Suryaa.co.in

Telangana

కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం యువతకు శాపం

– గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు రద్దుకావడం దురదృష్టకరం
-యువత భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించలేని కేసీఆర్ ప్రభుత్వానికి అధికారంలో ఉండే నైతిక అర్హత లేదు.
– గ్రూప్-1 పరీక్షలు రద్దు కావడంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కారణంగా.. వరుసగా రెండోసారి రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు రద్దుకావడం దురదృష్టకరం. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది యువతలో నైరాశ్యం నింపేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో.. నీళ్లు, నిధుల విషయంలో ఎలాగూ దగాపడుతున్నాం. ఇప్పుడు నియామకాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం యువతకు శాపంగా మారింది.

ఇటీవలే జరిగిన పేపర్ లీక్ ఘటన ఈ సందర్భంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కాస్తయినా జాగ్రత్తగా వ్యవహరిస్తోందనుకుంటే.. మళ్లీ అదే అసమర్థత, అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. గ్రూప్-1 పరీక్షలో.. అక్రమాలను అరికట్టేందుకు దరఖాస్తుదారుల బయోమెట్రిక్ తీసుకోవడం తప్పనిసరి అంటూ నియామక నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత బయోమోట్రిక్ తప్పనిసరి కాదంటూ వ్యవహరించడం.. యువతకు న్యాయబద్ధంగా ఉద్యోగాలు కల్పించే విషయంలో బీఆర్ఎస్ సర్కారు ఆలోచన సరళిని స్పష్టంచేస్తోంది.

దరఖాస్తులు మొదలుకుని ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. హాల్‌టికెట్లపై ఫొటోలు లేకపోవడం, బయోమెట్రిక్ స్క్రీనింగ్ ను తొలగించడం ద్వారా పరీక్షల్లో అక్రమాలకు ఆస్కారం కల్పించినట్లయింది. ఇలా గ్రూప్-1 పరీక్షల నిర్వహణ విషయంలో సర్కారు నిర్లక్ష్యాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో.. పరీక్షలను రద్దుచేయడం మినహా న్యాయస్థానం ముందు వేరే అవకాశమే లేకుండా పోయింది.

రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించలేని కేసీఆర్ ప్రభుత్వానికి అధికారంలో ఉండే నైతిక అర్హత లేదు.

LEAVE A RESPONSE