Suryaa.co.in

Andhra Pradesh

రఘురామరాజు ఎన్నిక లాంఛనమే

– ఉప సభాపతి పదవికి రఘురామ కృష్ణంరాజు నామినేషన్ దాఖలు
•ఎన్డీఏ కూటమి మూడు పార్టీలకు చెందిన పలువురు మంత్రుల నేతృత్వంలో నామినేషన్ దాఖలు
•రాజు పేరుని ప్రతిపాదిస్తూ ఎన్డీఏ కూటమి మూడు పార్టీల తరుపున మూడు నామినేషన్లు దాఖలు
•రేపు మధ్యాహ్నం 12.00 గంటలకు ఉప సభాపతి పదవికి రఘురామ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి పదవికి ఉండి శాసన సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరును ప్రతిపాదిస్తూ బుధవారం మూడు నామినేషన్ దాఖలు అయ్యాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉప సభాపతి పదవికి వీరి పేరు ఖరారు కావడంతో ఎన్డీఏ కూటమి మూడు పార్టీలకు చెందిన పలువురు మంత్రుల నేతృత్వంలో శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర కు ఆయన తరపున నామినేషన్ పత్రాలను అందజేశారు.

శాసన సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరుని ప్రతిపాదిస్తూ ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీల తరుపున మూడు నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది. టి.డి.పి. తరపున రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్, జనసేన తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, బి.జె.పి. తరపున పెన్మత్స విష్ణుకుమార్ రాజు వేరు వేరుగా సంతకాలు పెట్టి ఉప సభాపతి పదవికి ఉండి శాసన సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరును ప్రతిపాదిస్తూ, మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది.

ఉప సభాపతి పదవికి నేటి ఉదయం జారీచేసిన నోటిఫికేషన్ లో నేటి ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల్లోపు నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలనే నిబంధల మేరకు సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. నేటి సాయంత్రం 5.00 గంటల కల్లా నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగియడంతో, మరెవ్వరూ ఈ పదవికి నామినేషన్ దాఖలు పర్చకపోవడంతో రేపు మధ్యాహ్నం 12.00 గంటలకు ఉప సభాపతి పదవికి కనుమూరు రఘురామ కృష్ణంరాజును ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది.

రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెంన్నాయుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్, మరియు గాజువాక శాసన సభ్యులు, టిడిపి రాష్ట్రాద్యక్షులు పల్ల శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE