Suryaa.co.in

Andhra Pradesh

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆంధ్రప్రదేశ్‌ స్త్రీలకు మొక్కుబడి రోజు కాదు

– గత నాలుగు సంవత్సరాల్లో తెలుగు ఆడబడుచులు సాధించిన ప్రగతి చరిత్రాత్మకం
– ఎంపి విజయసాయిరెడ్డి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఇదివరకు ఏదో మొక్కుబడిగా జరిపే కార్యక్రమం. కాని, ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు మాత్రం గత కొన్నేళ్లుగా తాము సాధించిన ప్రగతిని గుర్తుచేసుకునే గొప్ప సందర్భం మార్చి 8వ తేదీ. తెలుగు మహిళలు ప్రపంచ స్త్రీలు, భారత సోదరీమణులతో పాటు వేగంగా ప్రగతిపథంలో ముందుకు పరిగెడుతున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయంతో 1977 నుంచీ ప్రపంచ మహిళాలోకం, వారికి తోడుగా నిలిచే పురుషులు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆనందోత్సాహాలతో జరుపుకోవడం మొదలైంది.

వేలాది ఏళ్ల నుంచీ స్త్రీలకు సమాన గౌరవం ఇవ్వాలనే భావనలు ఉన్న భారతదేశంలో కూడా ఆడబడుచుల అభివృద్ధికి, సాధికారతకు ఉన్న ప్రాధాన్యం గురించి గుర్తుచేసుకోవడం ఈ రోజు నుంచి ఆరంభమైంది. 2019 మే 30న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏపీలో మహిళల అక్షరాస్యత జాతీయ సగటు అక్షరాస్యతతో పోల్చితే తక్కువ. 2017–18లో జాతీయ సగటు 70.3% ఉండగా ఏపీలో ఇది అప్పుడు 59.9 శాతం ఉంది.

వైఎస్సార్సీపీ సర్కారు మొదటి నుంచీ మహిళా సంక్షేమానికి తీసుకున్న అనేక చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో స్త్రీల అక్షరాస్యత 2021–22 నాటికి అనూహ్యరీతిలో 67.35 శాతానికి పెరిగింది. ఇంతటి మహిళా ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనేకం దోహదం చేశాయి. వాటిలో ప్రధానమైనది అమ్మ ఒడి. తల్లులు తమ పిల్లలను బడులకు పంపడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ప్రోత్సహించింది. పిల్లల చదువు ఖర్చుల కోసం ఏటా తల్లి బ్యాంకు ఖాతాలోకి రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అమ్మ ఒడి కింద జమచేస్తోంది. ఫలితంగా స్కూళ్లలో చేరే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా పుస్తకాల బ్యాగుతో బడులకు పరిగెత్తే బాలికల సంఖ్య ఎక్కువైంది. ఉన్నత పాఠశాలల స్థాయిలో బడుల్లో చేరే ఆడపిల్లల సంఖ్య (జీఈఆర్‌) చాలా వేగంగా పెరగడానికి అమ్మ ఒడి తోడ్పడింది. 2016–17లో ఈ జీఈఆర్‌ సగటు రేటు జాతీయస్థాయిలో 80.97 % ఉండగా ఏపీలో ఇది 76.8 శాతం మాత్రమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాల కారణంగా 2019–20లో బాలికల బడుల ప్రవేశాల రేటు ఏపీలో 81.2%కు పెరిగింది. జాతీయ సగటు రేటు మాత్రం అప్పుడు 77.8 శాతం వద్ద ఆగిపోయింది.

ఆడపడుచుల అభ్యున్నతికి అనేక పథకాలు
ఒక్క అమ్మ ఒడితోనే ఆగకుండా వైఎస్సార్సీపీ సర్కారు మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తోంది. మహిళల సాధికారత కోసం వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ కాపునేస్తం, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం వంటి అనేక పథకాలు ఆంధ్రప్రదేశ్‌ లో అమలు చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు అనేక పథకాల కింద నేరుగా స్త్రీల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడంతో సాధికారతతో పాటు వారి కొనుగోలు శక్తి ఏటా పెరుగుతోంది. గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెట్టాక ప్రభుత్వం మహిళల వాకిళ్లకు వచ్చేసింది.

వాలంటీర్లు అవసరమైనప్పుడల్లా మహిళలకు ఫోన్ల ద్వారా కీలక సమాచారం అందిస్తున్నారు. రేషన్‌ సరుకులు ఇళ్లకే తెచ్చి ఇస్తున్నారు. తెలుగునాట స్త్రీలు చిన్న చిన్న అవసరాలకు బయటకు పరుగులు తీసే అవసరం లేకుండా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలు వారికి అండగా నిలుస్తున్నాయి. మహిళా పోలీసు వ్యవస్థ, దిశా చట్టం, దిశా యాప్‌ ఆడపడుచుల భద్రతకు అన్ని గ్రామాల్లో రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి. 2004–2009 మధ్య జననేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు అఖిలాంధ్ర మహిళాలోకం అన్నగా ప్రవేశపెట్టిన అనేక పథకాలకు అదనంగా 2019 మే ఆఖరు నుంచి వైఎస్సార్సీపీ సర్కారు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు మున్నెన్నడూ లేని స్థాయిలో మహిళల సర్వతోముఖాభివృద్ధిగా దోహదం చేస్తున్నాయి.

LEAVE A RESPONSE