2024 ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య రెట్టింపు కావాలి

– పారాలింపియన్ల ప్రదర్శన, దివ్యాంగత్వం విషయంలో ప్రజల అభిప్రాయాన్ని మార్చేసింది
– ఎస్.ఆర్.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి ప్రాంగణాన్ని అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
– ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మరింత పెంచాలని సూచన
– విద్య ద్వారా పొందిన జ్ఞానాన్ని స్వీయ అభివృద్ధి కోసమే గాక సమాజం, దేశాభివృద్ధికోసం వినియోగించాలన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
చెన్నై: టోక్యో ఒలింపిక్స్‌-2020లో భారత అథ్లెట్ల ప్రదర్శనపై భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే పారిస్ ఒలింపిక్స్ (2024) నాటికి ఈ పతకాల సంఖ్య రెట్టింపవ్వాలని ఆయన అభిలషించారు. ఇందుకోసం అవసరమైన ప్రోత్సాహభరితమైన వాతావరణాన్ని నిర్మించడంలో క్రీడా సంస్థలతోపాటు ప్రైవేటురంగం అండగా నిలబడాలని, భారతీయ యువశక్తికి మద్దతుగా నిలవాలని సూచించారు.
ఎస్.ఆర్.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరుచురాపల్లి ప్రాంగణాన్ని గురువారం చెన్నై రాజ్ భవన్ నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు, పారాలింపియన్లు కనబర్చిన ప్రదర్శన యావత్ భారతీయులు గర్వపడేలా ఉందన్నారు. పారాలింపియన్లు అద్భుతమైన ప్రదర్శనతో భారతదేశానికి 19 పతకాలు తీసుకురావడం గర్వించదగిన విషయమన్న ఆయన, దివ్యాంగత్వం వ్యక్తిగత, దేశ వికాసానికి అవరోధం కాదనే విషయాన్ని పారాలింపియన్లు మరోసారి నిరూపించారన్నారు.
టోక్యో ఒలింపిక్స్ లో ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని, భారతీయ యువతకు సరైన ప్రోత్సాహాన్ని, క్రీడా మౌలికవసతులను కల్పిస్తే, మనం ప్రపంచ క్రీడా శక్తిగా నిలవడం కష్టం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మరెంతో మంది అవనీ లేఖర్లు, నీరజ్ చోప్రాలు తమ రెక్కలతో పైకి ఎదిగేందుకు సిద్ధంగా ఉన్నారన్న ఆయన, అలాంటి నైపుణ్యాన్ని ఆదిలోనే గుర్తించి దానికి సానబెట్టేందుకు అవసరమైన ప్రోత్సాహభరితమైన వాతావరణాన్ని నిర్మించాని, ఇందులో విద్యాసంస్థల పాత్ర కూడా కీలకమని పేర్కొన్నారు.
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్న భారతీయ యువతకు విద్యాభ్యాసం తర్వాత సరైన ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రోత్సహించేందుకు అవసరమైన నైపుణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. ఇందుకోసం విద్యాలయాలు-పరిశ్రమల మధ్య పరస్పర సమన్వయం అవసరముందని పేర్కొన్నారు. విద్యార్థులు సైతం విద్య ద్వారా తాము సముపార్జించుకున్న జ్ఞానాన్ని, తమ వ్యక్తిగత బాగుతోపాటు సమాజాభివృద్ధి, దేశాభివృద్ధికి సద్వినియోగం అయ్యేలా శ్రద్ధ పెట్టాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
తక్షశిల, నలంద, పుష్పగిరి వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలతో ప్రపంచానికి విద్యాజ్ఞానం అందించిన చరిత్ర భారతదేశానికి ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ, మరోసారి భారతదేశం ‘విశ్వగురు’ పీఠాన్ని అధిరోహించేందుకు, భారతదేశాన్ని విద్యాసాధికారక దేశంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
పర్యావరణ మార్పుల ద్వారా మనం అనుభవిస్తున్న ప్రతికూల మార్పులను తొలగించే విషయంపై సాంకేతిక పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, మానవాళి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతోపాటు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచడమే సాంకేతికత ప్రధాన లక్ష్యం కావాలన్నారు.
కరోనా సమయంలోనూ ప్రభుత్వం చేసిన క్లినికల్ ట్రయల్స్ లో అనుసంధానమైన పనిచేయడంతోపాటుగా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య వసతుల కల్పనకోసం కృషిచేసిన ఎస్.ఆర్.ఎం. గ్రూపును ఉపరాష్ట్రపతి అభినందించారు. ఆత్మనిర్భర భారత లక్ష్యాలను చేరుకునేందుకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ టీఆర్ పారివేందర్ ను ఉపరాష్ట్రపతి అభినందించారు.
నోబుల్ అవార్డు గ్రహీత డాక్టర్ సీవీ రామన్, మాజీ రాష్ట్రపతి-భారత మిసైల్ మేన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఆర్ వెంకట్రామన్ వంటి ఎందరో మహాను భావులు తిరుచిరాపల్లిలోనే విద్యాభ్యాసం చేసారన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేస్తూ, ఎస్ఆర్ఎం విద్యాసంస్థలు ఆ ఘనతను కొనసాగించే దిశగా కృషిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టాలని ఎస్.ఆర్.ఎం. గ్రూపునకు ఉపరాష్ట్రపతి సూచించారు.
విద్యారంగంలో గ్రామీణ,పట్టణ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరంపైనా విద్యాసంస్థలు, ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని ఉపరాష్ట్రపతి సూచించారు. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే స్వతంత్ర ఆలోచనలకు బీజం వేయాలని, వాటిని ప్రోత్సహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, ఎస్.ఆర్.ఎం. వ్యవస్థాపక కులపతి, పార్లమెంటు సభ్యుడు టీఆర్ పారివెందర్, ఎస్.ఆర్.ఎం. సంస్థ అధ్యక్షుడు వ్రీ నిరంజన్ తొపాటుగా రామాపురం, తిరుచిరాపల్లి ఎస్.ఆర్.ఎం. సంస్థల ప్రాంగణ అధ్యాపకుడు, విద్యార్థులు, వివిధ రంగాల ప్రతినిధులు అంతర్జాల వేదిక ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply