13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల రాక బోగసేనా?

– హుద్ హుద్ తుఫాన్ కంటే… విశాఖలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమే ఎన్నో రెట్లు ఎక్కువ
– మా కుటుంబంలోనూ జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టాలనుకోవడం లేదా?
– పరిణితి చెందిన ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్
షర్మిల, విజయమ్మపై వైకాపా నేతలు చేస్తున్న కామెంట్లను జగన్ ఖండించాలి
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫాన్ కంటే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమే ఎన్నో రెట్లు ఎక్కువని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. విశాఖపట్నం కు జగన్మోహన్ రెడ్డి చేసిన ఘోరమైన అన్యాయానికి గాను ఆయన పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకడం లేదు. గతంలో విజయనగరం ఎంపీగా వ్యవహరించిన బొత్స ఝాన్సీని, విశాఖకు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఇంకా ఎంతోమంది అభ్యర్థులను దిగుమతి చేసుకునే ప్రయత్నాలలో ఉన్నారు.

విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని చూసి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. స్థానిక ఎంపీ కుటుంబానికే రక్షణ లేదు. ఆయన కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేసిన ఘటన చూశామని పేర్కొన్నారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి పాలనలో విశాఖపట్నం విలవిల, గజగజ లాడుతోంది. విశాఖ వాసులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ, జన జాగరణ సమితి పేరిట వైకాపా నేతల ఇండ్లకు పోస్టర్లను అతికించారు.

జన జాగరణ సమితి పేరిట పోస్టర్లు అతికించిన వారిని ఇండ్లలో నుంచి బయటకు రానిస్తారని తాను భావించడం లేదన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ ఆఫీస్, తాలూకా ఆఫీస్ ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాకట్టు పెట్టింది. దస పల్లా భూములను తస్మదీయులు కొట్టేశారు. దస పల్లా భూములను 22 A నుంచి తొలగించి తస్మదీయులకు జగన్మోహన్ రెడ్డి లబ్ధిని చేకూర్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్నంలో చేయని అక్రమమంటూ లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు?!
కేంద్ర ప్రభుత్వ విధానాలలో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలని భావించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి, కేంద్రం వద్ద తన పరపతిని ఉపయోగించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను అడ్డుకోవచ్చు. ప్రైవేటీకరణను ఆపివేయాలని ఆయన కేంద్రాన్ని అడగవచ్చు… ఎందుకంటే, లక్ష కోట్ల రూపాయల అప్పులు అడిగినప్పుడు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మాత్రం కాదని అంటుందా? అని నిలదీశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తన విధానాలలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయించాలని భావిస్తే , మన రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి తామే కొనుగోలు చేస్తామని ఎందుకు చెప్పలేదు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన 1000 ఎకరాల భూములను విక్రయిస్తే, అప్పులు తీరిపోయి ఉండేవి. ఎటువంటి అప్పులు లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను నిర్వహించే అవకాశం లభించేది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఎప్పుడో సేకరించిన ఐదు శాతం భూములను అమ్మితే అప్పులన్నీ తీరిపోతాయన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం. స్టీల్ ప్లాంట్ స్థలాలను విక్రయించి, కేంద్రాన్ని అడిగి ఐరన్ ఓర్ గనులను తీసుకుని ఎటువంటి అప్పుల భారం లేకుండా, నిర్వహించే అవకాశాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

మనకు వచ్చిన మైన్ల ను ఎవరెవరికో ఇచ్చి కమీషన్లను కొట్టివేయాలన్నా ఆలోచన తప్పితే, స్వశక్తితో స్టీల్ ప్లాంట్ ను నిర్వహించాలనే సానుకూల ధోరణి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. డాక్టర్ సుధాకర్ ను విశాఖపట్నంలో ప్రభుత్వమే హత్య చేసింది. ఋషికొండకు ఈ పాలకులే గుండు కొట్టారు. విశాఖపట్నం కు ఎంతో అన్యాయం చేశారు. చివరకు ఒక వ్యక్తి కట్టుకున్న కళ్యాణ మండపంపై కూడా కన్నేశారు. చివరకు అతని చేత అటువంటిదేమీ లేదని చెప్పించినప్పటికీ, ప్రజలకు నిజాలు ఏమిటో తెలుసు.

పట్టాలు ఉన్నవారికి భూములు ఇస్తామని చెప్పి, వారి చేత ముందే భూములను రాయించుకొని వేల ఎకరాలను కైంకర్యం చేశారు. రాజధాని పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఆర్టిఫిషియల్ హై క్రియేట్ చేశారు. ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నంలో ఇప్పుడు అలజడి నెలకొంది. ఆంధ్ర యూనివర్సిటీ ఉప కులపతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కులానికి చెందిన వ్యక్తిని నియమించి బ్రష్టు పట్టించారు. విశాఖపట్నంలో చేయని దరిద్రం, అరాచకమన్నది లేదు. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులన్నవి బోగసేనా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువచ్చానని, చలికి తట్టుకొని దావోస్ కు వెళ్లి పెట్టుబడులను ఆకర్షించినట్లుగా మంత్రి గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారు. కానీ, గుడివాడ అమర్నాథ్ కు సర్వేల ఆధారంగా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నిరాకరించారు. అంటే… గుడివాడ అమర్నాథ్ చెబుతున్నట్లుగా 13 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పంద పెట్టుబడులు రాలేదని స్పష్టమవుతుంది.

గుడివాడ అమర్నాథ్ కు సానుకూలంగా రాని సర్వే అంచనాలు,ఏమి అభివృద్ధి చేశారని మీకు అనుకూలంగా వచ్చాయని జగన్మోహన్ రెడ్డిని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. విశాఖపట్నం కు మీరు చేసిన అన్యాయమే స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. రానున్న ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా దక్కే అవకాశం లేదు . విజయనగరంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తే, చుట్టుపక్కల స్థానాలలో ఒకటి అరా గెలిచే అవకాశం ఉంది. మాజీమంత్రి అశోక గజపతిరాజు పై ద్వేషంతో మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలలోనూ వేలు పెట్టి బ్రష్టు పట్టించే ప్రయత్నాన్ని చేశారు.

కొంతమేరకు బ్రష్టు పట్టించారు. సింహాచలం దేవస్థానంలో పాలకమండలి చైర్మన్ గా అదే కుటుంబానికి చెందిన సంచయిత గజపతి రాజును తీసుకువచ్చి నియమించారు. నా కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని గగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి, గజపతి రాజుల కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టారన్నది అవాస్తవమా అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. సింహాచలంలోనూ పెద్ద ఎత్తున భూ దోపిడికి పాల్పడ్డారని అన్నారు.

విధ్వంసాన్ని మరిచిపోతారనుకోవడం అజ్ఞానమే
విశాఖపట్నం కు ఎంతో ఘోరమైన అన్యాయం చేసిన , జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ర్యాంపు వాక్ చేస్తే… ఏమి నడిచాడు రా బాబని, చేసిన విధ్వంసాన్ని స్థానికులు మరిచిపోతారని అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజల కంటే, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని ఎక్కువగా అర్థం చేసుకున్నది వారే. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు, వారి మాడలికం అమాయకంగా కనిపించినా, వారు ఎంతో విజ్ఞానవంతులు, కళా ప్రేమికులని ఆయన అన్నారు. ప్రబోధాత్మకమైన త్రిశూలం అనే సినిమాలో రెండు తెలుగు రాష్ట్రాలలోని ఏ ప్రాంత ప్రజలు ఆదరించనంత ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆదరించారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

పీలేరు సభకు వచ్చిన జనంలో సగమైన జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు హాజరవుతారా?
పీలేరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రా కదలిరా సభకు హాజరైన జన సందోహంతో పోల్చితే సగం మందైనా విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం సంగి వలసలో జగన్మోహన్ రెడ్డి నిర్వహించ నున్న సిద్ధం సభకు హాజరవుతారా? అన్నది సందేహమేనని రఘురామకృష్ణం రాజు అన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరైతే 4 లక్షల మంది జనం పాల్గొన్నారు.

ఎలాగైనా ఆ సభకు వచ్చిన దాని కంటే ఎక్కువమందిని సిద్ధం సభకు తరలించాలని వైకాపా నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి ఆర్టీసీ బస్సులను ఈ సభ కోసం బుక్ చేశారట. శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు. రెగ్యులర్ గా నడిచే స్కూళ్లను కూడా మూసివేసి స్కూలు బస్సులలో సభకు ప్రజల్ని తరలించాలని భావిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఎలాగో ఉండనే ఉన్నారు. విద్యార్థులలో ఈ సభకు పంపిస్తారు. సిద్ధం సభ కోసం సభా వేదికను ర్యాంపు వాక్ వేదికలా తీర్చిదిద్దారు. ఇక సభికులు కూర్చునే ప్రాంగణాన్ని ఎక్కడికక్కడ కానాల మాదిరిగా విభజించారు.

జగన్మోహన్ రెడ్డి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ రాంప్ వాక్ చేస్తూ రాగానే ఆయన్ని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ప్లకార్డులు పట్టుకుని చేతులను తాకుతారట. పీలేరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన రా కదిలి రా సభకు విపరీతమైన జనం హాజరయ్యారు. రాయలసీమ తమ కోటగా చెప్పుకునే వైకాపా నాయకుల కళ్ళు బైర్లు కమ్మే విధంగా బీభత్సమైన జనం తో తెదేపా సభ విజయవంతం అయ్యింది. ఇప్పుడే పట్టాభిషేకం జరిగినట్లుగా ఉందన్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని పరిశీలిస్తే ఎంతో పరిణితి చెందిన ప్రజా నాయకుడిగా మాట్లాడారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన తనపై ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, అందుకే రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై తెదేపా, జనసేన నాయకుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. గతంలో నెగ్గిన రాజోలు తోపాటు మరో స్థానానికి పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించగానే వైకాపా నాయకులు చంకలు కొట్టుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరోసారి పునరుద్గాటించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . రానున్న ఎన్నికల్లో టిడిపి జనసేన ఓటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న పవన్ కళ్యాణ్ , సంస్థాగత ఎన్నికలలో ఎక్కువ స్థానాలలో పోటీ చేసి పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసుకుందామని చెప్పారన్నారు. అటు టిడిపి, జనసేన నాయకులను కార్యకర్తలను నొప్పించకుండా సుతిమెత్తగా, ఎంతో వద్దికగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు అభినందనీయమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రెండు, మూడు రోజుల వ్యవధిలో సీట్ల సర్దుబాటుపై తెదేపా, జనసేన నాయకులు చర్చించుకునే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాతే అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థులను ఖరారు చేసి ఉంటారు. మరికొన్ని చోట్ల ప్రత్యర్థి అభ్యర్థిని బట్టి కూటమి అభ్యర్థి కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిజెపి నాయకత్వంతో రెండు మూడు రోజులుగా వదులు ఢిల్లీకి చేరుకొని పొత్తుల గురించి చర్చించనున్నట్లు తెలిసింది . ఇప్పటికే టిడిపి, జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించిందని బిజెపి వాళ్లు అంటారేమోనని, అనిపించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు. బిజెపి నాయకత్వం తో పవన్ కళ్యాణ్ చర్చించిన తర్వాత తుది ప్రకటన చేసే అవకాశం ఉంది.

పొత్తు విషయంలో టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో పిల్ల సజ్జల బ్యాచ్ దూరి ఫేక్ అకౌంట్ ల ద్వారా తప్పుడు కామెంట్లను చేశారు. అయినా, ఆ కామెంట్లు టిడిపి, జనసేన బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. సాక్షి దినపత్రికతో పాటు, పేటీఎం బ్యాచ్ ను అభినందించాల్సిందే. టిడిపి, జనసేన, బిజెపి మధ్య పొత్తు ఉంటుందా, లేదా అన్నది మూడు పార్టీల నాయకుల మధ్య చర్చలు జరిగిన తర్వాతే ప్రకటించే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . తాను మాత్రం మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్నాను.

నరసాపురం వైకాపా అభ్యర్థిగా పోటీ చేయాలని స్వయాన మా బావ గారిపై ఒత్తిడి తెచ్చి మా కుటుంబంలో చిచ్చు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం లేదా అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఆయన పోటీ చేయనని చెప్పినప్పటికీ, అదే పనిగా ఒత్తిడి చేస్తున్నారు. నర్సాపురంలో నాపై పోటీ చేయడానికి వైకాపాకు అభ్యర్థి దొరకడం లేదు. భర్త పోయిన బాధలో ఉన్న మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు భార్యను పోటీ చేయమని వైకాపా నాయకత్వం ఒత్తిడి చేస్తోంది.

అలాగే నిన్నటి వరకు ప్రొఫెసర్ పేరు వినబడింది. మళ్లీ ఇవాళ కొత్తగా మరో పేరు తెరపైకి వచ్చింది. నాకు కూటమి నుంచి టికెట్ లభించడం లేదని సోషల్ మీడియాలో వైకాపా బ్యాచ్ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. నా టికెట్ ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. నాపై పోటీ చేసే అభ్యర్థిని వైకాపా నాయకత్వం వెతుక్కోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. రానున్న ఎన్నికల్లో నేను టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరపున నర్సాపురం లోక్ సభ అభ్యర్థిగా బరిలో ఉంటానని మరోసారి ఆయన స్పష్టం చేశారు.

ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలపై, ఆమె తల్లి విజయమ్మ పై వైకాపా నాయకులు, శాసనసభ్యులు చేస్తున్న వ్యక్తిత్వహనణ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే ఖండించాలని రఘురామకృష్ణం రాజు హితవు పలికారు. రాజకీయాలు వేరు.. కుటుంబ బంధాలు వేరని, రెండింటికి ముడిపెట్టి చూడడం సరికాదు. ఇదే విషయాన్ని వైకాపా శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి వివరించాలి. షర్మిల పైన, విజయమ్మపైన అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న వారిని కట్టడి చేయాలి. వర్రా రెడ్డి అనే వ్యక్తి పచ్చి బూతులను మాట్లాడుతున్నారు.

కుల మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. అయినా అతనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. నన్ను కూడా కొంతమంది లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేస్తే వారికి నేను అంతే దీటుగా జవాబు చెప్పడం జరిగింది. వారి పేరు చివర రెడ్డి అని ఉన్నందుకు తాను ఆ సామాజిక వర్గాన్ని దూషించినట్లుగా ప్రచారం చేశారు. నా మిత్రులలో ఎక్కువమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు.

నేను రెడ్డి సామాజిక వర్గాన్ని దూషించలేదు. నన్ను ఎవరైతే కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యక్తులకు మాత్రమే సమాధానం చెప్పడం జరిగింది. షర్మిల రాజకీయ చివరి మజిలీ ఆంధ్ర ప్రదేశే నని నేను రెండేళ్ల క్రితమే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ ఇంటర్వ్యూలో రాజకీయాలలో ఉన్న వ్యక్తిగా ఒక అంచనాతో చెప్పాను. ఇప్పుడు నా అంచనా నిజమయింది. షర్మిలది కష్టపడే మనస్తత్వం, ఎంతో ధైర్యం కలిగిన అమ్మాయి. ఆమెకు వాళ్ళ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం నాకు తెలుసునని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నేను ఆమడ, యోజనాల దూరం. రానున్న ఎన్నికల్లో కూటమి తరపున నేను పోటీ చేస్తానని రఘు రామకృష్ణంరాజు వెల్లడించారు.

తెలుగు తేజాలకు పద్మ విభూషణ్ అవార్డులతో సత్కారం
తెలుగు తేజాలైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ కథానాయకుడు చిరంజీవి లకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తెలుగు తనానికి నిండైన నిర్వచనం, మాతృభాషను అమితంగా ప్రేమించే వెంకయ్య నాయుడుకు ఈ అవార్డు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే సినీ రంగం లో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత పద్మ విభూషణ్ అవార్డు చిరంజీవి కే దక్కిందని చెప్పారు. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంపై కూడా సాక్షి దినపత్రిక రచ్చ చేయడం సిగ్గుచేటని విమర్శించారు.

Leave a Reply