తెలంగాణలోని నల్గొండ కేంద్రంగా నిర్వహింపబడుతోన్న మహాత్మాగాంధీ యూనివర్సిటీతో టి-సాట్ నెట్వర్క్ ఎంఓయూకు సిద్ధమైంది. రాష్ట్రంలోనే ప్రత్యేకమైన టి.టి.ఎం. కోర్సును డిజిటల్ రూపంలో అందించేందుకు రెండు సంస్థలు సిద్ధమయ్యాయి.
మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్తాఫ్ హుస్సేన్ జూబ్లీహిల్స్ లోని టి-సాట్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా వి.సి అల్తాఫ్ హుస్సేన్ తో టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి డిజిటల్ ఎడ్యుకేషన్ పై చర్చించారు. తెలంగాణ యువతకు, విద్యావంతులకు ఉన్నత విద్యా శాఖ పరిధిలోని యూనివర్సిటీ సహకారంతో నాణ్యమైన డిజిటల్ ఎడ్యుకేషన్ అందించాలని భావిస్తున్నామని తెలిపారు. అందుకోసం ప్రతిష్టాత్మకైన యూనివర్సిటీల్లో ఒకటైన మహాత్మాగాంధీ యూనివర్సిటీ తరుపున మీ సహాకారం ఉండాలని కోరగా వీసీ అంగీకరించారు.
అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణలో ఏ యూనివర్సిటీలో లేని, డిమాండ్ గల కోర్స్ టీటీఎం (ట్రావెలింగ్ అండ్ టూరిజం మేనేజ్ మెంట్) లో డిజిటల్ లెసన్స్ అందించేందుకు తమ యూనివర్సిటీ సిద్ధంగా ఉందన్నారు. తమ యూనివర్సిటీ సిబ్బంది టీటీఎం కోర్స్ పై ప్రత్యేక ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసి టి-సాట్ ద్వారా డిజిటల్ పాఠాలు అందిస్తారని హామీ ఇచ్చారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ లో సుమారు 22 కోర్సులలో విద్యార్థులకు విద్యను బోధిస్తున్నామని, యూనివర్సిటీల ద్వార విద్యాధికులు తయారు కావాలంటే భవిష్యత్ లో విద్యా వ్యవస్థలో మరిన్ని మార్పులు జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజానికి టి-సాట్ వేదికగా తాము కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, దాని కోసం త్వరలో ఎం.ఓ.యూ చేసుకుందామన్నారు.
అందుకు టి-సాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. వి.సి అల్తాప్ హుస్సేన్ టి-సాట్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా కార్యాలయంలోని స్టూడియోలతో పాటు ఇతర విభాగాలను పరిశీలించారు.