– కూటమి పాలనపై సతీష్ కుమార్ రెడ్డి మండిపాటు
వైయస్సార్ కడప: ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కి, నిస్సిగ్గుగా హామీలన్నీ అమలు చేశామని కూటమి ప్రభుత్వం చెబుతోందని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. వైయస్సార్ కడప జిల్లా వైయస్సార్సీపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రాధాన్య పథకంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ లో నాలుగింటి ఊసే లేదని, రెండు పథకాలను అరకొరా అమలు చేసి అన్నీ చేసేశామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే క్షేత్రస్ధాయిలో పరిశీలనకు రావాలని సవాల్ విసిరారు.
ఇదే విషయాన్ని బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రశ్నిస్తే… డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసిన చంద్రబాబు లేని లిక్కర్ స్కాంలో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అయినా ప్రజల తరపున పోరాటం ఆగదని సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లాలో మంత్రి లోకేష్ ప్రోద్భలంతో కొత్త సంస్కృతిని తీసుకురావాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనుకంటే.. అదే స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందని కూటమి పార్టీ నేతలను హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
కూటమి పార్టీ నేతలు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు మా ప్రథమ ప్రాధాన్యం అని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత సూపర్ సిక్స్ లో అన్నింటినీ అమలు చేశామని, ఒక్క ఆడబిడ్డ నిధి పథకం మాత్రమే పెండింగ్ అన్నారు. ఆ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని మంత్రి అచ్చన్నాయుడు మాట్లాడారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సూపర్ సిక్స్ అమలు చేశామని ఎవరైనా కాదంటే వారికి నాలుక మందం అంటూ మాట్లాడారు. వాస్తవానికి సూపర్ సిక్స్ లో ఏ మేరకు అమలు చేసిందో చూస్తే.. అసలు వాస్తవం బయటపడుతుంది.