Suryaa.co.in

Andhra Pradesh

ఆడబిడ్డ కష్టం విని కరిగిపోయారు.. ఆధారం చూపి ఆసరా అయ్యారు..

* ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి ఔదార్యం
* జనవాణికి వచ్చి సమస్య చెప్పుకున్న మహిళ
* సొంత నిధులతో షాపు పెట్టించి జీవనోపాధి చూపిన పవన్ కళ్యాణ్
* విజయవాడ న్యూ రాజరాజేశ్వరీపేటలో రైస్ షాపు ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను

కష్టంలో ఉన్నామని ఎవరు తలుపు తట్టినా తక్షణం స్పందించి వారి కష్టం తీర్చే నాయకుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చేతిలో అధికారం లేని సమయంలో కూడా ఆయన ఎముకలేని చెయ్యి ఎంతో మందికి సాయం చేసింది. కూటమి భాగస్వామిగా అధికారం చేపట్టిన తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జనం సమస్యలు వినేందుకు జనవాణి విభాగాన్ని ఏర్పాటు చేసి నిత్యం ఎంతో మంది సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు.

ఆ క్రమంలో విజయవాడ న్యూ రాజరాజేశ్వరీపేటకు చెందిన చీకట్ల కరుణ అనే మహిళ తన కష్టం చెప్పుకునేందుకు మంగళగిరి కేంద్ర కార్యాలయం వద్ద జనవాణిని ఆశ్రయించారు. అదే రోజు ప్రజల నుంచి
పవన్ కళ్యాణ్ గారు నేరుగా వినతులు స్వీకరించగా కరుణ తన పరిస్థితిని ఆయనకు వివరించారు.

భర్త తాగుడుకు బానిస అయిన కారణంగా కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని, ఏదైనా స్వయం ఉపాధి మార్గం చూపి జీవనాధారం కల్పించాలని కన్నీటిపర్యంతం అవుతూ వేడుకున్నారు. ఆమె కష్టం విని పవన్ కళ్యాణ్ గారు కరిగిపోయారు. ఉన్న చోటే ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఔదార్యం చాటుకున్నారు. న్యూ రాజరాజేశ్వరీపేట మెయిన్ రోడ్డులో ఓ షాపు అద్దెకు తీసుకుని, రూ. లక్ష సొంత నిధులతో బియ్యం, కూరగాయల దుకాణం పెట్టించారు.

ఆ మహిళ కష్టం తీర్చి జీవనోపాధి కల్పించారు. శుక్రవారం ఉపముఖ్యమంత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ బియ్యం మరియు కూరగాయల దుకాణాన్ని జనసేన పార్టీ ఏన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను చేతుల మీదుగా ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్, పార్టీ నాయకులు దాసరి సత్యనారాయణ, గిరికిపాటి శివశంకర్, కొప్పినీడి సూర్యనారాయణమూర్తి తదితరులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ దుకాణం ఏర్పాటు ప్రక్రియ మొత్తం దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ, పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

* అన్నా అని తలుపుతట్టిన వెంటనే స్పందించారు
అన్నా సమస్య వచ్చింది అని తలుపు తట్టిన వెంటనే స్పందించి తనకు జీవనోపాధి కల్పించిన పవన్ కళ్యాణ్ కి జీవితకాలం రుణపడి ఉంటామని ఈ సందర్బంగా కరుణ తెలిపారు. జనవాణిలో పవన్ కళ్యాణ్ కి నేరుగా సమస్య చెప్పుకుంటే ఆయన తక్షణం స్పందించారు. స్థానిక పార్టీ నాయకులను నా వద్దకు పంపి, ఇక్కడ ఉపాధి మార్గాలను పరిశీలించారు. పవన్ కళ్యాణ్ సొంత డబ్బు ఇచ్చి షాపు పెట్టించారు.

నా కాళ్ల మీద నేను నిలబడే అవకాశం కల్పించారంటూ ఆనందం వ్యక్తం చేశారు. జనవాణి జనసేన భరోసా అంటూ బాధ్యతగల ప్రతిపక్షంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన పవన్ కళ్యాణ్, అధికారం చేపట్టిన నాటి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద అదే జనవాణి పేరిట గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. నిత్యం ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటికి పరిష్కారం చూపుతున్నారు. జనవాణి కార్యక్రమం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది కష్టాలు తీరుస్తోంది. కరుణ లాంటి వారికి ఉపాధి మార్గాలు చూపుతూ ప్రత్యక్షంగా సాయం చేస్తుండగా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి పరోక్షంగా భరోసా కల్పిస్తుందని ఉదయభాను తెలిపారు.

LEAVE A RESPONSE