Suryaa.co.in

Andhra Pradesh

ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు చర్యలు

– కడపలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ
– ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

కడప: కడపలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ(అడిషనల్ చార్జ్) ఎ.కె. సక్సేనా భేటీ అయ్యారు. ఈ భేటీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ యాజమాన్యానికి సీఎం సూచించారు.

గత కొంత కాలంగా మంచి పనితీరుతో స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి పెరిగిందని, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సీఎం కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలబాట పట్టేందుకు పటిష్టమైన, సమగ్రమైన చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. స్టీల్ ప్లాంట్ సామర్థ్యం మేర ఉత్పత్తి జరపడంతో పాటు….రానున్న రోజుల్లో మంచి ఫలితాలు సాధించేందుకు సంస్థ యాజమాన్యం తీసుకునే అన్ని చర్యలకు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంటుందని సీఎం తెలిపారు.

విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు ఇప్పటికే చేపట్టిందని…..అటు ప్లాంట్ ఉద్యోగులు, యాజమాన్యం సమన్వయంతో పనిచేసి ఫలితాలు రాబట్టాలని అన్నారు. ప్లాంట్ బాగుంటేనే తమకూ మంచిదని ఉద్యోగులు కూడా గుర్తించాలన్నారు.

ఇదే సమయంలో ప్లాంట్ యాజమాన్యం కూడా సంస్థ లాభాలబాట పట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం ఇప్పటికే రూ.11,440 కోట్లు మంజూరు చేసిందని….మరో వైపు రాష్ట్రం వివిధ రూపాల్లో రూ.2,660 కోట్లు మేర ప్లాంట్ కు అవసరమైన సహాయం అందించిందన్నారు.

ఇన్ని వేల కోట్ల ప్రజల సొమ్ము పెట్టిన తరవాత దీన్ని పూర్తిగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం అన్నారు. మేనేజ్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని, కొందరు ప్లాంట్ ను బలహీన పరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

నష్టాల బాట పట్టించేందుకు ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన అందరి అంతిమ లక్ష్యం ప్లాంట్ ను కాపాడుకోవడమే అని సీఎం స్పష్టం చేశారు. అన్ని విధానాలు పరిశీలించి….గుడ్ బిజినెస్ మోడల్ ను అమలు చేయాలని సీఎండికి సీఎం సూచించారు.

LEAVE A RESPONSE