– కడప గడప గడపా పసుపుమయం
(బాబు భూమా)
మా కడపలో మహానాడు రద్దు చేయాలనే విష ప్రచారానికి, కరోనా పేరుతో దిగారు. ముసుగులు తగిలించుకుని, మేనమామ భుజంపై తుపాకీ పెట్టి, అధికారుల వద్ద ఫిర్యాదులు చేయించారు. కానీ వారి కపటం బయటపడింది – మెట్లు దిగుతూనే మాస్కులు విసిరిపారేశారు. వారి దొంగ ఫిర్యాదుల్లాగే, ఈ అస్త్రం కూడా పనికి రాలేదు. తెలుగుదేశం అభిమానులను కడప దరి చేరనివ్వకుండా ఆపడమే వారి నీచమైన పన్నాగం.
మొదటి రెండు రోజులు కేవలం నాయకులకు మాత్రమే పరిమితం చేసినప్పటికీ, తొలిరోజు నుంచే కడప నగరమంతా పసుపు ధ్వజాలతో నిండి, మహానాడుకు స్వాగతం పలికింది.
రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో, కార్యకర్తలతో కడప జన సంద్రంగా మారిపోయింది. మహానాడు ప్రాంగణం పసుపు సముద్రంలా కన్నుల పండుగ చేసింది. ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడిన ఈ పసుపు పండుగ, నిజంగానే జన జాతరను తలపించింది!
డప్పులు, కోలాటాల సందడితో ప్రాంగణం హోరెత్తింది. ప్రతినిధుల నమోదుతో ఘనంగా ప్రారంభమైన ఈ మహానాడులో, ఫోటో ఎగ్జిబిషన్లు, రక్తదాన శిబిరాలతో జోష్ మరింత పెరిగింది. ‘జై టీడీపీ.. జై చంద్రబాబు.. జై లోకేశ్’ నినాదాలతో కడప దద్దరిల్లింది.
ఇక మూడో రోజు కార్యకర్తల సునామీ వస్తుందని తెలిసి, భయంతో వణికి… ‘భారీ వర్షాల దృష్ట్యా మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్మోహన్‌రెడ్డి రేపటి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలించిన తర్వాత శ్రీ జగన్ ప్రకాశం జిల్లా పర్యటన విషయమై తదుపరి ప్రకటన చేస్తామని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది’ అంటూ వైకాపా సోషల్ మీడియా ద్వారా కపట ప్రకటన చేశారు. సిగ్గులేని తనంతో, వాతావరణం పేరుతో తన పర్యటన రద్దు చేసుకున్న విషయాన్ని మహానాడుకు అంటగట్టాలని చూశారు.
ఎండకు, వానకు, చలికి, ప్రాంతానికి, రాత్రికి, పగలుకు, కరోనాకు వెరచే పార్టీ కాదు తెలుగుదేశం! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రకాశం జిల్లాలో మహానాడుకు స్థలం దొరకకుండా చేసి, ఫ్లెక్సీలు చింపేసిన జగన్ రెడ్డి అహంకారపు అధికార జులుం చూసి కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు! సునామీలా చుట్టుముట్టి, వైకాపా మట్టిగొట్టుకుపోవడాన్ని ఖాయం చేశారు ఆ రోజే.
‘నా కడపకు వస్తున్నారా’ అన్న అక్కసుతో… ఇలాంటి పసలేని, బిలిబిత్తిరి ప్రచారాలు చేస్తే, టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహంతో, ఉరకలేసే ఏనుగుల గుంపుల్లా ఘీంకారాలు చేస్తూ, దారిలో ఏ అడ్డంకి వచ్చినా తొక్కుకుంటూ వస్తారు.
కడప మహానాడును చూసి కడుపు మంట వస్తే ఈనో తాగాలి! రావుగోపాలరావు పాత సినిమా కుట్రల్లాంటి ఈ పన్నాగాలకు, పసుపు సైనికులు మరింత రెచ్చిపోయి, అంకుశం తగిలిన ఏనుగుల్లా దూసుకొస్తారు!