– విద్యా ప్రమాణాలు – విస్తరణ – వ్యాపారీకరణ
– వైద్య విద్య వ్యాపారీకరణ – వైద్యం కార్పోరేటీకరణ సమాజానికి ఆత్మహత్యా సదృశమే
(టి. లక్ష్మీనారాయణ )
ప్రభుత్వ – ప్రయివేట్ భాగస్వామ్యం (పిపిపి) విధానంలో నూతన వైద్య కళాశాలలను అభివృద్ధి చేయాలన్న కూటమి ప్రభుత్వ విధాన నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. వైద్య విద్య విస్తరణ అవసరమే. విద్య నాణ్యతా ప్రమాణాలు పతనమైతే నాసిరకం వైద్యులు తయారై, ఆరోగ్య రంగం సంక్షోభంలోకి నెట్టబడే ప్రమాదమున్నది.
వైద్య కళాశాలల ఏర్పాటు – విద్యా ప్రమాణాల పరిరక్షణను వేరువేరుగా పరిగణించకూడదు. సమాజానికి మెరుగైన ఆరోగ్య సేవలను అందించగల నైపుణ్యం ఉన్న వైద్య పట్టభద్రులను అందించే కళాశాలలను నెలకొల్పాలి. లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానాలు, నిర్వహణలో అసమర్థత – అవినీతి, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బందిలో పని సంస్కృతి బలహీనపడటం, వైద్య విద్యా రంగాన్ని భ్రష్టుపట్టించాయి.
వ్యాపారీకరణతో వైద్య విద్యను ఖరీదైన అంగడి సరకుగా మార్చారు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, నైపుణ్య అధ్యాపకుల కొరత, తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. తరగతులకు హాజరుకావాలన్న ఆసక్తి విద్యార్థుల్లో కొరవడుతున్నదన్న అంశం ఆందోళనకరమైనది. విద్యా ప్రమాణాల పరిరక్షణ పట్ల ప్రభుత్వాల్లో సంకల్పం లేదు. వైద్య విద్య వ్యాపారీకరణ – వైద్యం కార్పోరేటీకరణ సమాజానికి ఆత్మహత్యా సదృశమే.
వైద్య కళాశాలలు – ఆరోగ్య వ్యవస్థ: వైద్య కళాశాలలు మరియు బోధనా ఆసుపత్రుల ద్వారా యంబిబిఎస్, యంఎస్/యండి మరియు సూపర్ స్పెషాలిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కు నాణ్యమైన విద్య మరియు శిక్షణ అందించడం ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రంలో 1145 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 559 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 174 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 54 ఉప జిల్లా కేంద్రాలు, 9 జిల్లా ఆసుపత్రులు, 21 బోధన మరియు అనుబంధ ఆసుపత్రులు ఉన్నాయి.
ఈ ఆసుపత్రుల వ్యవస్థను పటిష్టపరచి, విస్తరించి, సమర్థవంతంగా నిర్వహించాలి. రోగులకు నాణ్యమైన చికిత్స అందించడానికి, పౌరుల ఆరోగ్యాన్ని కాపాడటానికి నైపుణ్యం ఉన్న వైద్యులు అవసరం. ప్రస్తుతం 18 ప్రభుత్వ వైద్య కళాశాలలు (3,290 సీట్లు) మరియు 20 ప్రయివేటు కళాశాలలు (3,550 సీట్లు) ఉన్నాయి. క్యాపిటేషన్ ఫీజు, పెద్ద మొత్తంలో ట్యూషన్ ఫీజులు చెల్లించి, వైద్య పట్టభద్రులైన వారు ప్రభుత్వ డాక్టర్లుగా ఉద్యోగాల్లో చేరరు. మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్, 125 సీట్లు) ఉన్నది.
17 కళాశాలల ఏర్పాటుకు ఒకేసారి అనుమతి: ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఆలోచనతో ఏలూరు కళాశాల ఏర్పాటుకు నాటి టిడిపి ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 7న జీవో నెం.17 జారీ చేసింది. తర్వాత వైసిపి ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా ఏలూరుతో పాటు 17 వైద్య కళాశాలలను “సెల్ప్ ఫైనాన్స్” విధానంలో ఏర్పాటుకు రు.8,480 కోట్ల వ్యయ అంచనతో నాడు – నేడు పథకం కింద అనుమతిస్తూ 2020 మరియు 2021లో జీవోలు జారీ చేసింది.
వాటిలో పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల (నిర్మాణంలో ఉన్నది) కళాశాలలకు కేంద్ర ప్రాయోజిత పథకం కింద నిధులు మంజూరైనాయి. అప్పులు చేయడంలో రికార్డులు బద్దలుకొట్టే నైజం మన పాలకులది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన “మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ పథకం” కింద రాజమహేంద్రవరం, ఏలూరు, నంద్యాల కళాశాలలకు మరియు మిగిలిన 11 కళాశాలల నిర్మాణానికి నాబార్డు అనుబంధ సంస్థ అయిన “గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ” నుండి రుణాన్ని మంజూరు చేయించుకున్నారు.
విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను 2023-24 విద్యా సం.లోను మరియు పాడేరు కళాశాలను 2024-25లోను ప్రారంభించారు. ఫలితంగా మెడికల్ సీట్లు 800 పెరిగాయి. మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లి కాలేజీలకు కొంత మంది అధ్యాపకులను, అధ్యాపకేతర సిబ్బందిని పాత కళాశాలల నుండి హడావుడిగా బదిలీ చేశారు.
మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించలేదని నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇవ్వలేదు. మిగతా ఏడు కళాశాలల నిర్మాణాలు ప్రాథమిక దశల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ (పాత) కళాశాలల అభివృద్ధికి రు.3850 కోట్లు 2021 మార్చి 22న మంజూరు చేసి, చేపట్టిన నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేశారు.
పిపిపి ముచ్చట: 2024లో ప్రభుత్వం మారింది. మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లి, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ, పార్వతీపురం కొత్త కళాశాలల నిర్మాణ పనులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపేసింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మాణ సంస్థలతో ఉన్న ఒప్పందాల రద్దు ప్రతిపాదన చేసింది.
2025 జనవరి 23న కాంట్రాక్టులను రద్దు చేసి, పిపిపి కింద ఈ పది కళాశాలలను నెలకొల్పే నిర్ణయాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం జీవో ఆర్టీ నెం.27ను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం నుండి అందే “వయబిలిటీ గ్యాప్ ఫండ్”తో పాటు ఇతర రాయితీలిచ్చి పిపిపి మోడల్ లో నిర్మాణంలో ఉన్న కళాశాలలను పూర్తి చేయడానికి అనుమతిస్తూ 2025 సెప్టంబర్ 9న జీవో ఆర్టీ నెం.590ను జారీ చేసింది.
మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని కళాశాలలను వార్షిక రుసుం రాయితీ నమూనా కింద పనులకు టెండర్ పిలువమని కన్సల్టెంట్ సంస్థ సూచించిందని ప్రభుత్వమే వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. పిపిపి అంటే ప్రైవేటీకరణకాదంటూ ప్రభుత్వం బుకాయించడం అర్థరహితం.
వైద్య విద్యా రంగం పట్ల హ్రస్వ దృష్టి: సమాజానికి నైపుణ్యం ఉన్న వైద్యులు కావాలి. విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించాలి. బోధనాసుపత్రుల్లో మెరుగైన శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు నాసిరకంగా ఉన్నాయి. ప్రయివేటు కళాశాలల్లో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా ఉన్నాయి.
2006 నుండి వైద్య కళాశాలల అధ్యాపకులకు యుజిసి వేతనాల విధానం ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసింది. 2016లో యుజిసి వేతన సవరణ జరిగింది. వాటిని అమలు చేయడానికి మార్గదర్శకాలను సూచించమని 2019 ఫిబ్రవరిలో ప్రభుత్వం జీవో ఇచ్చింది. అటుపై వచ్చిన జగన్ ప్రభుత్వం, 2016 నుండి పెరిగిన వేతనాల బకాయిలను ఎగొట్టడానికి “ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ రివైజ్డ్ పే స్కెల్స్-2020” అంటూ 2021 మార్చిలో ప్రత్యేక జీవో ఇచ్చింది.
తద్వారా అధ్యాపకులు తీవ్రంగా నష్టపోయారు. అధ్యాపకులకు బోధనేతర పనుల భారం పెంచారు. అక్రమ జీవోలతో పదోన్నతులు, బదిలీలు, అవినీతి, తప్పుడు విధానాల పర్యవసానంగా అధ్యాపకులను నాటి ప్రభుత్వం తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడచినా వారికి వేతన బకాయిలు చెల్లించలేదు.
ప్రభుత్వ కళాశాలల్లో ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కొరత సమస్య తీవ్రంగా ఉన్నది. పలుసార్లు నియామక ప్రక్రియ చేపట్టినా ఆ సమస్య పరిష్కారం కాలేదు. కొత్త కళాశాలల్లో అధ్యాపకులను నియమించడానికి ప్రత్యేక వేతన ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వారికి మూలవేతనంలో 50%, ఇతర ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో పనిచేయడానికి 30% అదనంగా చెల్లిస్తామంటూ 2024 మే 15న జీవో జారీ చేసింది.
అసోసియేట్ ప్రొఫెసర్స్ కు ప్రొఫెసర్స్ గా పదోన్నతి లభించాలంటే పదేళ్లకుపైగా పట్టేది. అసోసియేట్ ప్రొఫెసర్స్ గా ఉన్న వారు కనీసం మూడేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకుంటేనే ప్రొఫెసర్స్ గా పదోన్నతి అన్న నిబంధనను తాత్కాలికంగా పక్కనబెట్టి, “ఒన్ టైం” మినహాయింపు ఇచ్చి, ఏడాది సర్వీసున్న వారికి కూడా పదోన్నతి కల్పించి, కొన్ని డిపార్ట్మెంట్స్ లో పదోన్నతులు ఇచ్చారు. అయినా, ప్రభుత్వ కళాశాలల్లో పెద్ద సంఖ్యలో అధ్యాపకుల ఖాళీలున్నాయి.
కేంద్ర ప్రభుత్వ విధానమేంటి? ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం రాజ్యం యొక్క కర్తవ్యమని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు. ఆరోగ్యం ప్రజల హక్కని ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కివక్కాణిస్తున్నది. నాణ్యమైన వైద్య విద్యను సామాన్యులకు అందించడం, నైపుణ్యం ఉన్న వైద్య నిపుణుల సేవలను దేశంలోని అన్ని ప్రాంతాలకు అందించడం, సమాజ ఆరోగ్య దృక్పథాన్ని ప్రోత్సహించడం ద్వారా సార్వత్రిక ఆరోగ్య సంరక్షణే జాతీయ వైద్య కమిషన్ లక్ష్యంగా చెప్పబడుతున్నది.
నేడు దేశంలో ఉన్న 780 వైద్య కళాశాలల్లో 1,18,148 సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కళాశాలలు 427 (59,782 సీట్లు), ప్రయివేట్ కళాశాలలు 352 (58,316 సీట్లు) ఉన్నాయి. ప్రయివేటు రంగంలో ఉన్న కళాశాలలను ప్రయివేటు సంస్థలు/ట్రస్టులు /సొసైటీలు నిర్వహిస్తున్నాయి. వైద్య విద్యను విస్తరించడానికి నీతి ఆయోగ్ 2016-2017 ఆర్థిక సం.లో, జిల్లా ఆసుపత్రికి అనుబంధంగా ప్రభుత్వ – ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి) లేదా సెల్ప్ ఫైనాన్సింగ్ మోడల్ కింద కళాశాలలను ఏర్పాటుచేసే ప్రతిపాదన చేసింది.
ప్రభుత్వ – సొసైటీ యాజమాన్యం కింద 2019-24 మధ్య కాలంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రెండు కళాశాలలు నెలకొల్పినట్లు ఎన్.యం.సి. వెబ్సైట్ సమాచారం తెలియజేస్తున్నది. పిపిపి నమూనాలో ఒక్క వైద్య కళాశాల నిర్వహిస్తున్న దాఖలాలు లేవు.
కేంద్ర ప్రాయోజిత పథకం: వైద్య కళాశాలల ఏర్పాటులో ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి, పట్టణ/గ్రామీణ అంతరాన్ని తగ్గించడానికి, అందరికీ ఆరోగ్య సంరక్షణ లక్ష్యంతో, ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో ఒక్క వైద్య కళాశాల కూడా లేని పార్లమెంటరీ నియోజకవర్గాలు/జిల్లాలలో ఇప్పటికే ఉన్న జిల్లా/రిఫరల్ ప్రభుత్వ ఆసుపత్రులను జతచేసి, 157 కొత్త వైద్య కళాశాలలను కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తున్నది.
దాని కింద ఈశాన్య రాష్ట్రాలు/ప్రత్యేక తరగతి హోదా ఉన్న రాష్ట్రాలకు 90% నిధులను కేంద్రం ఇస్తున్నది. ఇతర రాష్ట్రాలకు 60% నిధులు ఇస్తున్నది. ఈ పథకం క్రింద ఉత్తరప్రదేశ్ కు 27, రాజస్థాన్ కు 23, మధ్యప్రదేశ్ కు 14, పశ్చిం బంగాల్ 11, తమిళనాడుకు 11, బీహార్ కు 8, జమ్మూ & కాశ్మిర్ కు 7, ఒడిస్సాకు 7, ఆంధ్రప్రదేశ్ కు కేవలం మూడు కళాశాలలను మంజూరు చేసింది.
రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక తరగతి హోదా ముగిసిన అధ్యయమని దగా చేశారు. కానీ, కేంద్ర ప్రాయోజిత పథకం క్రింద కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రత్యేక తరగతి హోదా పేరుతో 90% నిధులను మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థికరణ చట్టం -2014లో వెనుకబడిన రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అభివృద్ధి ప్యాకేజీ ఇస్తామని పేర్కొన్నా, ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించింది.
కేంద్ర ప్రాయోజిత పథకం క్రింద కేవలం పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల వైద్య కళాశాలలకు రు.325 కోట్ల చొప్పున 2020 ఫిబ్రవరి 19న మంజూరు చేసింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ పద్దు క్రిందైనా ఎక్కువ వైద్య కళాశాలలను మంజూరు చేయమని నాటి జగన్ ప్రభుత్వం అడిగినట్లులేదు.
నేటి కూటమి ప్రభుత్వానికి ఆ ఆలోచనే కొరవడినట్లుంది. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలను పూర్తిచేసి, నిర్వహించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం క్రింద నిధులను మంజూరు చేయించుకోవడానికి అంకితభావంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసి, సాధించాలి. వైద్య విద్య మరియు ఆరోగ్య రంగాలు ఎదుర్కొంటున్న బహుముఖ సమస్యలపై ప్రభుత్వం, ప్రజలు దృష్టి సారించాలి.