టెస్ట్ మ్యాచ్, వన్ డే మ్యాచ్, ట్వంటీ – ట్వంటీ మ్యాచ్ అంటూ క్రికెట్ లో రకరకాల ఫార్మాట్ లు ఉన్నట్టు గానే, రాజకీయాల్లో కూడా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఫార్మాట్ తో ప్రజల ముందుకు వస్తుంటుంది. దానినే, ముద్దుగా ‘ విధి -విధానాలు ‘ అంటుంటాం. 21 వ శతాబ్దం లో మన రాజకీయ పార్టీలకు అటువంటివి ఏమీ లేవు అనేది వేరే విషయం.
కాంగ్రెస్ పార్టీ లో అయితే, సోనియా… రాహుల్… ప్రియాంక…. నిత్య నామస్మరణ తప్పని సరి. రోజుకోసారి అయినా ఆ పేర్లు స్మరించుకోకుండా కాంగ్రెస్ వాదులు రాజకీయాలలో మనలేరు.ఆ పార్టీ ఫార్మాట్ అది. బీజేపీ లో ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా కీర్తనలే ప్రధానం.తెలుగుదేశం పార్టీ ‘ సమాజమే దేవాలయం , ప్రజలే దేవుళ్ళు’ అనే పునాది టాగ్ లైన్ తో మొదలైం ది.ఇప్పుడు ఎన్ టీ రామారావు స్మరణ తో కార్యకర్తలకు పెద్ద పీట అంటూ ‘ అభివృద్ధి మంత్రం ‘ తో చంద్రబాబు, లోకేష్ నేతృత్వం లో రాజకీయం నడుస్తున్నది . ఇలా, ఎవరి ఫార్మాట్ వారిది.
ఇక, జగనే కర్త, కర్మ, క్రియ గా సాగుతున్నది. దానికి సిద్ధాంత, రాద్దాంతాలతో పని లేదు.30 ఏళ్లకు తక్కువ లేకుండా అధికారం లో ఉండడమే ఈ పార్టీ రాజకీయ సిద్ధాంతం.
“తిట్టు…. కొట్టు… కనబడింది కనపడినట్టు బొక్కు ……. తిను …. నొక్కగలిగినంత నొక్కు … అది ఘనమైనా.. ద్రవమైనా…. వాయువైనా… పంచభూతాల ఏదైనా వదలొద్దు…అడ్డం వస్తే లేపేయ్ ….కుమ్మేయ్…కుదరకపోతే …. లోపలేయించేయ్… ఈ బురద మొత్తం చంద్రబాబు నెత్తిన కుమ్మరించేయ్…., లోకేష్ ను అపహాస్యం చేసేయ్… రెడ్ బుక్ – రెడ్ బుక్ అంటూ పెడబొబ్బలు పెట్టు ‘అనేది ఆ వైసీపీ రాజకీయ ఫార్మలానా అనే అనుమానం కలగడం సహజం, వారి రాజకీయ పోకళ్ళు చూస్తే.వైసీపీ నిర్వాకం చూస్తున్న జనానికి….,ఇంతకు మించిన ప్రపంచం దానికి ఉన్న భావన కలగడం లేదు.
కాకినాడ లో అనంత బాబు ను, ఆయన రాజకీయ గురువు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ని , గుడివాడ, ఏలూరు, బందరు లో ముగ్గురు నానీ లను , సత్తెనపల్లి లో అంబటి రాంబాబును, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి , నెల్లూరులో కాకాణి గోవర్ధన రెడ్డి ని …, తిరుపతి వెళ్లి చెవిరెడ్డి భాస్కర రెడ్డి ని, ; వీళ్లందరికీ రాజ గురువుతో సమానుడు, అత్యంత సౌమ్యంగా…. వినయంగా మాట్లాడే విజయసాయి రెడ్డి వంటి ‘ ప్రజాస్వామిక వాదుల ‘ ను చూసినా; ఇటువంటి వారు నియోజకవర్గానికి ఓ డజనుకు తక్కువ లేకుండా విరగబడి “ప్రజా సేవ ” చేసిన….చేస్తున్న వారి పనులను చూసినా ….. రాజకీయాల పై గానీ, రాజకీయ నాయకుల పై గానీ గౌరవభావం కలగడం కష్టం.
వీరందరూ ఉన్న వైసీపీ ‘ ‘పొలిటికల్ ఫార్మాట్ ‘ ఇలా ఉంటుందని 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లకు తెలియదు. కలలో కూడా ఊహించలేదు.
రాష్ట్రం లో ఆసంఖ్యాక జనానికి అత్యంత ప్రీతి పాత్రుడైన వై ఎస్ రాజశేఖర రెడ్డి అకాల మృత్యువు పాలు కావడం( దీనినే ‘మిడ్ కోర్స్ కరెక్షన్ బై నేచర్’ అని అంటారు)తో పాటు, సాక్షాత్తు ఆయన ఏకైక కుమారుడే ఈ వైసీపీ పార్టీ కి అధినేత కావడంతో ; వారి పట్ల ప్రజల సద్భావనల తో కూడిన అంచనాలు…. శ్రీహరికోట ఇస్రో కేంద్రం లో రాకెట్లు అంతరిక్షం లోకి దూసుకుపోయినట్టు వైసీపీ పట్ల దూసుకు పోయాయి.
రాజన్న తనయుడు తెలుగు ప్రజలకు ‘సకల సద్గుణాభి రాముడు’ లా కనిపించాడు.
అసలు 2014 లోనే ఎందుకు ఆయనను గెలిపించుకోలేక పోయామా అని నాలిక్కరుచుకున్న వారికి సైతం లోటులేదు.
అందుకే; 2014 లో గెలిచిన చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు ఏమి చేసినా…. ఏమి మాట్లాడినా… తెలుగు ప్రజలకు ఘోరాపరాధం గా కనిపించాయి.
సింగపూర్ లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేదేమో ఆ అభివృద్ధి కాముకుడు….చంద్రన్న ఆకాంక్ష. (అయితే,2019 ఎన్నికలకు ముందు ” సింగపూర్ ” అని చంద్రబాబు ప్రస్తావించినప్పుడల్లా నియోజక వర్గానికో వెయ్యి ఓట్లు వంతున పోయాయి..)
2019 ఎన్నికలకు ముందు ‘ వైసీపీ ఫార్మాట్ ‘ ఎలా ఉంటుందనేది జనానికి తెలియక పోవడం కూడా బాబు పై వ్యతిరేకత పెరగడానికి ఒక కారణం.. అప్పుడే ఫ్రిజ్ లోంచి బయటకు తీసిన ఐస్ క్రీమ్ లాగా ఫ్రెష్ గా నిగ నిగలాడుతూ జగన్ కనపడ్డారు . ‘జగనన్న వస్తే మనకు ఇంకా పెడతాడు అంటూ జనం ఊగిపోయారు.
పచ్చని పైర్ల మీద వాలడానికి గుంపులు… గుంపులుగా వచ్చే మిడతల దండు లాగా రాష్ట్రం మీదికి వస్తున్న వైసీపీ ని చంద్రబాబు తేలిగ్గా తీసుకోవడం కూడా ఒక కారణం .( ఇప్పుడు కూడా చంద్రబాబు ఈ మిడతల దండు ను తేలిగ్గానే తీసుకుంటున్నారన్న భావం చాలా మంది లో ఉంది. ఆ భావం మదిలోకి వచ్చినప్పుడల్లా… భయం తో వణికి పోతున్నారు. రాష్ట్రం లో మద్యం అమ్మకాలు భారీగా పెరగడానికి కూడా ఈ ‘భయం ‘ ఒక కారణం.)
దానితో, 2019 ఎన్నికల తరువాత…. ఆంధ్రప్రదేశ్ అధికార పీఠం పై ” వైసీపీ ఫార్మాట్ ” పరివేష్టితమై; తన రంగు,రుచి, వాసన ను తెలుగు ప్రజలకు రుచి చూపించడం మొదలు పెట్టింది.
పొలం గట్టుల కలుగుల్లో అచేతనంగా… తిండీ తిప్పలు లేక, రోజులు తరబడి ఎండి పోయి ఉన్న బావురు కప్పలు…. ఒక భారీ వర్షానికి బెక బెక మంటూ వందలు, వేలుగా బయటకు వచ్చి జనాలను హడలెత్తించినట్టుగా…. మొత్తం అరాచక, సంఘ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటిగా రాష్ట్రం మీద, జనం మీద, ప్రకృతి వనరుల మీదా పడిపోయాయా అన్న భావం ప్రజలకు కలిగేటట్టు గా వైసీపీ లో అధికులు వ్యవహరించారు .
ఏ రాజకీయ పార్టీలో అయినా ; ఎక్కడో…. ఎవరో కొద్ది మంది … చట్టాన్ని ఉల్లంఘించి…. ఏదో కక్కుర్తి పడడం వేరు. కానీ, గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయివరకు…. వైసీపీ చక్రాంకితులైన వారిలో స్థానిక సంస్థల ప్రతినిధులా… శాసన సభ్యులా… మంత్రులా… ఎం పీ లా అనే తేడా లేకుండా అధికులు సాగించిన ఎక్కడ ఏది దొరికితే దానిని దోపిడీ చేసే తీరు చూసి…చూసి,తెలుగు ప్రజలు భీతావహులైపోయారు.
గత డెబ్భయ్ ఏళ్ళల్లో ఈ తరహా (‘ఫార్మాట్’)రాజకీయాలను తెలుగు సమాజం కనీ, వినీ ఎరుగదు.
వైసీపీ లో అధికులు… గుంటూరు లో రౌడీ షీటర్ గా ముద్రపడిన బోరుగడ్డ అనిల్ కు ఒక బెత్తేడు అటూ ఇటూ గా జనానికి తమ విశ్వరూపం చూపించారు.
దానితో, భీతావహులైన జనం… పోలింగ్ తేదీ వరకు ఓపికగా…. జింకను వేటాడే పులి ఓపికగా వేచి ఉన్నట్టుగా ఓపిక పట్టి… ఈవీఎం లో బటన్ నొక్కవలసిన సమయం వచ్చినప్పుడు… బ్రహ్మకు సైతం ఉప్పు అందకుండా నొక్కేసి… నిశ్శబ్దం గా ఇళ్లకు వెళ్లిపోయారు. ఓట్ కు ముందు గానీ, ఓట్ వేసే పోలింగ్ రోజు గానీ, పోలింగ్ తరువాత గానీ….వైసీపీ కి ఓటర్ మైండ్ చిక్కలేదు. దీనిని బట్టి చెప్పవచ్చు…. వైసీపీ ఫార్మాట్ ను చూసి ఓటర్లు ఎంతగా భయపడ్డారో…!
నిజానికి, ఎన్నికలు ఐదేళ్లకు ఒక సారేగా మన దేశం లో జరిగేది!?. వైసీపీకి ఒకసారి అధికారం అప్పగించాక, ప్రజలు ఐదేళ్లు ఓపిక పట్టాల్సి వచ్చింది కదా, చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి…!?
కానీ, వైసీపీ నేతలు – పై నుంచి కింది వరకు – చంద్రబాబు ప్రభుత్వం ఘోరాలు చేసేస్తున్నాడంటూ ఇప్పుడు పెడబొబ్బలు…. శాప నార్ధాలు… తిట్లు…. చూసేవారికి వారిపట్ల చీత్కార భావం కలుగుతోందని కొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
2019 లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 2024 లో 11 సీట్లే ఎందుకు ఇచ్చారో వైసీపీయులు ఆత్మావలోకనం చేసుకున్నట్టు కనపడదు.
ఇక, నిరంతరాయం గా కొనసాగుతున్న “మైండ్ సెట్ ” తో మరో సారి వైసీపీ అధికారం లోకి రావడం అంటే… ప్రపంచం లో ఎనిమిదివ వింత చోటు చేసుకున్నదని అనుకోవచ్చు.. రాజకీయ, సామాజిక ప్రత్యర్థులనుకునే వారిపై ఆ దౌర్జన్యాలను, ఆ దోపిడీలను, ఆ అరాచకాలను సమాజం ఇక భరించలేదు అనేదే పలువురి అభిప్రాయం.
ఆ విషయమే మొన్న జరిగిన పులివెందుల, ఒoటిమిట్ట(ఇక్కడ శ్రీ రామచంద్రుల వారు కూడా ఉన్నారు. కాకపోతే, ఆయనకు ఓటు లేదు.)జడ్పీటీసీ పదవులకు జరిగిన ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి..
వైసీపీ హయాం లో స్థానిక సంస్థలకు “ఎన్నికలు ” నిర్వహించినట్టుగా పులివెందుల, ఒంటిమిట్ట లో నిర్వహించుకోవడం కుదరలేదనే ఉక్రోషమే వైసీపీ నేతల మాటల్లో… చేతల్లో…. వ్యక్తమైంది. హుందాతనం పూర్తి గా లోపించింది.వారి ప్రచార సాధనాల్లో…వారి ఆస్థాన విశ్లేషకాచార్యుల వ్యాఖ్యల్లో కూడా వైసీపీ మైండ్ సెట్టే ప్రతిఫలించింది..
నిజానికి, ఏ ఎన్నిక(ల ) ఫలితం వెలువడిన సందర్భం లో అయినా ; ” ప్రజా తీర్పును స్వీకరిస్తున్నాం. మా ఓటమికి కారణాలు విశ్లేషించుకుని, తిరిగి బలం పుంజుకుంటాం. గెలిచిన వారికి అభినందనలు…. ” వంటి మాటలను, ఓడిపోయిన వారివైపు నుంచి వినడమే అనాదిగా వస్తున్నది.
కానీ, పులివెందుల – ఒంటిమిట్ట ఉప ఎన్నిక ఫలితం పై వైసీపీ కి చెందిన వారు “వైసీపీ ఫార్మాట్ ” ను గుర్తుకు తెచ్చేవిధం గానే మాట్టాడారు.
దక్షిణ కొరియాపై , తన సరిహద్దు లౌడ్ స్పీకర్ల ద్వారా ఉత్తర కొరియా సాగించే దుష్ప్రచారం స్థాయిలో…. కూటమి నేతలు, పోలీసులపై వైసీపీ గొంతులు దుమ్మెత్తి పోశాయి.
పోలీసుల మీద చేయడానికి వీలున్న అన్ని రకాల ఆరోపణలు చేశారు, – ఏ రెండు, మూడు కోట్లో అధికార పార్టీ నేతల నుంచి పోలీసులు తినేసి…. తమకు డిపాజిట్ రాకుండా చేశారు అని ఆరోపించడం తప్ప.
కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఈ జడ్పీటీసీ పోలింగ్ సరళి ని స్వయంగా పర్యవేక్షించారు. దానితో,తమ హయాంలో “స్థానిక ఎన్నికలు ” జరిపించేసినట్టు ఇక్కడ కుదరలేదన్న అక్రోశం వారిలో అడుగడుగునా కనిపించింది.
ప్రజా జీవితం లో కొనసాగాలని వైసీపీ భావిస్తున్నట్టయితే; ఈ రకమైన ” మైండ్ సెట్ ” నూరు శాతం మారాలి. ఇప్పుడు అడుగడుగునా దానిని చుక్కానిలా ” నడిపిస్తున్న “నెగటివ్ ” మైండ్ సెట్ ను వదిలెయ్యాలి.
ఇప్పుడు ఆ వైసీపీ ముద్రాంకితులు ఎందుకు జైళ్ళల్లో ఉన్నారో… ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకోవాలి. గెడ్డం గ్యాంగ్ లను వదిలించుకోవాలి.
“వైసీపీ నాయకులు ” అంటే…. అరాచక వాదులు, దౌర్జన్య కారులు, కబ్జా కోరులు, దోపిడీ దారులు, హంతకులు, విధ్వంస కారులు, సంఘ వ్యతిరేక శక్తులు అంటూ సమాజం లో ఏర్పడిన బలమైన ముద్రను సంపూర్ణం గా తొలగించుకోవడానికి ఏమి చేయాలో…. వైసీపీ అధినేత(లు)అది చేయాలి.
ఆ పని చేయకుండా, తమ సర్వ అవలక్షణాలాన్నింటినీ కూటమికి (అంటే చంద్రబాబు, లోకేష్ కు )ఆపాదిస్తూ దుమ్మెత్తి పోయడం, లేకి ప్రసార సాధనాలతో ప్రచారం చేయించడం, పేటీఎం విశ్లేషకాచార్యులతో మాట్లాడించడం వంటి చర్యలు…. చెక్క గుర్రం పై కూర్చుని ఊగడం వంటివే. ఎంత సేపు ఊగినా అది అంగుళం కూడా ముందుకు కదలదు. ప్రజాభిమానాన్ని తిరిగి పొందలేరు.
కూటమి ప్రభుత్వం పై జనం లో అసంతృప్తి ఎన్నికల నాటికి వ్యక్తమయ్యే పరిస్థితులు వస్తాయని వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్నప్పటికీ ; ఇప్పటి మైండ్ సెట్, ఇప్పటి ఫార్మాట్ తో… ఆ పార్టీ వైపు ప్రజలు కన్నెత్తి చూడరు. ప్రజాస్వామ్య ముసుగు లో సాగించే ” క్లెప్టోక్రసీ ” మైండ్ సెట్ తో వారు ప్రజాభిమానాన్ని చూరగొనలేరు. అధికారం లోకి రావడానికి 40% ఓటింగ్ బలం సరిపోదు. చివరకు ప్రతిపక్ష హోదా కూడా రాదు.
రాక్షసుల్లో కూడా మంచి వారు ఉంటారు అని చెప్పడం కోసం విభీషణ పాత్ర ను వాల్మీకి మహర్షి సృష్టించారు. ‘ నువ్వు బతుకు… నన్ను బతక నివ్వు ” వంటి మనస్తత్వం కలిగిన సౌమ్యులు వైసీపీ లో లేకపోలేదు. రావణాసురుని కొలువు లోనే విభీషణుడు ఉన్నట్టుగా ; జగన్ కుటుంబం లోనే హత్యా నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి తో పాటు….’ పద్ధతులు మార్చుకోవాలి జగన్ ‘ అని చెప్పే విభీషణులు కూడా ఉన్నారు. వారి సలహాలు ఎంత మనోహరం గా ఉన్నప్పటికీ, వినేవారే వైసీపీ లో కనపడడం లేదు.
ఈ లోపు…. బలమైన కేసులు ఒక్కొక్క అడుగే ముందుకు జరుగుతూ జగన్ పరివారాన్ని మెల్లగా చుట్టుముడుతున్నాయి. వివేకా బ్రూటల్ మర్డర్ ఘటనలో నిందితులకు ఉరిశిక్ష విధించే అవకాశం ఉన్నదని… సాక్షాత్తు సీబీఐ న్యాయవాది సుప్రీం కోర్టు లోనే అన్నారు అంటే…. తాను, తన పరివారం ఏ స్థాయి నేరారోపణాల్లో ఇరుక్కుపోయి ఉన్నారో జగన్ గమనించాలి. లిక్కర్ కుంభకోణం లో… అంతిమ లబ్ది దారుడిగా అన్ని వేళ్ళు తన వైపు చూస్తున్న వైనం ప్రజల్లోకి బలం గా వెళ్లిన విషయం కూడా జగన్, ఇతర వైసీపీయులు గమనించుకోవాలి. ఈ తరహా ‘ఫార్మాట్’ లో రాజకీయాలను ప్రజలు మళ్ళీ అక్కున చేర్చుకోరు. డబ్బు, మందు, మందస్వామ్యం ను నమ్ముకోవడం వల్ల ఓట్లు రాలవు.
‘ప్రభుత్వం’ పేరిట చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేసే అవకతవకలు తమను… 2019 లో లాగా అధికారం లోకి తీసుకు వస్తాయి అని పగటి కలలు కంటూ ఉంటే ; ఈ పగటి కలల అర్ధం ఏమిటని ప్రవచన కారుడు చాగంటి కోటేశ్వర రావు ను అడిగితే ; ఆయన బాగా విడమరచి చెబుతారు.
– భోగాది వేంకట రాయుడు
(జర్నలిజం లో ‘కళారత్న’ అవార్డు గ్రహీత)