– పేదల ఇళ్లపై వైసీపీ రాబందుల అవినీతి పాదం
– టెండర్ ప్రక్రియ లేకుండానే రూ.6250 కోట్ల విలువైన ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టుల అప్పగింత
– అక్రమాలు జరుగుతుంటే హౌసింగ్ ఎండీ ఏం చేస్తున్నారు?
– బోయిళ్ల జనార్దన్ రెడ్డి కంపెనీకి నిత్యం చెల్లింపులు జరుగుతుంటే ఎండీ స్థానంలో కూర్చుని ఏం చేస్తున్నట్టు?
– కూటమి పాలనలోనూ ఆగని అక్రమార్జన
– జేఎన్ఆర్, రాకెట్రీ ఇన్ ఫ్రా అండ్ లాజిస్టిక్స్ తదితర కంపెనీలకు దోచిపెడుతున్న హౌసింగ్ శాఖ అధికారులు
– విజిలెన్స్ విచారణ జరుగుతున్నా ఆగని బిల్లుల చెల్లింపులు
– సెలవు దినాల్లోనూ రోజుకు రూ.60 లక్షలు బిల్లులు చెల్లిస్తూ జేఎన్ఆర్ పై అభిమానం చాటుకుంటున్న అధికార గణం
– యథేచ్ఛగా బిల్లుల చెల్లింపు జరుగుతుంటే హౌసింగ్ ఎండీ ఏం చేస్తున్నట్లు?
– వైసీపీ పాలనలో జేఎండీగా వెలగబెట్టిన అధికారే ఇప్పుడు ఎండీ
– అక్రమాలకు పాల్పడి రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిన డీఈలకు ఈఈ, పీడీలుగా, పీడీలకు సీఈలుగా ఉద్యోగోన్నతులా?
– సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల సొత్తు రికవరీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడిని కోరుతున్నా
– నెల్లూరులో మీడియాతో టీడీపీ సీనియర్ నాయకులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు
నెల్లూరు: పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి రాష్ట్రంలో తొలిసారిగా పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారు. ఒక్కో యూనిట్ కు కేంద్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తోంది. 2018లోనే చంద్రబాబు నాయుడు ఆ మొత్తాన్ని దళితులు, గిరిజనులకు రూ.2.30 లక్షలకు పెంచారు. 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అదనపు మొత్తాన్ని రద్దు చేసి కేవలం కేంద్ర నిదులు రూ.1.80 లక్షలకే పథకాన్ని పరిమితం చేశారు.
ఇళ్ల నిర్మాణంలో మూడు విధానాలను తెరపైకి తెచ్చారు..సొంతంగా లబ్ధిదారులు కట్టుకోవడం ఒకటి, మెటీరియల్ ప్రభుత్వం సరఫరా చేస్తే లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడం రెండో విధానం, ఆప్షన్ 3లో నిరుపేదలకు కాంట్రాక్టతో కట్టించి అప్పగించారు.
మూడో విధానమైన ఆఫ్షన్ 3లో ఇళ్లు కట్టుకోలేని వారిలో 90 శాతం మంది గిరిజనులు, దళితులే. ఆప్షన్ -3 లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ కుంభకోణం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,47,254 ఇళ్లను రూ.6250 కోట్లతో కాంట్రాక్టర్ల చేత కట్టించాలని వైసీపీ ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. నిబంధనల ప్రకారం రూ.5 లక్షలకు పైబడిన కాంట్రాక్టుకు టెండర్ పిలవాలి, అగ్రిమెంట్ రాసుకోవాలి. ఈఎండీ మార్గదర్శకాలు పాటించాలి.
కానీ ఇవేమీ లేకుండా గంపగుత్తగా 3 లక్షల 47 వేల 254 ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును వైసీపీ బినామీలైన 1042 మంది కాంట్రాక్టర్లకు సమర్పించారు. ఉదాహరణకు బోయిళ్ల జనార్దన్ రెడ్డికి చెందిన జేఎన్ఆర్ కనస్ట్రక్షన్స్ కు ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా రూ.1318 కోట్ల విలువైన 73255 ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును వివిధ జిల్లాల్లో అప్పగించారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీకి రూ.907 కోట్ల విలువైన 50,309 ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ఇచ్చారు. కేవలం ఈ రెండు కంపెనీలకే రూ.2,225 కోట్ల విలువైన కాంట్రాక్టును ఎలాంటి టెండర్, అగ్రిమెంటు లేకుండానే అప్పనంగా ఇచ్చేశారు. ఈ రెండు సంస్థలు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోయినా ఇప్పటికే రూ.1200 కోట్లకు పైగా చెల్లించేశారు.
బోయళ్ల జనార్దన్ రెడ్డి నాలుగు ఏజెన్సీల పేరుతో 34,676 పూర్తి చేశారని అధికారులు చెబుతున్న ఇళ్లకు తలుపులు, కిటికీలు పెట్టలేదు.ఇంట్లో ఫ్లోరింగ్ చేయలేదు. అయినా బిల్లుల చెల్లింపు జరుగుతోంది. జనార్దన్ రెడ్డి కంపెనీలకు ఇప్పటి వరకు రూ.951 కోట్లకు పైగా చెల్లించేశారు. నగదు రూపంలో రూ.666 కోట్లు, సిమెంట్ కు రూ.110 కోట్లు, స్టీలుకు రూ.152 కోట్లు, ఇసుకకు రూ.3.60 కోట్లు చెల్లించేశారు.
రాక్రీట్ కంపెనీదీ అదే పరిస్థితి. 50390 ఇళ్లకు గాను 2011 ఇళ్లను అసంపూర్తిగా కడితే వాటిని పూర్తయినట్టుగా చూపి ఇప్పటి వరకు రూ.338.62 కోట్లకు పైగా చెల్లించేశారు. బిల్లులు తీసుకుంటున్నా ఇళ్లు కట్టలేదని రాక్రీట్ కంపెనీని అధికారులు ప్రశ్నిస్తే తమకు, హౌసింగ్ శాఖకు సంబంధం లేదని, తమ మధ్య ఎలాంటి అగ్రిమెంటు లేదని కోర్టును ఆశ్రయించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు స్టీలు కొనుగోలులోనూ భారీగా అక్రమాలు జరిగాయి.
ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణం కోసం హౌసింగ్ శాఖ 1.97 లక్షల మెట్రిక్ టన్నుల స్టీలు కొనుగోలు చేసింది. మార్కెట్ ధరతో పోలిస్తే ఒక్కో టన్నుకు అదనంగా రూ.6వేలకు పైగా చెల్లించారు. ఉదాహరణకు నెల్లూరు తిరుమల టీఎంటీ కంపెనీ స్టీలు టన్ను రూ.57 వేలుగా ఉండగా, హౌసింగ్ అధికారులు రూ.65600 చొప్పున లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నారు.
తిరుమల టీఎంటీ స్టీలు విషయంలోనే టన్నుకు రూ.8600 వరకు తేడా ఉంది.
ఒక్క స్టీలు విషయంలోనే రూ. 160 కోట్లకు పైగా పక్కదారి పట్టింది. భారీ స్థాయిలో అర్డర్స్ ఇచ్చినప్పుడు కంపెనీలు కచ్చితంగా ధర తగ్గిస్తాయి.ఇక్కడ మాత్రం అమాంతంగా పెరిగిపోయింది. ఇతర మెటిరీయల్ కొనుగోలు పేరుతో భారీగా దోచేశారు.
ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్, విండోస్, డోర్ షట్టర్స్, ఎలక్ట్రికల్ వస్తువులు, టాయిలెట్ పాన్స్, పీవీసీ ఓవర్ హెడ్ ట్యాంక్స్, వల్లీ ఆర్ట్స్ వంటి 18 రకాల మెటిరీయల్ ను రూ.302.57 కోట్లకు కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం లబ్ధిదారుడి అంగీకారంతోనే అదనపు మెటీరియల్ ను కొనుగోలు చేసి సరఫరా చేయాలి. కానీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా, లబ్ధిదారుల అంగీకారం లేకుండానే వారి పేర్లతో మెటీరియల్ ను తెప్పించేశారు. ఆ మెటీరియల్ గోదాముల్లోనే మగ్గుతున్నా, లబ్ధిదారులకు ఇచ్చేసినట్టు రికార్డు చేసి యూనిట్ విలువలో ఆ మొత్తాన్ని మినహాయించేశారు.
ఉదాహరణకు మార్కెట్ లో గరిష్టంగా రూ.630 విలువ చేసే వర్లీ ఆర్ట్ స్టిక్కర్ కు రూ.1100 వంతున వసూలు చేశారు. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఒక్క ఇంటికి కూడా వర్లీ ఆర్ట్ స్టికర్ కనిపించదు. కానీ రికార్డుల్లో మాత్రం రూ10 కోట్లతో స్టికర్లు వేసేసినట్టు నమోదు చేశారు. అదనపు మెటీరియల్ కు సంబంధించి ఆన్ లైన్ లెక్కలకు, గోదాముల్లోని స్టాకుకు పోల్చి చూస్తే భారీ తేడా ఉంది.
ఒక్క ఇంటికి వాడాల్సిన సిమెంటును నాలుగైదు ఇళ్లకు వాడి నాసిరకంగా పనులను చేశారు. మిగిలిన ఇళ్లకు మార్కెట్ లో కొనుగోలు చేసినట్టు చూపి నగదు తీసేసుకున్నారు. ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణంలో ప్రధానంగా దోపిడీ బేస్మెంట్ లెవల్ లోనే ప్రారంభమైంది. బేస్మెంట్ లెవల్ లో చెల్లించే పేమెంట్ షెడ్యూల్ ను అధికారులు ఇష్టారాజ్యంగా మార్చేశారు.
రూ.53 వేలుగా ఉన్న బేస్మెంట్ లెవల్ పేమెంటును కొద్ది రోజుల వ్యవధిలోనే రూ.60 వేలకు, ఆ తర్వాత రూ.70 వేలకు పెంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 శాతం ఇళ్లను బేస్మెంట్ లెవల్ లోనే వదిలేసి వెళ్లిపోయారు. బేస్మెంట్ స్థాయిలో జరిగిన అవినీతిని తోటపల్లి గూడూరు మండలం వరిగొండలో ప్రత్యక్షంగా చూశాం. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రికి కూడా చూపించాం.
నేను కాలితో తంతేనే అక్కడ గిరిజనుల ఇళ్లకు వేసిన బేస్మెంట్ పడిపోయిన పరిస్థితి. 7 అడుగుల లోతు ఉండాల్సిన బేస్మెంట్ లోతును 2.5 అడుగులకే పరిమితం చేశారు. బేస్మెంట్ ఎత్తు 3.6 అడుగులు ఉండాల్సివుండగా, 2.5 అడుగులకు మించలేదు. రూఫ్ ఎత్తు 9.6 అడుగులు ఉండాల్సి ఉండగా 8.6 అడుగుల ఎత్తులోనే ఆపేశారు. శ్లాబు మందం 4 ఇంచ్ లకు మించలేదంటే…అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది.
లబ్ధిదారుల వద్ద తీసుకోవాల్సిన అంగీకారపత్రాలను కూడా కాంట్రాక్టర్లు, అధికారులే రాసుకుని, సంతకాలు కూడా తామే పెట్టేసుకున్నారు. లక్షల చదరపు అడుగులతో కట్టిన ప్యాలెస్ ల్లో ఉంటున్న జగన్ రెడ్డి పేదలకు మాత్రం నిలువ నీడ లేకుండా చేశారు. పేదల ప్రయోజనాలను పణంగా పెట్టి వైసీపీ నేతలకు వేల కోట్లు దోచిపెట్టాడు. ఒక్క వరిగొండలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా అక్రమాలు జరిగాయి.
కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి నెల్లూరు జిల్లాలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరాను. సీఎం ఆదేశాలతో జరిగిన విచారణలో ఒక్క నెల్లూరు జిల్లాలోనే రూ.100 కోట్ల అవినీతి జరిగిందని, క్వాలిటీపైనా విచారిస్తే మరో రూ.100 కోట్ల స్కామ్ వెలుగుజూస్తుందని విచారణ అధికారులు తెలిపారు.
విచారణ పూర్తయి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా బాధ్యులపై ఇంకా చర్యలు లేవు..రికవరీ లేదు. క్రిమినల్ కేసులు లేవు. ముఖ్యమంత్రిని కోరి విజిలెన్స్ విచారణ వేయించుకున్నాం. విచారణలో అక్రమాలు నిర్ధారణ ఆయినా అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లపై చర్యలు లేకపోవడం బాధాకరం.
జనార్దన్ రెడ్డి, నరేంద్రరెడ్డి లాంటి వ్యక్తులు నాసిరకంగా ఇళ్లు నిర్మించారని విచారణలో తేలినా, బిల్లుల చెల్లింపు కొనసాగిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమింటే కూటమి ప్రభుత్వం వచ్చాక బోయిళ్ల జనార్దన్ రెడ్డికి రూ.126 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఈ రోజుకీ నిత్యం రూ.60 లక్షల చొప్పున ఆయనకు తిరుపతి, వైజాగ్ నుంచి పేమెంట్లు జరుగుతున్నాయి.
వినాయక చవితి, ఆగస్టు 15 సెలవు దినాల్లోనే అధికారులు కష్టపడి పనిచేసి ఆయనకు పేమెంట్లు చేస్తున్నారు. నెల్లూరులో హౌసింగ్ డీడీగా పనిచేసిన దయాకర్ ప్రస్తుతం తిరుపతిలో ఇన్ చార్జి పీడీగా ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్న 2023లోనే ఆయన అక్రమాలు, అవినీతిని గుర్తించి ఆరు అంశాల్లో షోకాజ్ నోటీసులిచ్చారు. ఇప్పుడు తిరుపతిలో జనార్దన్ రెడ్డి కంపెనీలపై దయాకర్ ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు.
నెల్లూరులో ఉన్న పీడీ కూడా దారుణాలకు పాల్పడుతున్నారు. మళ్లీ ఇప్పుడు ఆయన సీఈగా పోయే ప్రయత్నాల్లో ఉన్నాడు. అవినీతి, అక్రమాలకు సంబంధించి గత మే నెలలోనే ఆయనకు మూడు నోటీసులిచ్చారు. ఈ అధికారులందరూ ఈ రోజుకీ నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు యథేచ్చగా బిల్లుల చెల్లింపు చేస్తుండటం దుర్మార్గం.
నెల్లూరు జిల్లాలో విచారణల పేరుతో ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధికారులే కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. పెద్ద కంపెనీలకు పేమెంట్లు చేస్తే సమస్యలొస్తాయని భావించి, కొత్తకొత్త ఏజెన్సీల పేర్లతో పనులు చేసినట్లు చూపి బిల్లులు చెల్లించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 200 కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారణ అయింది. ఇదే క్రమంలో రాష్ట్ర స్థాయిలో రూ.5200 కోట్లు దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది.
ఆప్షన్ 3 లో భాగంగా రాష్ట్రంలో నిర్మించిన ఇళ్లలో ఎక్కడా నివాసం ఉండే పరిస్థితి లేదు. పేదలు పదికాలాల పాటు కాపురం ఉండాల్సిన ఇళ్లను అవినీతి కూపంలో ముంచడం చూసి కడుపు రగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరుగుతుంటే హౌసింగ్ ఎండీ ఏం చేస్తున్నారు? బోయిళ్ల జనార్దన్ రెడ్డి కంపెనీకి నిత్యం చెల్లింపులు జరుగుతుంటే ఎండీ స్థానంలో కూర్చుని ఏం చేస్తున్నట్టు..పేదలంటే లెక్కలేదా
వైసీపీ పాలనలో జేఎండీగా చక్రం తిప్పిన అధికారినే ఇప్పుడు ఎండీగా నియమించారు. హౌసింగ్ శాఖను ప్రక్షాళన చేస్తే తప్ప పేదలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణంతో పాటు జగనన్న కాలనీల చదును పేరుతో చేసిన అక్రమాలు, భూసేకరణలో జరిగిన దోపిడీ పైనా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరుతున్నా.