ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వినాశకరం

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
దేశ ఆర్థిక ప్రగతికి అద్భుతమైన సాధనాలుగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వినాశకరం అని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగుల దేశ వ్యాప్త రెండు రోజుల సమ్మెలో భాగంగా గురువారం హైదరాబాద్, కోఠి సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా ఆవరణలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో వేలాదిమంది బ్యాంకు ఉద్యోగులతో భారీ ధర్నా జరిగింది.
ఈ సందర్బంగా ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేసారు. ఈ ధర్నాకు ముఖ్యతిథిగా హాజరైన బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కేవలం కొంతమంది కార్పొరేట్ల కోసమే సమర్థవంతమైన ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణంకట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు డిపాజిటర్లకు భద్రత కల్పించడమే కాకుండా సరసమైన ధరకు సేవలను అందిస్తున్నాయన్నారు.
1969లో ప్రైవేట్ బ్యాంకుల జాతీయీకరణ ఫలితంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో రైతులకు మరియు సామాన్యులకు ఆర్థిక ప్రయోజనాలు అందాయని, పెద్ద సంఖ్యలో విద్యావంతులైన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించపడ్డాయని, వ్యవసాయంలో విప్లవం తీసుకురావడానికి జాతీయ బ్యాంకులను ఉపయోగించారని, బడుగు బలహీన వర్గాలు, చిన్న పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాలు అందుబాటులోకి వచ్చాయని అయన గుర్తు చేసారు. ఇప్పటికే దేశంలోని అనేక ప్రైవేట్ బ్యాంకులు కుప్పకూలిపోయాయని, ప్రైవేట్ బ్యాంకుల యాజమాన్యాలు కోట్లరూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని అయన తెలిపారు.
జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణను టీఅర్ఎస్ పార్టీ ఫుర్తిగా వ్యతిరేకిస్తుందని బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడితే టీఅర్ఎస్ పార్లమెంట్ సభ్యులు అడ్డుకుంటారని, బ్యాంకుల ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న బ్యాంకు ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వం తక్షణమే బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని వినోద్ కుమార్ డిమాండ్ చేసారు.
మాజీ ఎమ్యెల్సీ ప్రో. నాగేశ్వర్ మాట్లాడుతూ భారీ మొండి బకాయిల ఆర్థిక నేరగాళ్లకు శిక్షలు వేయకుండా వారికే ప్రభుత్వ బ్యాంకులను అప్పగించడం ఏమిటని అయన ప్రశ్నించారు. ప్రైవేట్ బ్యాంకులలో ప్రజలు తమ డిపాజిట్ సొమ్మును ముమ్మాటికీ కోల్పోతారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మెరుగైన మద్దతునిచ్చే సమర్థవంతమైన ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థ ను ప్రైవేటీకరించడం సిగ్గుచేటని అయన విమర్శించారు. ప్రైవేట్ బ్యాంకులు కేవలం బడా కార్పొరేట్లకు తమ సేవలందిస్తాయని, ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే సామాన్యులు, పేదలు, వ్యవసాయం, చిన్న తరహా రంగాలు మొదలైన వారికి రుణాలు ఇచ్చి సేవలందిస్తాయని నాగేశ్వర్ వెల్లడించారు.
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్, ఏఐబిఈఏ జాతీయ కార్యదర్శి బి.ఎస్. రాంబాబు మాట్లాడుతూ జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన ఆలోచన అని ఆరోపించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను బ్యాంకు ఉద్యోగ సంఘాలు గట్టిగా వ్యతిరేకిస్తు రెండురోజుల దేశవ్యాప్త సమ్మెను చేప్పట్టమని అయన తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న ఏకైక సమస్య మొండి బకాయిలు అని, చాలా వరకు మొండి బకాయిలు కార్పొరేట్లు మరియు ధనిక పారిశ్రామికవేత్తలవె అని అన్నారు. వారిపై చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరించి వారికి అప్పగించాలని చూస్తుందని అయన ఆరోపించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని అయన డిమాండ్ చేసారు. ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణ కోసం రైతుల ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని అవసరమైతే సుదీర్ఘ పోరాటాలు నిర్వహిస్తామని రాంబాబు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ ధర్నాలు ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్, టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్ కుమార్ తదితరులు ప్రసంగించారు. ఈ ధర్నాలో ఎఐబిఒఎ కార్యదర్శి హర్ నాథ్‌, ఐ.ఎన్.బి.ఒ.సి నాయకులు మోహన్, ఎఐబిఇఎ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పి.వి.కృష్ణారావు, ఎఐబిఇఎ నాయకులూ జానకిరామ్, ఎఐబిఒఎ తెలంగాణ, ఎపి కార్యదర్శి ఫణికుమార్, కోటక్ మహీంద్రా బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, సిబిఇయు తెలంగాణ & ఏపీ ప్రధాన కార్యదర్శి ఉదయ్, యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా అవార్డు ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి సమద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply