ప్రజా ఆమోదయోగ్యం కాని నిర్ణయమే కొత్త జిల్లాల ఏర్పాటు

Spread the love

– దళిత నేతల పేర్లు పెట్టక పోవడం దళితులకు ద్రోహమే
-అంబేద్కర్, సంజీవయ్య, జాషువా లను విస్మరించారు
-ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన తగదు
-జగన్ రెడ్డి మనసులోని పైశాచికత్వాన్ని బయట పెట్టారు
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ : ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన చేశారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ మండిపడ్డారు. కొత్త జిల్లాల ఏర్పాటు తో జగన్ రెడ్డి తన మనసులోని పైశాచికత్వాన్ని బయట పెట్టారని విమర్శించారు.

ఈ విభజన లోపభూయిష్టంగా సాగిందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గమే ప్రామాణికం అంటూ ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల మూలంగా వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదని ప్రశ్నించారు. ఎప్పటినుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదని ధ్వజమెత్తారు.

ప్రతిపక్ష నేత గా ఉన్న సమయంలో దళితులకు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన తరువాత కొత్త జిల్లాలకు దళిత నేతల పేర్లు పెట్టకుండా దళితులకు తీరని ద్రోహం చేశారని శైలజనాథ్ విమర్శించారు. ఇంత చేసినా నరం లేని దళితమంత్రులు, ఎమ్మెల్యేలు చూస్తూ ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ తరహా విభజనతో ప్రజలకు ఏ విధంగా పాలన చేరువ చేస్తున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సోమవారం ఆయన అంధ్ర రత్న భవన్ నుండి పత్రికా ప్రకటన విడుదల చేసారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూల్చడం….అప్పులు….అవినీతి…. ఆస్థుల తాకట్లు.. మద్యం అమ్మకాలు… ఇలా నవరత్నాలు పొదిగిన కార్యక్రమాలు చేపట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ఆర్థిక క్షోభకు గురి చేసి ఆంధ్ర ప్రదేశ్ ను అమ్ముకునే స్థాయికి దిగజార్చారని విమర్శించారు. ఇంతటి దుర్మార్గమైన పాలన ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో చూడలేదని, ఇక రాకూడదని అన్నారు.

జిల్లాలు ఏర్పాటు చేయడానికి ముందు, ముసాయిదా వచ్చిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు అభిప్రాయాలను తీసుకోలేదని, వినతులను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. 13 జిల్లాలకే పరిపాలన చేత కాని జగన్ రెడ్డి 26 జిల్లాలు చేసి నిధులు లేకుండా వనరులు, మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో లోపాలపై ప్రజలు చేసే ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

Leave a Reply