Suryaa.co.in

Editorial

కేసీఆర్‌ కుటుంబంపై.. తొలి తిరుగుబాటు!

– ఫ్యామిలీ టికెట్లపై తొలిసారి గళం విప్పిన ఎమ్మెల్యే మైనంపల్లి
– కేసీఆర్‌ సీఎం అయ్యాక పార్టీలో తొలి తిరుగుబాటుపై కుదుపు
– కేసీఆర్‌ మేనల్లుడు, మంత్రి హరీష్‌ను ఓడిస్తానని మైనంపల్లి శపథం
-హరీష్‌ లక్ష కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించిన హన్మంతరావు
– వెలమ హాస్టల్‌కు రబ్బర్‌ చెప్పులు, ట్రంకు పెట్టెలతో వచ్చాడన్న మైనంపల్లి
– మైనంపల్లి వ్యాఖ్యలపై హరీష్‌కు బాసటగా నిలిచిన ే టీఆర్‌
– కొడుకును మెదక్‌లో గెలిపించుకుంటానని మైనంపల్లి ధీమా
-మీ ఫ్యామిలీ లో నలుగురు ఉన్నారు కదా?
– దాన్ని నేను క్వాశ్చన్ చెయ్యడం లేదు
– ఇస్తే ఇద్దరికీ ఇవ్వండి.. లేకుంటే ఇద్దరికీ ఇవ్వకండి
– నన్ను వద్దు అనుకుంటే నేను ఏం చేస్తాను?
– ఒకేమాట కు కట్టుబడి ఉంటా
మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
(మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ నేను ఇస్తే ఇద్దరికీ ఇవ్వండి. లేకుంటే ఇద్దరికీ ఇవ్వకండి అని చెప్పాను… నాకు ఆల్రెడీ టికెట్ డిక్లేర్ చేశారు… వాళ్ళు నన్ను వద్దు అనుకుంటే నేను ఏం చేస్తాను? ఒకేమాట కు కట్టుబడి ఉంటాను… ఇద్దరికీ ఇస్తేనే చేస్తాం… వర్క్ చేసేది చూడండి మీరు… ఒక ఫ్యామిలీలో ఇద్దరు అని కాదు మరీ మీ ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు కదా… దాన్ని నేను క్వాశ్చన్ చెయ్యడం లేదు… మీ క్యాపబిలిటీస్ ను బట్టి మీరు ఉంటుంది… హీ ఇస్ క్యాపబుల్ నా కన్నా బెటర్… నా కన్నా చిన్న ఎజ్ లో సోషల్ ఆక్టివిటీస్ స్టార్ట్ చేసాడు కాబట్టి డేఫినేటలి నా సపోర్ట్ మా అబ్బాయికి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ ’’ ఇదీ.. మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన చేసిన వ్యాఖ్య.

మల్కాజిగిరి టికెట్‌ తిరిగి ఆయనకే ప్రకటించిన నేపథ్యంలో.. మైనంపల్లి చేసిన వ్యాఖ్య, బీఆర్‌ఎస్‌ వర్గాల్లో సంచలనం సృష్టించింది. పార్టీని కుదిపేసింది. తన కుమారుడికి మెదక్‌ సీటు ఇవ్వాలని, చాలాకాలం నుంచి కోరుతున్న మైనంపల్లి కోరిక నెరవేరలేదు. అయితే ఆయనకు మాత్రం తిరిగి మల్కాజిగిరి సీటు ఇస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.

అయినప్పటికీ.. అధినేత ప్రకటన ఆయనను సంతృప్తి పరచలేదు. ‘ఇస్తే ఇద్దరికీ ఇవ్వండి. లేకపోతే వద్దు’ అన్న తన మాటకు కట్టుబడి ఉంటానని, మైనంపల్లి స్పష్టం చేశారు. మారిన ఈ పరిణామాల నేపథ్యంలో.. మల్కాజిగిరి సీటు ఆయనకే ఇస్తున్నట్లు మళ్లీ ప్రకటిస్తారా? లేక కేసీఆర్‌ కుటుంబాన్ని ధిక్కరించినందుకు, మరొకరిని అక్కడ అభ్యర్ధిగా ప్రకటిస్తారా అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.

పైగా..‘‘ కేసీఆర్‌ కుటుంబం నుంచి నలుగురు ఉన్నారు. దాన్ని నేనేమీ ప్రశ్నించడం లేదు కదా? మరి తన కుటుంబంలో ఇద్దరికి ఇస్తే తప్పేమిట’’న్న లాజిక్‌ను, మైనంపల్లి వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశమైంది.

నిజానికి మైనంపల్లి.. తనకు సీటు ప్రకటించకముందు .. తిరుమలలో సీఎం కేసీఆర్‌ మేనల్లుడైన మంత్రి హరీష్‌రావుపై, బహిరంగంగానే విరుచుపడిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

‘ నా కుమారుడికి టికెట్‌ రాకుండా అడ్డుపడిన హరీష్‌రావు చరిత్ర నాకు తెలుసు. ట్రంకుపెట్టె, రబ్బరు చెప్పులతో వెలమ హాస్టల్‌లో చేరడానికి వచ్చిన హరీష్‌రావు ఈరోజు లక్ష కోట్లు ఎలా సంపాదించారు? అదంతా అక్రమ సంపాదనే. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో నియంతగా పనిచేస్తున్నారు. నా కొడుకును ఎలా గెలిపించుకోవాలో నాకు తెలుసు. మెదక్‌ను దోచి సిద్దిపేటకు పెడుతున్నాడు. ఎన్నికల్లో హరీష్‌ను ఓడించడం, నా కొడుకును మెదక్‌లో గెలిపించడమే నా లక్ష్యం’ అని మైనంపల్లి చేసిన హెచ్చరికల వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

అటు మైనంపల్లి వ్యాఖ్యలను, మంత్రి కేటీఆర్‌ తప్పుపడుతూ ట్వీట్‌ చేశారు. హరీష్‌రావుకు మద్దతుగా నిలవాలని పార్టీ నేతలను కోరారు. హరీష్‌రావు పార్టీ మూలస్తంభంగా కొనసాగుతారని స్పష్టం చేశారు.

అయితే.. వారసులకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించిన బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై, మైనంపల్లి సంధించిన అదే వారసత్వ అస్త్రం, విపక్షాలకు ఆయుధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ‘మీ కుటుంబంలో నలుగురు లేరా’అన్న మైనంపల్లి ప్రశ్న, కల్వకుంట్ల కుటుంబాన్ని నేరుగా తాకినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌, కవిత పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రకు ఇన్చార్జిగా, కల్వకుంట్ల కుటుంబానికి చెందిన వ్యక్తినే నియమించిన విషయం తెలిసిందే.
మైనంపల్లి తాజా ఆరోపణల నేపథ్యంలో, మళ్లీ బీఆర్‌ఎస్‌పై ‘కుటుంబపార్టీ ముద్ర’ చర్చకు వచ్చేందుకు కారణమయింది. అంటే.. ఇకపై కేసీఆర్‌ రాజకీయ ప్రత్యర్ధులు.. మైనంపల్లి వ్యాఖ్యలను కేంద్రంగా చేసుకుని, కేసీఆర్‌కుటుంబంపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెడతారన్నమాట.

అయితే కేసీఆర్‌ పార్టీ స్థాపించిన తర్వాత చాలామంది నేతలు, ఆయనపై తిరుగుబాటు చేశారు. పార్టీ వీడారు. అందులో కొందరిని కేసీఆరే బహిష్కరించారు. కానీ సీఎం అయిన తర్వాత ఒక్కరు కూడా కేసీఆర్‌ నిర్ణయాన్ని ప్రశ్నించే సాహసం చేయలేదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఎంపిక సమయంలో కూడా కేసీఆర్‌ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేదు.

కానీ ఇప్పుడు తొలిసారి.. అది కూడా సొంత వెలమ సామాజికవర్గానికే చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే.. తిరుగుబాటు బావుటా ఎగురవేయటం, రాజకీయ వర్గాల్లో సహజంగానే సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్‌ కుటుంబసభ్యుడైన హరీష్‌రావును విమర్శించిన మైనంపల్లిని.. పార్టీ నుంచి బహిష్కరిస్తారా? లేదా? అన్నది చూడాలి.

LEAVE A RESPONSE