు నీతీ ఆయోగ్ భాగస్వామ్యం కల్పించింది.  జాతీయ, ఉప జాతీయ స్థాయిలో 50 సంప్రదింపుల ప్రక్రియలు జరిగాయి. మహిళలు, బాలల, వయో వృద్ధులు, వికలాంగులు, హెచ్.ఐ.వి. బాధితులు తదితర వర్గాలకు చెందిన వెయ్యికిపైగా పౌర సమాజ సంఘాలు నీతీ ఆయోగ్ సంప్రదింపులు జరిపి ఈ సమీక్షా నివేదికను రూపొందించింది.    మన నేతల మాటల్లో అభివృద్ధి ఎప్పుడూ ఆకాశానికి పరుగులు తీస్తూనే ఉంటుంది. కానీ సగానికి పైగా దేశం అర్ధాకలితో అలమటిస్తూ ఉంటుంది.

మన వార్షికాదాయం పెరుగుదల ప్రపంచ దేశాలను అబ్బురపరుస్తూ ఉంటుంది. అయినా దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు అందని ద్రాక్షల ఊరిస్తూనే ఉంటాయి. మన జీడీపీ,సెన్సెక్స్‌ వృద్ధిరేట్లు అంతకంతకూ పెరుగుతూనే ఉంటాయి. అంతకు మించిన వేగంతో అసమానతలూ,  ఆకలిచావులూ వృద్ధి చెందుతుంటాయి. వాపును చూసి బలమనుకునే పరిస్థితికి తెచ్చారు. మన ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి లెక్కకు మించిన కొత్త కొత్త పథకాలెన్నో ప్రకటిస్తూనే ఉంటాయి. కానీ అవన్నీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో వికటిస్తూనే ఉన్నాయి. ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చట్టాలెన్నో ఉంటాయి. అయినా దేశం నిండా హత్యలు, లైంగిక దాడులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. మన పాలకులంతా అవినీతి నిర్మూలనకు నిరంతరం దీక్ష బూనుతూనే ఉంటారు, కానీ వారే రోజుకొకరు అవినీతి ఊబిలో కంపుగొడుతుంటారు. ఇటువంటి స్థితిలో అభివృద్ధి అంటే ఏమిటో అర్థంగాక 75 ఏండ్లుగా సామాన్య భారతమంతా సతమతమవుతూనే ఉంది.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

LEAVE A RESPONSE