Suryaa.co.in

Andhra Pradesh

యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన

దళితులపైన దాడులు. పోలీసుల అరాచకాలు
– వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజం

తాడేపల్లి: రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దళితులపైన దాడులు కామన్‌గా మారాయని, వారిపై పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే వాటిని కాలరాస్తున్నారన్న ఆయన, తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై థర్డ్‌ డిగ్రీ దారుణం అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన స్పష్టం చేశారు.
నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు.

‘ఈ ఏడాదిలో మేము చాలా తక్కువ మందినే కొట్టాము. తక్కువ మందినే జైల్లో పెట్టాం. అందుకే రెడ్‌ బుక్‌ ఓపెన్‌ చేశామని సిగ్గు లేకుండా మహానాడులో చెప్పుకుంటున్నారు. శిరస్సు మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకుని, చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుముకొని.. మహానాడు పేరుతో ఉత్సవాలు జరుపుకుంటున్నారు’.

రాష్ట్రంలో యథేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. పోలీసులే చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. కూటమి నాయకులు తమకు గిట్టని వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. రాజ్యాగం కల్పించిన మాట్లాడే హక్కు, జీవించే హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తోంది. నోరెత్తితే కొట్టడం, కేసులు పెట్టడం, ప్రాణాలు తీసేయడానికి కూడా వెనుకాడటం లేదు. కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కట్ట కట్టి బంగాళాఖాతంలో విసిరేసే రోజు త్వరలోనే వస్తుంది.

తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై నడిరోడ్డు మీద పోలీసులు ప్రయోగించిన థర్డ్‌ డిగ్రీ తాజాగా వెలుగులోకి వచ్చింది. కొట్టొద్దని వేడుకుంటున్నా పోలీసులు లాఠీలతో యువకుల అరికాళ్లపై చితకబాదారు. ఒక సీఐ ఒక యువకుడి కాళ్లను బూటు కాలితో తొక్కి పెట్టగా, మరో సీఐ ఆ యువకుడి అరికాళ్లపై కొట్టడం.. మరో ఇద్దరిని కూడా అదే విధంగా అరికాళ్లపై లాఠీలతో చితకబాదడం, రాష్ట్రంలో దారుణంగా మారిన పరిస్థితులకు అద్దం పడుతోంది. పైగా ఎస్సీ నా కొడకల్లారా అంటూ పోలీసులు దుర్భాషలాడారు.

స్థానిక సమస్యల గురించి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడన్న కారణంతో రాజమండ్రికి చెందిన పులి సాగర్‌ అనే దళిత యువకుడ్ని పోలీసులు స్టేషన్‌కి పిలిపించి కొట్టి బెదిరించారు. అంతటితో ఆగకుండా విద్యావంతుడైన ఆ యువకుడ్ని అర్థనగ్నంగా లాకప్‌లో నిలబెట్టారు. అక్కడ మహిళా కానిస్టేబుల్‌ ని కాపలాగా ఉంచి మానసికంగా వేధించారు. సాగర్‌ను ఉద్దేశించి బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు చేశారు.

గుంటూరు జిల్లా కంతేరులో కల్పన అనే దళిత ఎంపీటీసీని చీర మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అర్థరాత్రి 20 మంది పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి లాక్కెళ్లారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిందన్న కారణంతో పాలేటి కృష్ణవేణి అనే మహిళను హైదరాబాద్‌లో ఉంటే అరెస్ట్‌ చేసి తీసుకొచ్చారు. ఆమెను కలిసే అవకాశం ఇవ్వకుండా పోలీస్‌ స్టేషన్‌కే తాళాలు వేశారు. ఇదంతా లోకేష్‌ రచించిన రెడ్‌ బుక్‌ రాజ్యాంగ ఫలితమే.

మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న తెనాలిలో దళిత యువకులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి కొడుతుంటే, వారి అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఏకంగా దళితులను అంతం చేస్తున్నారు. 1989 యాక్ట్‌ ప్రకారం దళితులను లక్ష్యంగా చేసుకుని మానసికంగా శారీరకంగా వేధించడం చట్ట ప్రకారం నేరం. ఈ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలుంటాయి.
తెనాలిలో దళిత, మైనారిటీ యువకులను కొట్టిన పోలీసులను తక్షణం సస్పెండ్‌ చేసి వారిపై కేసు నమోదు చేయాలి. లేదంటే వారిపైన వైయస్సార్సీపీ తరఫున ప్రైవేటు కేసు పెడతాం. ప్రజలిచ్చిన అధికారాన్ని పాలన వరకే పరిమితం చేస్తే మంచిది. ప్రతీకార రాజకీయాలకు వాడితే మాత్రం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జూపూడి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE