– ఉత్సవంలో ఉత్సవవిగ్రహాలు..!
ఇక్కడే పుట్టాను..
ఇక్కడే చదువుకున్నాను..
ఇక్కడే పెరిగాను..
ఇక్కడే ఉద్యోగం కూడా చేశాను..
నా వయసు ఎంతో
మహా అయితే అంతకు అయిదు తక్కువగా(నిజానికి అదీ లేదు..అయితే ఊహ తెలియదు గనక ఆ అయిదూ మినహాయించాల్సి వచ్చింది) పైడితల్లి ఉత్సవాలు చూసాను. జనం మధ్యలో ఒకడిగా..
మేడలపై నుంచి..సందులలో నిలబడి.. బారికేడ్ల ఆవల నలిగిపోతూ..
ఇలా రకరకాలుగా.. ఇప్పుడైతే ఎక్కువగా టివిలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా..
పైడితల్లి పండగ ఎప్పుడు ఎలా జరిగిందో..గతంలో ఏంటి..
ఇప్పుడు ఎలాగ..
బాగా తెలిసిన వాళ్ళలో నేనొకన్ని..
అంతేనా..కుర్రాడిగా జనం మధ్యలో అల్లరి చేశాను..
పల్లెటూరు వాళ్ళు వస్తే వాళ్ళ భుజాలపై కండువాలను లాగి ఎగరేసి
ఎంజాయ్ చేసిన బ్యాచీలలో ఉన్నాను. సిరిమాను ఆ చివర కూర్చుని ఉండే బైరాగి నాయుడుకి గురిపెట్టి అరటిపండు విసిరి తగిలితే అంతులేని విజయగర్వంతో ఊగిపోయిన సందర్బాలు ఇంకా గుర్తున్నాయి.తొలేళ్ళ
నాడు రాత్రంతా బలాదూరుగా రోడ్లు మీద తిరుగుతూ
సత్య లాడ్జి సెంటర్లో కుమ్మరి మాస్టారి బుర్రకథ కొంచెం విని..
ఆయన అప్పుడప్పుడూ చెప్పే బూతు జోకులకు ముసిముసిగా నవ్వుకుంటూ
అలా కోట వైపు వెళ్ళి రాఘవకుమార్ బుర్ర కథ..ఇంకో చోట రొంగలి వారి ప్రోగ్రాం తిలకించి మధ్యమధ్యలో జనాల్ని అల్లరి పెడుతూ.. గంటస్తంభం జంక్షన్లో కొప్పు గురన్న మేడపై ప్రకాష్ మాష్టారి సినిమా పాటల ఆర్కెస్ట్రాలో పాటలు విని అర్ధరాత్రి అయ్యాక
మా శ్రీ వేంకటేశ్వర టాకీసులో
ప్రదర్శించే ప్రత్యేక ఆటకి ప్రొప్రయిటర్ హోదాలో బుకింగుని పర్యవేక్షించి
ఏ తెల్లారు గట్టనో కల్లాపు జల్లే సమయానికి ఇంటికి చేరుకుని నాన్నకి తెలియకుండా బుద్దిగా కాసేపు బజ్జొని మళ్లీ సిరిమాను ఉత్సవానికి..
ఉత్సాహానికి
సిద్ధపడటం..
ఎన్నో ఏళ్ళు ఇదే వైభోగం..!
జర్నలిస్ట్ అయిన తర్వాత సంబరంలో
విధి నిర్వహణలో..
అబ్బో అదో విఐపి అనుభవం..ఎన్ని ప్రత్యేక సంచికలు వేసానో..
మొదట ఆంధ్రప్రభలో..
తర్వాత విజయనగరం టైమ్స్..అటు పిమ్మట
త్రిశూల్ సమాచారం..
నా అనుభవాలన్నీ వాటిలో కథనాలుగా రాశాను.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే
ఆ రోజుల్లో ఇంత మంది పోలీసులు..ఇన్ని ఆంక్షలు..
ఈ బ్యారికేడ్లు.. ఆబ్లిగేషన్లు..రాజకీయ జోక్యాలు..దౌర్జన్యాలు లేవు.
పోలీసులు జనాన్ని అదుపు చేసే వారు.అందులో భాగంగా అప్పుడప్పుడు లాఠీలకు పని చెప్పేవారు.
ఉత్సవాలు పూర్తిగా అధికారుల నియంత్రణలో జరిగేవి.రాజకీయ నాయకులు.. ప్రజాప్రతినిధులు అందరూ సామాన్య భక్తులతో సమానమే.మహా అయితే కాస్త ప్రత్యేక హోదాతో
దర్శనం చేసుకుని వెళ్లిపోయేవారు.పోలీసులపై వారి అజమాయిషీ ఉండేది కాదు. జనానికి వాళ్ళ వల్ల ఇబ్బంది జరిగేది కాదు.
రాజకుటుంబం అప్పుడూ ఇప్పుడూ కోట బురుజుపై పై నుంచే సిరిమాను ఉత్సవాన్ని చూస్తోంది.అందులో
ఏం మార్పు లేదు.
ప్రజల తీర్పును అనుసరించే కొత్త మార్పులు.
నాకు తెలిసి ఈ తరహా హడావిడిలు..అతి బందోబస్తులు లేకపోయినా
పైడితల్లి జాతరలో ఇంతవరకు ఎటువంటి
అవాంచనీయ సంఘటనలు జరగలేదు.ఇప్పుడిప్పుడు అవాంఛనీయ ధోరణులు పెరుగుతున్నాయి. మా వల్లనే జాతర ఇంత బాగా జరుగుతోందని ప్రజలకు సందేశం ఇవ్వడానికి తెగ తాపత్రయపడుతున్నారు నేతలు.ఉత్సవానికి
రాజకీయ రంగు పలుకుతున్నారు.జాతరలో భక్తుల సౌకర్యానికి
పాతర వేస్తున్నారు.
ఎప్పుడూ ప్రశాంతంగా జరిగే ఉత్సవాన్ని కొంత రసాభాస చేస్తున్నారు.ఇంతా చేసి వేళ పట్టున మొదలెట్టి వేళ ఉండగా పూర్తి చేస్తున్నారా..అంటే అదీ లేదు.అందునా ఈసారి
సమతానికి వర్షం పట్టుకుంది..జనం కదలరు..రోజూ ఇదే సమయానికి వర్షం పడుతోంది..ఈరోజు కూడా పడుతుంది కదా అనే ఆలోచన చెయ్యని అధికారులు అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చెయ్యలేదు..
అంతా విగ్రహం పుష్టి.. నైవేద్యం నష్ఠి..చందం..
ఎన్ని అన్నా పట్టించుకోని తోలు మందం..నాలుగు దాటుతున్నా ఊరేగింపు మొదలు కాలేదు!
జాతరలో ప్రజలే విఐపిలు అనే ఇంగితం నాయకులకు.. పోలీసులకు ఎప్పుడు కలుగుతుందో మరి..
తల్లికి బిడ్డలకు అనుసంధానం అన్నట్టు ఫోజులు కొడుతూ మొత్తం విధానం అంతా వారి చేతుల్లోకి తెచ్చుకుని విధం చెడగొడుతున్నారు.
– ఈఎస్కే..