Suryaa.co.in

Political News

తెలుగు ప్రజల ఆశ… ఆకాంక్ష..చంద్రబాబే

1977,నవంబర్ 18 రాత్రి . ఆరోజు కూడా అన్ని రాత్రుల లాగానే ఉంటుందని దివిసీమ జనం అనుకుని ఉంటారు . కానీ లేదు . వారి పాలిట కాళరాత్రి గా చరిత్ర లో మిగిలిపోయింది.బంగాళాఖాతంలో తలెత్తిన ఉప్పెన సమీప గ్రామాలపై విరుచుకు పడింది. గ్రామాలకు గ్రామాలను ముంచెత్తింది . వేలమంది నిద్రపోతున్నవారు …. నిద్ర పోతున్నట్టే ఎటో కొట్టుకుపోయారు . మెలుకువ వచ్చినవారు…. ఆ ప్రవాహం లో చెట్ల కొమ్మలకు తగులుకుని …. వాటినే పట్టుకుని వేలాడుతూ ఆ కాళరాత్రి గడిపారు. వరి కుప్పలు కొట్టుకు పోయాయి . వేలాదిగా పశువులు చనిపోయాయి. మనుషుల్ని , కోట్లాది విలువైన ఆస్తుల్ని , , పొలాల్లో పంట కుప్పల్ని ఒకే ఒక రాత్రి లో ఉప్పెన ఊడ్చేసింది . పచ్చని పంట పొలాలు మేట వేసుకుపోయాయి.

తెల్లవారాక చూస్తే, బంగాళాఖాతం ఎంతో అమాయకం గా ప్రశాంతం గా…. ‘ జగన్ చిరునవ్వు ‘ లా కనిపించింది . కానీ , ఒక్క రాత్రిలో అది సృష్టించిన విధ్వంసం నుంచి దివిసీమ పరిస్థితులను చక్కదిద్దడానికి …. మండలి వేంకట కృష్ణారావు వంటి నిస్వార్ధ నేతలకు సైతం ఒక దశాబ్దానికి పైగా పట్టింది .

దివిసీమ ఉప్పెన లాటి వైకాపాసుర గణం “ మేమేంటో చూద్దురు గానీ ….ఒక్కసారి …. ప్లీజ్…” అంటూ రాష్ట్రం పై పడిపోయారు . జనం కూడా అమాయకం గా నమ్మేశారు . “ఒక్క ఛాన్స్ ఇచ్చారు. .
ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ 2019 లో తెలుగు రాష్ట్రం పై పడిన వైకాపాసుర పాలన…. 1977 నాటి దివిసీమ ఉప్పెన చేసిన విధ్వంసాన్ని గుర్తు చేసింది.

పురాణ కాలం నాటి అసురగణం నాటి వికటాట్టహాసాలను తలపించే రీతిలో వైకాపాసురులు రాష్ట్రం పై పడిపోయారు . నింగి , నేల , నీరు అనే దానితో పెద్ద పట్టింపు ఏమీ లేకుండా ….. దోచుకోవడానికే తాము ఈ మానవ జన్మ ఎత్తాము అన్నట్టుగా చెలరేగిపోయారు . నడమంత్రపు సిరులతో కళ్లు పూర్తిగా పూడిపోయినట్టుగా విశృంఖలం గా వ్యవహరించారు .

తా చెడ్డ కోతి …వనమెల్లా చెరిచింది అనేది ఓ తెలుగు సామెత . ఒక రాజకీయ పార్టీ ముసుగు కప్పుకున్న పలురకాల సంఘ వ్యతిరేక శక్తులు …. తమకు అవసరమైన అధికార, న్యాయ, కేంద్ర సర్వీస్ వ్యవస్థలను కూడా తమ బాటలోకి తెచ్చుకుని ….. సుభిక్షమైన ప్రజాస్వామిక రాష్ట్రాన్ని ఒక ఆటవిక రాజ్యం గా మార్చివేశారనే ఆరోపణలకు లెక్కే లేదు . హిందూ దేవుళ్లను సైతం చెరబట్టేశారు.పోలీస్ స్టేషన్లలో బలువు ఖాకీయులు యమకింకరుల అవతారం ఎత్తారు . ఫిర్యాదులు చేయడానికి వెళ్లిన బాధితులపైనే కేసులు బనాయించారు . కుయ్… కయ్ అంటే చితక బాదారు. వైకాపాసురులే కొన్ని చోట్ల పోలీసు అధికారుల లాగా వారి కుర్చీల్లో కూర్చుని …. ఎవరిని ఎలా హాండిల్ చేయాలో అధికారులకు డిక్టేట్ చేసిన ఉదాహరణలకూ కొదువ లేదు . కాకినాడ లో అనంత బాబు అనే ఎం ఎల్ సీ చేసిన అరాచకమే …..రాష్ట్రం లో సగటు వైకాపాసురుని బరి తెగింపు వ్యవహార శైలి కి , సగటు పోలీసయ్య ల అమానుష ప్రవర్తనకు తిరుగులేని ఉదాహరణలని పరిశీలకులు చెబుతుంటారు .

రాష్ట్ర వ్యాప్తం గా ….. కొద్దిపాటి హెచ్చు తగ్గులు , తేడాలతో … ఎందరో అనంతబాబులు . ఎందరో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్లు.నియోజక వర్గానికో అనంత బాబు . మండలానికో అనంతబాబు . గ్రామస్థాయిలో ….మినీ అనంత బాబులు .
ప్రభుత్వ ఆస్తులు హాం ఫట్. వరస కుదిరితే ప్రైవేట్ ఆస్తులు హాం ఫట్. ఇసుక హాం ఫట్. ప్రజల మద్యం బలహీనత ను అడ్డం పెట్టుకుని వేలకు వేల కోట్లు హాం ఫట్. భూగర్భ ఖనిజ సంపద హాం ఫట్.

ఇదేంటి స్వామీ అని ఎవరైనా నసిగితే , అర్ధరాత్రుళ్ళు కొంపల మీద పడి …. గోడలు దూకి , తలుపులు పగలకొట్టి …. జనాన్ని ఎత్తుకు పోవడం వంటి పోలీసు అరాచకాలు చూస్తూ …. జనం భయవిహ్వలతలకు లోనయ్యారు . వీరికి తోడు , తెలుగు దేశం …. చంద్రబాబు …. లోకేష్ ….పవన్ కళ్యాణ్ పై అను నిత్యం మాటల కాలుష్యం పలికెలు కొద్దీ ఎత్తి పోయడానికి పేటీఎం భజన గొట్టాలు , కరపత్రాలు , దొంగ “సమీక్షకు”ల ఊదర. ఎంత పేటీఎం పేమెంట్ కు అంత ఊదర అన్నట్టుగా జనం మీదకు (యాంటీ సోషల్ మీడియా )వీడియోలు వదలడం అనేది నిత్యకృత్యమై పోయింది . ఇందుకో ఉదాహరణ చెబితే సరిపోతుంది .

విజయవాడ సింగ్ నగర్ ప్రాంతం లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓపెన్ టాప్ వాహనం లో వెడుతుంటే ….ఎవరో ఆకతాయి గులకరాయి లాటిది విసిరినట్టు పత్రికల్లో వచ్చింది . జగన్ చుట్టూ ఉండే సెక్యూరిటీ ని తప్పించుకుని, అది జగన్ కు తగిలి ; అక్కడితో ఆగకుండా ఆయన పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ అనే ఎ మ్మెల్యే కి కూడా తగిలింది ( బుల్లెట్ తో సహా ఏ వస్తువునైనా ఎవరైనా విసిరితే, అది ఒకరి తరువాత ఒకరిని ఒకేచోట తగలడం మానవ పరిణామ క్రమం లో ఇదే మొదటి సారి ). జగన్ కు ఎక్కడ తగిలిందో …. వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా సరిగ్గా అక్కడే తగిలిందని …. వారిద్దరూ నుదిటికి ఎడమవైపు వేసుకున్న జాన్సన్ బ్యాండేజ్ స్ట్రిప్ ను బట్టి అర్థం చేసుకోవాలి .

దీనిని , హైదరాబాద్ లోని ఒక పేటీఎం విశ్లేషకుడు ఒకరు “ జగన్ పై జరిగిన దాడి పై చంద్రబాబు వైఖరి ఏమిటి ?” అని అంటూ ఒక వీడియో వదిలారు .

జగన్ ఒక్కరే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కాలేదు . అంతకు ముందు మనకు 1953 నుంచి ముఖ్యమంత్రులు గా పలువురు …. తెలుగు రాష్ట్రాన్ని పాలించారు . వారిలో బోలెడంత మంది రెడ్లు కూడా ఉన్నారు.

1953 అక్టోబర్ ఒకటి నుంచి చూస్తే ; ప్రకాశం పంతులు గారితో మొదలు పెట్టి ; బెజవాడ గోపాల రెడ్డి , నీలం సంజీవరెడ్డి ,దామోదరం సంజీవయ్య ,కాసు బ్రహ్మానంద రెడ్డి , పీ వీ నరసింహారావు,జలగం వెంగళ రావు ,మర్రి చెన్నారెడ్డి , టంగుటూరి అంజయ్య( రెడ్డే) ,భవనం వెంకట్రామ రెడ్డి , కోట్ల విజయ భాస్కర రెడ్డి ,నందమూరి తారక రామారావు , నాదెండ్ల భాస్కర రావు , నేదురుమల్లి జనార్ధన రెడ్డి ,ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి , నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి , కొణిజేటి రోశయ్య నారా చంద్రబాబు నాయుడు వంటి కాకలు తీరిన నేతల పాలనా రీతులను జగన్మోహన్ రెడ్డి నడమంత్రపు పాలన కంటే ముందే తెలుగు ప్రజలు చవి చూశారు .

కానీ ,ఇంత దోపిడీ , ఇంత విద్వేషం , ఇంత రాజకీయ కాలుష్యం , ఇంత విచ్చలవిడితనం , ఇంత అధికారం పతనం , ఇంత పోలీసు కర్కశత్వం , ఇంత మహా పతనం తెలుగు ప్రజలు గత డెబ్భై ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని ఎనభై ,తొంభై ఏళ్ల వృద్ధులు కూడా చెబుతుంటారు .

అందుకే , తెలుగు ప్రజలు 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం వేయి కళ్లతో ఎదురు చూశారు . ఆ విషయాన్ని మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు . అందుకే , ఇంటింటికీ ఎంత మంది వాలంటీర్ల ను నిఘా పెట్టినా ….., ఎన్ని రకాల సర్వేలు చేయించినా …. వైకాపాసురులకు ఓటర్ నాడి అందలేదు . ఫలితం గా “వై నాట్ 175 ?” అనే మూడ్ లో మునిగితేలారు .

ఓటరూ అదే అనుకున్నాడు , ఈసారి “కూటమి కి వై నాట్ 175 !?” అని . కానీ , ఓటర్ అంచనాకు ఓ 11 తగ్గాయి .
‘ ఓటు’ అనే వేట కొడవలి తీసుకుని , వైకాపా అనే ఓ అరాచకాన్ని కసితీరా నూట అరవై నాలుగు పోట్లు పొడిచాడు .

దాంతో , ఓ ఐదేళ్ల కాలం పాటు , అప్పటివరకు వారిని ఆవహించిన భయం తొలగిపోయింది . మళ్లీ స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నారు . ‘ పోలీస్ పీడ “ విరగడ అయింది . తమ ఆస్తి పస్తులు ఎవరు అర్థంతరం గా దొంగిలించుకు పోతారో అనే భయం వీడింది . తమ మహిళల మానప్రాణాలకు రక్షణ ఏర్పడిందనే భరోసా కలిగింది . ఆత్మ గౌరవం తో తమ బతుకులు తాము బతికే రోజులు మళ్లీ తిరిగి వచ్చాయనే ఆనంద డోలికల్లో.

జనం తేలియాడుతూ సంబరాలు చేసుకున్నారు. ఏ స్వేచ్చా సమాజం అయినా ఇంతకంటే ఏమి కోరుకుంటుంది ?
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు వల్ల ; తెలుగు ప్రజలు సాధించిన అతి గొప్ప విజయం ఇదే.

ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకునే ప్రతి పథకం , ప్రతి ఆలోచన కూడా తెలుగు వారికి అదనపు బోనస్సే.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో అసలు ఏమీ చేయకపోయినా ….. కాలు మీద కాలు, నోట్లో వేలు వేసుకుని…. పడక్కుర్చీ లో విశ్రాతి తీసుకున్నా ప్రజలకు ఐదు పైసల నష్టం లేదు .

చంద్రబాబు పునరాగమనం తో లభించిన ఆత్మ గౌరవం తో కూడిన జీవనం , మాన మర్యాదలకు భంగం లేని….., ఆస్తిపాస్తులకు బూచోళ్ల నుంచి కబ్జా భయం లేని సమాజం ….. తెలుగువారి జీవనయానం లో లభించిన ఓ గొప్ప ఉపశమనం.

అయితే , ఐదేళ్ల పాటు తమ జీవనాన్ని నరకప్రాయం చేసి , సమాజాన్ని …. సమాజపు ప్రకృతి వనరులను దోచేసిన వారు …. ఉండవలసింది తమ మధ్యనో,ప్రజా క్షేత్రం లోనో కాదని మెజారిటీ తెలుగు ప్రజలు భావిస్తున్నారు . వారికి ‘ తగిన ‘ , అర్హమైన చోట్లకు వారిని పంపించాలని మాత్రమే వారు కోరుకుంటున్నారు .

ఆ దిశగా చంద్రబాబు వెనుకపడ్డారనే భావం మాత్రం తెలుగుదేశం కార్యకర్తలనే గాకుండా , మామూలు ప్రజలను కూడా దహించివేసింది ., కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.తమ ఆగ్రహావేశాలను సోషల్ మీడియా వేదికలపై నిర్మొహమాటంగా …. నిక్కచ్చిగా వ్యక్త పరచడానికి వారేమీ మొహమాట పడలేదు .

చివరాఖరికి, ఎలాగైతేనేం ; ‘ సిట్ ‘ లు , ‘ దర్యాప్తులు ‘ , ‘జైళ్లు ‘, వంటివి మొదలయ్యాయి. వైకాపాసుర యుద్ధం మొదలైంది . తెలుగు తమ్ముళ్ళకి కొంత ఉపశమనం కలగడం మొదలైంది.అది ఇంకా … ఇంకా వేగం పుంజుకోవాలని తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే గాక, సగటు తెలుగువాడు కూడా కోరుకుంటున్నాడు .
సంక్షేమం… అభివృద్ధి పథకాలతో ముందుకు వెడుతున్నామని చంద్రబాబు, లోకేష్ చెబుతున్నారు.

ఆ రెండింటికీ వారు మరొకటి కలపాలి.
అదే – ‘సిట్’ లు. ఒక్కొక్క శాఖ కు ఒక్కొక్క ‘సిట్’ ఏర్పాటు కావాలి.
వచ్చే ఎన్నికల నాటికి – చంద్రబాబు పునరాగమనానికి ముందున్న ఐదేళ్ల ‘ పీడకల’ లాటి కాలం లో అరాచకాలకు , దోపిడీలకు , దౌర్జన్యాలకు , కబ్జాలకు , మహిళల పట్ల అకృత్యాలకు పాల్పడిన దిశ్శాసనులకు ప్రజాక్షేత్రం లో చోటు లేకుండా చంద్రబాబు ప్రభుత్వం చూడాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు .

తెలుగు సమాజానికి ఆయన ఇచ్చే “ రిటర్న్ గిఫ్ట్ “ అదే . అందుకే ఆయనకు 164 సీట్లిచ్చి …. సంబరాలు చేసుకున్నారు .
మరి,తన మీద ప్రజలు పెట్టుకున్న ‘ఈ ఆశలు ఆకాంక్షల’ను ఆయన నెరవేర్చి ; తెలుగు ప్రజల ఋణం తీర్చుకుంటారా!?

– భోగాది వేంకట రాయుడు
(రచయిత సీనియర్ పాత్రికేయులు)

 

LEAVE A RESPONSE