* ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ (TOPS) ద్వారా అద్భుతమైన, సమగ్రమైన క్రీడావాతావరణాన్ని దేశంలో సృష్టించాం
* మణిపూర్ లో రూ.634 కోట్లతో దేశంలోనే తొలి అత్యాధునిక క్రీడా విశ్వవిద్యాలయ నిర్మాణం. దీని ద్వారా ప్రపంచ క్రీడా వ్యవస్థలో భారతదేశాన్ని ఓ పవర్ హౌజ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం
* దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ఖేలో ఇండియా సెంటర్లు, 30 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ద్వారా ఔత్సాహిక క్రీడాకారులకు అసమాన అవకాశాల కల్పన
* మల్లఖంబ్, థాంగ్ టా, గట్కా, కల్పెట్ట వంటి సంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహం. ఖేల్ మహాకుంభ్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికితీసి వారికి ప్రోత్సాహం
ప్రతిష్టాత్మకమైన 2024 ఒలింపిక్స్ క్రీడల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకు నాతోపాటుగా 140 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చారు. ఈ సందర్భం ప్రతిభారతీయుడి మదిని గర్వంతో నిండేలా చేసింది.
ఒలింపిక్స్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం ప్రతి క్రీడాకారుడి స్వప్నం. ఇందుకోసం వారు పడుతున్న కఠోరమైన శ్రమ అనిర్వచనీయం. యువ భారతానికి ప్రతీకగా.. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ నినాదంతో పారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు.. తమ స్వప్నాన్ని సాకారం చేసుకునే తుది అంకానికి చేరుకున్నారు.
2023లో జరిగిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ సాధించిన భారతదేశం.. ప్రపంచ క్రీడావేదికలపై రానున్న రోజుల్లో సత్తా చాటేందుకు తమలో ఉన్న సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అందుకే యావత్ ప్రపంచం ఈసారి భారతదేశ క్రీడాకారుల సత్తాను చూసేందుకు ఉత్సాహంగా ఉంది. భారతదేశ యువతో ప్రతిభకు లోటు లేదు. మరీ ముఖ్యంగా క్రీడాసామర్థ్యానికి కొరతే లేదు.
అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ క్రీడాసామర్థ్యానికి సానబట్టి అంతర్జాతీయ వేదికలపై మన క్రీడాకారులు రాణించేందుకు అవసరమైన సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తోంది. అది ఖేలో ఇండియా కావొచ్చు, అది టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ (TOPS) కావొచ్చు, ఇలాంటి ఇతర పథకాలు కావొచ్చు. సత్తా ఉన్న క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభకు సానబట్టేందుకు.. అసాధారణ రీతిలో ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
ఒలింపిక్ పథకాన్ని సాధించాలన్న లక్ష్యమే ఊపిరిగి బతుకుతున్న క్రీడాకారుల స్వప్నానికి రూపమిచ్చేలా TOPS పథకానికి రూపకల్పన జరిగింది. భారతదేశ మిషన్ ఒలింపిక్స్ సెల్ (MOC) అనే ఓ కమిటీని ఏర్పాటుచేసి.. ఇందులో మాజీ అథ్లెట్లు, కోచ్ లు, వివిధ క్రీడాసంఘాలకు సంబంధించిన సమర్థులైన అధికారులను కేంద్రం నియమించింది. వీటి ద్వారా క్రీడాకారులు పథకాలు సాధించేందుకు ఏమేం కావాలి, వాటిని ఎలా సమకూర్చాలనే దానిపై ప్రత్యేక దృష్టి సారించింది.
బ్యాడ్మింటన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ సాధించిన పీవీ సింధు విషయంలో గమనిస్తే.. సింధు మూడోసారి ఒలింపిక్స్ పథకాన్ని సాధించేలా 12 మంది ప్రత్యేక నిపుణుల బృందం.. ఆమెకు సహకరిస్తోంది. ఇందులో భాగంగా.. జర్మనీ-ఫ్రెంచ్ సరిహద్దుల్లోని ‘సార్ బ్రూకెన్’ అనే చోట సింధుకు బూట్ క్యాంప్ ఏర్పాటుచేసి శిక్షణనిస్తున్నారు.
టేబుల్ టెన్నిస్ చాంపియన్ మానికా బాత్రాకోసం.. బాల్ బౌన్సింగ్, పేస్, స్పిన్ బాగా ఉండే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న టేబుల్ టెన్నిస్ బల్లను సిద్ధం చేశారు. హార్స్ రైడింగ్ లో భాగమైన.. ఈక్వెస్ట్రేన్ పోటీలో పాల్గొనే అనుష్ అగర్వాల్ కోసం.. ఆయన గుర్రానికి అవసరమయ్యే ప్రత్యేక ఫీడ్ ను, బ్లాంకెట్లు, బూట్స్, సాడిల్స్ వంటివి సమకూర్చారు. ఇలా ప్రతి క్రీడాకారుడికి అవసరమైన.. వసతులను సమకూర్చి ఒలింపిక్స్ పథకాలు సాధించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేసింది.
భారత క్రీడారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి అంతర్జాతీయ వేదికలమైన మన క్రీడాకారులు సత్తాచాటేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. రూ.634.34 కోట్లతో.. భారతదేశపు తొలి నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని మణిపూర్ లో ఏర్పాటు చేసింది. స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కోచింగ్, స్పోర్ట్స్ సైకాలజీ వంటి కీలకమైన అంశాలపై ఈ యూనివర్సిటీ ప్రత్యేక దృష్టి సారించింది.
క్రీడలకోసం బడ్జెట్ విషయంలో రాజీలేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని ఫలితాలు క్షేత్రస్థాయిలో కనబడుతున్నాయి. చాలా మంది ఔత్సాహికులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ.. తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఇవాళ దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ఖేలో ఇండియా కేంద్రాలు, 30కి పైగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లు పనిచేస్తున్నాయి. ఔత్సాహిక యువతకు నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం (NEP) కూడా.. దేశ రేపటి భవిష్యత్తు అయిన చిన్నారుల్లో ఇప్పటినుంచే క్రీడాసంస్కృతిని ప్రోత్సహించే దిశగా ఎంతో సానుకూలంగా ముందుకెళ్తోంది.
దీంతోపాటుగా మనదేశపు ప్రాచీన క్రీడలైన మల్లకుంభ్, థాంగ్ టా, గట్కా, కల్పెట్ట వంటి క్రీడలను ప్రమోట్ చేస్తోంది. ‘ఖేల్ మహాకుంబ్’ వంటి వేదికల ద్వారా.. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నిక్షిప్తంగా ఉన్న క్రీడాసామర్థ్యాన్ని వెలికితీసి వారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. ఇవాళ మన దేశ యువ క్రీడాకారులంతా ప్రపంచపు అత్యుత్తమ క్రీడావేదికపై.. మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాగించేందుకు సిద్ధమయ్యారు.
వారందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో యావద్భారతం క్రీడాకారులందరికీ అండగా నిలుస్తోంది. వారి విజయాలను ఉత్సవంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ‘విజయంతో తిరిగిరండి.. రేపటి దేశ భవిష్యత్తులో స్ఫూర్తి నింపండి’ అని ప్రతి భారతీయుడి మనసు కోరుకుంటోంది.
– జి. కిషన్ రెడ్డి
(రచయిత కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి)