Suryaa.co.in

Telangana

బ్రాహ్మణ వెల్లేముల రిజర్వాయర్ కింద లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం

– భూ సేకరణకు రైతులు సహకరించాలని కోరుతున్నా
– మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
– పెద్ద మనసుతో భూములు ఇచ్చిన రైతుల పరిహారం చెల్లింపు ఆలస్యం చేయొద్దని అడిషనల్ కలెక్టర్ ను ఆదేశించిన మంత్రి

నల్గొండ జిల్లా: ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంలోని బ్రాహ్మణ వెల్లేముల రిజర్వాయర్ కింద మిగతా భూసేకరణను త్వరితగతిన పూర్తి చేస్తే పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ఈ విషయంలో రైతులు సహకరించి త్వరితగతిన భూములను అప్పగించాలని, తద్వారా కాల్వ పనులను వేగవంతం చేసి పూర్తి చేసి రిజర్వాయర్ కింది లక్ష ఎకరాలకు సాగు నిరూ అందించేందుకు ప్రభుత్వానికి వీలవుతుందని తెలిపారు. గురువారం మంత్రి బ్రాహ్మణ వెల్లేముల రిజర్వాయర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కాగా… గత డిసెంబర్ 7న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రిజర్వాయర్ ను ప్రారంభించి రిజర్వాయర్ కింది భూములకు సాగునీరు అందించడం జరిగింది. మూడు నెలల క్రితం కూడా ఒకసారి సాగునీటిని విడుదల చేయగా, బుధవారం ఒక పంపును, గురువారం మరో పంపును రెండు పంపులను ఆన్ చేసి పానగల్ ఉదయ సముద్రం నుండి నీటిని బ్రాహ్మణ వెల్లేముల రిజర్వాయర్లోకి నింపుతున్నారు.

రెండు రోజుల్లో దాదాపుగా రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండనుంది. సుమారు 960 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్ లోకి రానుంది. గతంలో లాగే ఈ సంవత్సరం రైతులు పంటలు సాగు చేసుకునేందుకు, అలాగే చెరువులు నింపుకోవడం ద్వారా భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రైతులతో మంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణ వెళ్లెముల కింద అనుకున్నట్లుగానే లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఇంకా 1800 ఎకరాల భూసేకరణ మిగిలిపోయి ఉందని, ఈ భూములను త్వరితగతిన ప్రభుత్వానికి అప్పజెప్పితే కాలువలను త్వరగా తవ్వడం జరుగుతుందని, తద్వారా అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.

రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని రైతులతో అన్నారు. భూములు అప్పగించిన రైతులకు చెల్లింపులలో జాప్యం చేయొద్దని పక్కనే ఉన్న రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ జె. శ్రీనివాస్ ను ఆదేశించారు.

రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ జె. శ్రీనివాస్, ఉదయ సముద్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.శ్రీనివాస్ రెడ్డి , ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు.

LEAVE A RESPONSE