– టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శ
తిరుపతి: ప్రభుత్వం అనుకూల అధికారులను కాపాడుకునేందుకు, వాస్తవాలు వెలుగు చూడకుండా ఉండేందుకు తిరుపతి తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణను నిర్వీర్యం చేశారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కిందిస్థాయి ఉద్యోగులను బలిపశువులను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అసలు నిజాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..
వైయస్ జగన్ సీఎంగా ఉండగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీలైనంత ఎక్కువమంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో శ్రీరంగపట్టణాన్ని ఆదర్శంగా తీసుకుని పది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను కల్పించాం. 23 మంది మఠాధిపతుల ఆశీర్వాదాలతో దేశంలోని హిందువులంతా గర్వించేలా రెండేళ్లపాటు అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ రెండేళ్లు కూడా వైకుంఠ ఏకాదశికి ముందు రోజు రాత్రే పది రోజులకు టోకెన్లు జారీ చేశాం. దీంతో ఎలాంటి తొక్కిసలాట జరగుండా భక్తులు టోకెన్లు తీసుకుని నిర్విఘ్నంగా స్వామి వారి దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. కానీ కూటమి ప్రభుత్వంలో టోకెన్ల పంపిణీ అడ్డగోలుగా జరిగింది. జనవరి 10,11, 12వ తేదీలకు మాత్రమే టోకెన్లు ఇస్తామని చెప్పారు. అక్కడున్న పరిస్థితిని చూసి మిగతా ఏడు రోజులకు టోకెన్లు ఇస్తామని ప్రోసీడింగ్స్‌లో చెప్పారు. టోకెన్ల పంపిణీలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో 6 మంది భక్తులు చనిపోగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు.