– ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు
విజయవాడ : ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి చేపట్టిన ఉత్తరాంధ్ర జల వనరుల ప్రాజెక్టులు, పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రలోని అనేక గ్రామాలలో పర్యటించినట్టు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు తెలిపారు. ప్రతి గ్రామం లో ఊరు బయట బహిరంగ మల విసర్జన చేస్తున్నారు, గ్రామాల్లోని కాలువలు నిర్వహణ పూర్తిగా కుంటుపడింది. ఎక్కడపడితే అక్కడ చెత్త , పాలిథిన్ కవర్లు కనిపించాయని అన్నారు. గ్రామాల్లోని వీధులు కూడా ప్రతి ఒక్కరూ తమ గృహాలను ముందుకు నడిపి నిర్మించటం వలన చిన్నవిగా మారిపోయాయి. దాని వలన కూడా గ్రామాలు తమ స్వరూపాలు కోల్పోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా గ్రామాలు మద్యానికి బానిసగా మారిపోయాయి. అన్నీ కలిసి గ్రామాలు నిర్జీవంగా కనిపిస్తున్నాయని స్వామి ఆవేదన వ్యక్తం చేశాయి.
ఇలాంటి పరిస్థితుల్లో అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం చుక్కపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ వాళ్లు ఏర్పాటు చేసిన ఒక హెచ్చరిక బోర్డు గ్రామాలకు వెలుగు నింపేదిగా కనిపించిందన్నారు. గ్రామస్తులు ఎవరైనా బహిరంగ మలవిసర్జన చేయటం కానీ, చెత్త బయట వేయడం కానీ చేస్తే రూ. 500 జరిమానా విధిస్తామని పంచాయతీ వారు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం, అక్కడ ప్రజలు ఎవరూ కూడా పంచాయతీ నిబంధనలను అతిక్రమించకుండా చూడడం అభినందనీయమన్నారు. ఇలాంటి పరిణామాలు ప్రతి గ్రామంలోనూ ఎంత త్వరగా వస్తే దేశం అంత త్వరగా అభివృద్ధి చెందుతుందని కృష్ణమూర్తి నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు శ్రీశ్రీశ్రీ భారతనంద స్వామి మాట్లాడుతూ గ్రామాల్లో 100% మరుగుదొడ్లు ఉపయోగించే విధంగా, చెత్త చెదారం బయట వేయకుండా అందరం చూడాలన్నారు. మంచినీరు, విద్య, వైద్యం అందే విధంగా చూస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి మధ్యరహిత గ్రామాలుగా మారిస్తే, ఈదేశం ప్రపంచంలో ఒకటో స్థానంలో ఉండటం అసాధ్యమేమీ కాదని స్వామీ అభిప్రాయపడ్డారు.