– ట్రాక్టర్ అతివేగానికి రైతు కుటుంబం బలి
– స్పాట్ లో కొడుకు దుర్మరణం.. తెగిపడిన తండ్రి కాలు
(బహదూర్)
ఇసుకాసురుల స్వైర విహారానికి ఓ రైతు కుటుంబం తల్లడిల్లింది. ఇసుక అక్రమ రవాణాలోని ఓ ట్రాక్టర్ తనయుడిని మింగేస్తే.. తండ్రి కాలును ఛిద్రం చేసింది. ఈ దయనీయ ఘటన కడప జిల్లా పులివెందులలో ఉదయం చోటు చేసుకుంది.
మొయిళ్ళ చెరువుకు చెందిన రైతులు తండ్రి కొడుకు పని నిమిత్తం వేంపల్లి మీదుగా గండి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో పాపాగ్ని నదిలో అక్రమంగా ఇసుకను తోడేస్తున్న ఇసుకాసరుల ట్రాక్టర్ అతివేగంగా ఆ తండ్రి కొడుకుల బుల్లెట్ ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కొడుకు అక్కడిక్కడే ప్రాణాలు వదిలేశాడు. తండ్రి కాలు తెగి పడింది.
ఈ రైతు కుటుంబం బలి కావడానికి ఇసుక అక్రమ రవాణానే కారణం, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. గృహాసరాలకు మాత్రమే ఉచితంగా ఇసుకకు తోలుకోవాలని, అమ్ముకోవడానికి కాదని, అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తోలితే ట్రాక్టర్ ను సీజ్ చేస్తామని, యజమానితోపాటు ట్రాక్టర్ డ్రైవరుపై కేసు పెడతామని ప్రభుత్వం జీవో జారీ చేసింది.
అధికారులు మాత్రం ఈ ఇసుక అక్రమ రవాణకు కళ్లప్పంచి చూడటం చోద్యంగా మారిందని ఈ హృదయ విదారక ఘటన నిరూపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు మామూళ్ల మత్తు వీడి, పాపాగ్ని నదిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఇసుక డంపుల్ని స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.