Suryaa.co.in

Telangana

ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నది

– మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ జిల్లా: ప్రజా ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికై కృషి చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

గురువారం మంత్రి నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, అప్పాజీపేట గ్రామంలో అప్పాజీపేట నుండి మిర్లోని గూడెం వరకు కోటి రూపాయల సిఆర్ఆర్ నిధులతో నిర్మించనున్న బి టి రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చెప్పినదే కాకుండా చెప్పని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, ముఖ్యంగా అన్ని గ్రామాలలో రహదారి సౌకర్యంతోపాటు, చెరువుల పటిష్టత వంటివి చేపట్టడం జరిగిందని ,రైతు సంక్షేమంలో భాగంగా రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు మద్దతు ధర కల్పించడం ,సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నమన్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేశామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పరిమితి 10 లక్షల వరకు పెంచడం, ఇందిరమ్మ ఇండ్లు,సన్న బియ్యం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. గ్రామ చెరువు కట్ట పటిష్ఠతకు అంచనాలను రూపొందించి పంపించాలని చెప్పారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఈ ఈ గిరిధర్,డి ఈ రమేష్,ఇతర అధికారులు,ప్రజా ప్రతినిధులువెంట ఉన్నారు.

LEAVE A RESPONSE