Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పార్టీ పునాదులు వివేకా రక్తంతో తడిచి ఉంది

-భారతి .. మీ వద్ద ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండి
-జగనన్నా.. మాపై నిందలు వేయడానికి మీకు సిగ్గుగా లేదా?
-జగనన్నా.. మమ్మల్ని పట్టించి రూ.5 లక్షల బహుమతి అందుకోండి
-ఆధారాలు ఉండీ పోలీసులకు ఇవ్వకపోవడం నేరం
-అన్నం పెట్టిన చేతిని నరకడం, వ్యక్తిత్వం మీద బురద జల్లడం దారుణం
-కడపలో వైఎస్ వివేకా ఐదో వర్థంతి సందర్భంగా ఆత్మీయ సమావేశం లో వైఎస్ సునీత

తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో, ఆయన బిడ్డ డాక్టర్ సునీత సంచలన వ్యాఖ్యలుచేశారు. తండ్రి లేని మా కుటుంబాన్ని హింసించడానికి మీకు సిగ్గుగా లేదా జగనన్నా అని ప్రశ్నించారు.

భారతీరెడ్డి దగ్గర ఆధారాలుంటే, వాటిని పోలీసులకు ఇవ్వాలని సవాల్ చేసిన ఆమె… తనను పట్టించి 5 లక్షల రూపాయల సీబీఐ బహుమతి తీసుకోమని తన సోదరుడు జగన్‌ను కోరారు. తన తండ్రి వర్థంతి కార్యక్రమానికి పులివెందులలో అడ్డంకులు సృష్టిస్తే కడపలో పెట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

డాక్టర్ సునీత ఇంకా ఏమన్నారంటే…వివేకా మొదట్లో కమ్యూనిస్టు పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత వివేకా.. రెడ్డి కాంగ్రెస్ ఆతర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఉమ్మడి కుటుంబానికి వివేకా ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. వివేకా.. అన్నమాట జవదాటని తమ్ముడు.. చెల్లెళ్లంటే ప్రాణం. కడప, పులివెందుల అంటే వివేకాకు ఎంతో ఇష్టం . వ్యవసాయం అంటే వివేకాకు ప్రాణం. విదేశాలకు వెళ్లి సాగు గురించి తెలుసుకునేవారు.

2009లో జగనన్న రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. 2009లో వివేకా రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనుకున్నారు. ఫ్యాక్షన్, హింసను తగ్గించాలని వివేకా నిత్యం ఆలోచించేవారు. నేను అమెరికాలో చదివేటప్పుడు అక్కడికొచ్చి 2, 3 వారాలకంటే ఉండేవారు కాదు. వివేకా మన నుంచి దూరమై ఐదేళ్లయింది. వివేకాకు అంత కీడు ఎలా తలపెట్టారని ఆలోచిస్తున్నప్పుడే జగనన్న సీఎం అయ్యారు .

ప్రజలందరికీ న్యాయం చేస్తానని జగనన్న ప్రమాణస్వీకారం చేశారు. జగనన్న ప్రమాణ స్వీకారం చూసి మనమంతా గర్వపడ్డాం. జగనన్నను ఒక ప్రశ్న అడుగుతున్నా.. అంతఃకరణశుద్ధిగా అంటే అర్థం తెలుసా? వివేకాను చంపినవారికి, చంపించినవారికి శిక్షపడేలా చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇప్పటివరకూ హంతకులకు శిక్షపడేలా ఎందుకు చేయలేదు?

జగనన్నా.. మీ ప్రమాణాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదు ? నేరస్థులకు శిక్షపడాలని పోరాడుతున్న నాపై నింద మోపుతారా? నాకు, నా కుటుంబానికి ఈ హత్యతో సంబంధం ఉంటే ఎందుకు అరెస్టు చేయలేదు? మేం ఈ నేరం చేశామని చెప్పడం మీకు ఎబ్బెట్టుగా లేదా? మీరే ప్రభుత్వంలో ఉండి.. ఆరోపణలు చేయడమేంటి? ఇది శాంతిభద్రతల సమస్య.. బాధ్యులెవరైనా చర్య తీసుకోండి . శాంతిభద్రతల విషయంలో పక్షపాతం ఉండకూడదు. హంతకులను పట్టిస్తే రూ.5 లక్షలు ఇస్తామని సీబీఐ ప్రకటించింది . జగనన్నా.. మమ్మల్ని పట్టించి రూ.5 లక్షల బహుమతి అందుకోండి .

జగనన్నా.. పదేపదే మాపై నిందలు వేయడానికి మీకు సిగ్గుగా లేదా? – సాక్షి పత్రికలో మాపై పదే పదే నిందలు వేస్తూ వార్తలు రాస్తున్నారు. సాక్షి చైర్మన్ భారతికి ఓ విన్నపం.. మీ వద్ద ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండి – ఆధారాలు ఉండీ పోలీసులకు ఇవ్వకపోవడం నేరం. మీకోసం నిరంతరం పనిచేసిన వివేకాను మీరు మర్చిపోయారా? అన్నం పెట్టిన చేతిని నరకడం, వ్యక్తిత్వం మీద బురద జల్లడం దారుణం.

LEAVE A RESPONSE