Suryaa.co.in

Andhra Pradesh

‘తల్లికి వందనం’లో ప్రభుత్వం పచ్చి వంచన

– ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు స్కీమ్‌ మైనస్‌
– యూడైస్‌ ప్లస్‌ డేటాలో విద్యార్ధుల సంఖ్య 87 లక్షలు
– తల్లికి వందనం ఇస్తున్నది కేవలం 67 లక్షల మందికి
– మరి మిగిలిన 20 లక్షల పిల్లల సంగతి ఏమిటి?
– మంత్రి నారా లోకేష్‌ దీనికి సమాధానం చెప్పాలి
– శ్రీకాకుళం జిల్లా పలాస వైయస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

పలాస: ఏడాది పాలనలో అన్ని రంగాలను నాశనం చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని వైయస్సార్‌సీపీ డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. తొలి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు అమలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్న తల్లికి వందనం పథకంలో కూడా ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు అన్యాయం చేశారని పలాసలో మీడియాతో మాట్లాడిన ఆయన చెప్పారు.

తల్లికి వందనం పథకంలో 20 లక్షల మంది పిల్లలకు అన్యాయం చేసిన విషయం.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యూడైస్‌ ప్లస్‌ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) డేటాలో ఉన్న గణాంకాలకు, తల్లికి వందనం అమలుపై మంత్రి నారా లోకేష్‌ చెప్పిన లెక్కలకు మధ్య ఉన్న తేడాతో వెలుగు చూసింది.

అమ్మ ఒడితో పాటు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. ఇంకా ఇతర సంక్షేమ పథకాలను ఏడాది కాలంగా అమలు చేయకపోవడం వల్ల పేద కుటుంబాలకు చెందిన పిల్లలు బడికి బదులు పనులకు వెళ్ళే పరిస్థితి కల్పించారు. రాష్ట్రంలో 67 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్‌ వరకు చదువుతున్నారని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. ఈ సంఖ్యను మంత్రి లోకేష్‌ ఎక్కడి నుంచి తీసుకువచ్చారో తెలియడం లేదు.

67 లక్షల విద్యార్ధులే ఉన్నట్లు ఎలా చెబుతున్నారు?

దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్ధుల వివరాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని యూడైస్‌ ప్లస్‌ డేటాలో ఉంటాయి. రాష్ట్రంలో ఇంటర్‌ వరకు చదువుతున్న విద్యార్థులు 87,04,414 మంది ఉన్నట్లు 2023–24 యూడైస్‌ ప్లస్‌లో డేటాలో ఉంది. మరి ఆ డేటాలో ఉన్న సంఖ్యను కాదని ఏపీ ప్రభుత్వం 67 లక్షల మంది మాత్రమే విద్యార్ధులు ఉన్నారని ఎలా చెబుతోంది? విద్యార్ధుల సంఖ్యను ఎలా లెక్కించారు? దీనికి మంత్రి నారా లోకేష్‌ ఏం సమాధానం చెబుతారు?

గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకంలో 42.61 లక్షల మంది తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడం జరిగింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా తల్లుల సంఖ్య 42 లక్షలేనని చెబుతోంది. అలాంటప్పుడు, విద్యార్థుల సంఖ్య పెరిగితే పెరగాలి కానీ.. ఎలా తగ్గుతుంది?. దీనికి మంత్రి నారా లోకేష్‌ సమాధానం చెప్పాలి. అంటే, ఎలా చూసినా.. టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనంలో ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు పథకాన్ని వర్తింప చేయకుండా తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE