– గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ
– తమపై ఉన్న నమ్మకం వల్లే… ఈ కార్యక్రమానికి విశేష స్పందన అంటూ ఉద్ఘాటన
హైదరాబాద్: ప్రజా ప్రభుత్వంలోనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. సామాన్య ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరై మంత్రి సురేఖకి పలు సమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు అందజేశారు.
దాదాపు 110 సమస్యలు మంత్రి దృష్టికి వచ్చాయి. వాటిని ఆమె అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఆమె మీడియా మాట్లాడుతూ… తమపై, తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం వల్లే… ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని మంత్రి సురేఖ ఉద్ఘాటించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఫించన్లు, రాజీవ్ యువ వికాసం, రెవెన్యూ, తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తులు వచ్చినట్టు చెప్పారు.
దరఖాస్తులకు స్వీకరించినప్పుడు మంత్రి సురేఖ ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, హైదరాబాద్ అధికారులతో పాటు ఇతర పోలీసు అధికారులకు వెంటనే ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 110 దరఖాస్తులను మంత్రి ప్రజల నుంచి స్వీకరించగా, అందులో దాదాపు అన్ని సమస్యలు మంత్రి పరిష్కరించారు. ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే ఉన్నదని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం… ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ అందరి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోతున్నారని… తాము గత పాలకుల్లా నిరంకుశంతో ఉండబోమని చెప్పారు.
తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవరిస్తుందని, మహత్మా జ్యోతిబాపూలే భవన్ తో పాటు జిల్లాల్లో ప్రజా వాణి ద్వారా ప్రజల వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిట్టు చెప్పారు.