రైతు కుటుంబాలకు, తెలుగువారికి ఇష్టమైన పండగ…

రెండు మూడు తరాల నుంచీ స్వయంగా పొలాల్లోకి దిగి వ్యవసాయము చేసే రైతులము కాకపోయినా, కాస్త భూమి కలిగినవారిమే. నాకు కూడా దున్నడం(మూడు నాలుగుసార్లు), ఎడ్లబండి నడపడం, కోడెగిత్తలని ఏట్లో నడిపించడం కొంత అనుభవమే. దీపావళి పండుగ ఒకరోజు కోసం పిల్లలుగా ఎదురుచూసేవారం. కానీ సంక్రాంతి కుటుంబం, కుటుంబాలు.. ఊరు కలసి జరుపుకునే పండుగ. ఆరోజుల్లో పొడుగు వంగడం వేసేవారు కాన పంట ఆలస్యంగా అంటే డిసెంబర్ ఆఖరుకు వచ్చి గాదెల నిండుగా ఉండేవి, వడ్లు అమ్మగా వచ్చిన డబ్బులతో ఇళ్ళు ఉన్నంతలో గల గల లాడుతూ ఉండేవి.

అప్పుడే పాలేర్లకు, నాయీబ్రాహ్మణులకు, రజకులకుకూడా ధాన్యం కొలచాలి అనేవారు. వారికి సంవత్సరానికి ఒకసారి ఇస్తా ఉండేవారు. అక్కడ మంగలి అని ఆరోజు పిలిచేవారు మా తాతగారి గుండు కోసం ప్రతి రెండు రోజులకు ఒకసారి వచ్చేవారు. మా తాతగారు నిలువుటి బొట్టు, ఎప్పుడూ గుండు పిలకతో జీవితమంతా అలాగే ఉన్నారు. అయితే బయటికి వెళ్ళినప్పుడు పైకండువా కర్ర మాత్రం లేకుండా వెళ్ళటం నాకు ఊహ వచ్చిన తర్వాత చూడలేదు. మిల మిల మెరిసే తెల్ల ఇసుక తిన్నెలు, పారే ఏటి నీటిలో స్నానాలు. ఆ పక్కనే ఇసుకలో తీసి నీళ్లు తాగేయటం లేదంటే ఏట్లోనే, చెరువులో తాగేయటం అంతే.. ఈ మినరల్ వాటర్, మన్నుమశానం గొడవ లేదు (ఇప్పుడు ఏరులు ఎండిపోయి బకాసురుల వల్ల ఇసుక పోయి రాళ్లు తేలాయి). ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దుల వాళ్ళూ తప్పనిసరి. ఈ పండక్కి మాత్రం కచ్చితంగా చిన్నప్పుడు పాలకొల్లు నుంచి మా తాతగారి ఊరో లేదా మా మేనత్త గారి ఊరు చింతలపూడి, లేదా మేనమామ గారి కాకినాడ వెళ్లని సంవత్సరం లేనేలేదు. వాళ్ళు మనకిష్టమైన క్రొత్తబట్టలు పెట్టేవారు.

పాలకొల్లులో నాన్నగారు ఏది కొంటే బుద్దిగా అవే వేసుకోవాలి కదా. సినిమాలు ఒకోసారి రోజుకు 2 కూడా చూసేవారం. పిండి వంటలు అందరూ కూడా ఒక ఇంట్లో ఒకసారి కలిసి చేసుకునేవారు ఇప్పుడు లాగా బయట నుంచి స్వీట్లు కొనుక్కుంటము ఉండేది కాదు, సంవత్సరానికి ఒక ఐదు ఆరుసార్లు మాత్రం చేసుకునేవారు. అవే దాచి సంవత్సరం అంతా మనకి తాయిలం పెడతాను రా అని చెప్పి స్వీట్స్ పెట్టేవారు పల్లెటూళ్లల్లో. పాలకొల్లు ప్రతిరోజు ఇంట్లో ఎన్నో రకాల స్వీట్లుండేయి, కానీ పల్లెటూర్లో నాయనమ్మ పెట్టే స్వీటే ఎంతో రుచిగా అనిపించేది. ఇక నేను పెద్దయి మహారాష్ట్ర, దిల్లీ, వైజాగ్ , హైదరాబాదు వెళ్ళినప్పుడు పాలకొల్లుకు, తాతగారి ఊరికి కూడా ప్రతీ సంక్రాంతికి వచ్చే అలవాటు అయ్యింది.

తాత గారికి వ్యవసాయం తెలుసు. వాటికి బోరుద్వారా, చెరువుల ద్వారా నీరు లభించేది. వివిధ చోట్ల 45 ఎకరాల వరకూ అమ్మేసాము. పల్లెటూళ్ళో చిన్నప్పుడు పేకాట 5.4.3 పట్లు (తూరుఫ్) ఆడేవాళ్ళం. పల్లెటూళ్ళో గోళీలు, గూటిబిళ్ళ, వాలీబాల్, బాల్ బాడ్మింటన్ ఆడేవాళ్ళం. ఇప్పుడు ఆ ఊళ్ళల్లో యువత ఎక్కువగా 99% ఫోన్లలో ఆడుకుంటున్నట్లున్నారు. బైట ఆటల్లో ఒక్కడూ కనపడడు! మాకునాడు ఉత్సాహాన్నిచే ఆ పట్టు పరికిణీల, జడగంటల, అమాయక వాలుచూపుల పల్లెటూరి అమ్మాయిలు నేడు 99% మాయం. క్రొత్త ఆల్లుళ్లు మాత్రం ఇంకా వస్తున్నారు..పెట్టుపోతల కోసమో, క్రొత్త గారాల భార్య మాట తీసేయలేకేమో. పిల్లలు ఊళ్ళకి రాము అనే గొడవ పెరిగింది, వచ్చే తరం చూస్తే కాస్త డౌటే.

చిన్నప్పుడు కోడిపందాలు బాగా వేసేవాళ్ళం, పోలీసులు వస్తున్నారంటే పొలాల్లో అడ్డంగా పడి పారిపోవడం అక్కడ ఆటలు అన్నీ ఎన్నో. ఉద్యమాల్లోకి వచ్చిన తరువాత స్వంత పందెం కోళ్లన్నీ ఇచ్చేసాను., ఆ పందాలు ఎప్పుడో మానేసాను. నాడు వేరే ఊరికి పందాలకు వెళితే పెద్దరైతు, చిన్నరైతు, కూలీ బిడ్డలు ఇవేమీ లేవు.. అందరూ ఒక్కటిగానే వెళ్ళేవారం. మా పాలకొల్లులో అయితే తినడం హోటల్ లేదా రోడ్డుప్రక్క బడ్డీ అన్నీ నిషేధమే. ఇక్కడ ఊళ్ళల్లో ఆ సరదాలు తీర్చుకునేవారం. ఆంక్షలు ఉండేవి కాదు. మేనమామ గారు ప్రభుత్వ డాక్టరు, నేత్ర స్పెషలిస్ట్, DMHO కూడా చేశారు. అక్కడా 6 గురు పిల్లలు, మా మేనత్తగారికీ ఆరుగురు, అన్నీ వైద్యుల కుటుంబాలే… వారి కుటుంబాలు, వాళ్ళ పిల్లలు… అసలు పండగ చుట్టాలు చిన్ననాటి స్నేహితులతో అనిపించేది. ఊరు ఊరంతా ఉరుకుతూ ఉండేది, మొత్తం పండగే. చెప్పాలంటే ఎన్నో విశేషాలు.

నేడు కొన్ని ఆప్యాయతలు అలాగే ఉన్నా, నీరసం, సౌకర్యాలతో తెచ్చిపెట్టుకున్న ఆనందం, పడిపోయిన పెంకుటిళ్లు, కళ లేని డాబా ఇళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మకర సంక్రాంతి సంక్రమణం అంటే ఏంటో, హిందువులు మాత్రమే జరుపుకుంటారు… ఇవన్నీ మాకు నాడు తెలియవు. అది మాకు ఊరంతా జరుపుకునే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కలు బాగా లాగించే ముక్కనుమ…నాలుగురోజుల పండుగ.
మన, లేదా నాలాంటివారి జీవితాలతో ముఖ్యంగా రైతులు కుటుంబాలు, వారి సంతానం, అనుబంధ వృత్తులు అందరితో పెనవేసుకున్న పండగ. మిత్రులు అందరికీ హార్ధిక పండగ శుభాకాంక్షలు. మీకూ గొప్ప అనుభూతులు ఉంటాయి, పంచుకోండి.

-చలసాని

Leave a Reply