– కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్‌బీఐ ఇచ్చిన రుణాల గురించి మాత్రమే చెప్పారు
– అనధికారంగా తీసుకున్నవి కలిపితే రాష్ట్ర అప్పు మొత్తం రూ.10.77 కోట్లు
– భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
అమరావతి: రిజర్వుబ్యాంకుకు చూపించిన రూ.15 లక్షల కోట్ల ఆదాయం ఎలా వచ్చిందనే విషయంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరిగారు వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర అప్పుల గురించి రఘురామకృష్ణంరాజు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ 2019 నాటికి తెదేపా రూ.2,64 లక్షల కోట్లు అప్పులు భారం రాష్ట్రంపై వేసిందని, ఈ భారం క్రమేణా పెరుగుతూ 2023 నాటికి రూ.4.41 లక్షలకు చేరిందని, నాలుగేళ్ల వైకాపా పాలనలో మరో రూ.1.77 లక్షల కోట్లు అప్పుల భారం పడిరదని చెప్పారన్నారు.
అయితే తాను ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన అంశానికి, పార్లమెంటులో సీతారామన్‌గారు ఇచ్చిన సమాధానానికి మధ్య వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌పై రూ.10.77 లక్షల కోట్లు అప్పుల భారం ఉందని తాను చెప్పానన్నారు. ఇందులో వైకాపా ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చేసిన అప్పు రూ.7 లక్షల కోట్లు ఉందని అన్నాను. నిర్మలా సీతారామన్ రిజర్వు బ్యాంకు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల గురించి మాత్రమే సమాధానం చెప్పారు.
అనధికారంగా చేసిన అప్పులు గురించి చెప్పాను. కార్పొరేషన్లను తాకట్టుపెట్టి రూ.98,928 కోట్లు, రాష్ట్ర ఆస్తుల తనఖా పెట్టి తీసుకున్న 98 వేల కోట్లు, సోషల్ సెక్యూరిటీ బాండ్ల ద్వారా తీసుకున్న రూ.8,900 కోట్లు, ఎపీ ఫైనాన్సియల్ సర్వీసుల ద్వారా తీసుకున్న రూ.10 వేల కోట్ల రుణం, విద్యుత్ సంస్థల బకాయిలు రూ.20, 384 కోట్లు, సివిల్ సఫ్లైస్ నుంచి తీసుకున్న 35 వేల కోట్లు, లిక్కర్ బాండ్ల ద్వారా తీసుకున్న 8,375 కోట్లు, చిన్న కాంట్రాక్టర్లకు ఉన్న రూ.71 కోట్ల బకాయిలు, ఉద్యోగులకు ఉన్న రూ.33 వేల కోట్ల బకాయిలు, వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకున్న డిపాజిట్లు 1170 కోట్లు, పబ్లిక్ ఖాతా ఫండ్‌ల నుంచి తీసుకున్న రూ.26,235 కోట్లు, గ్రామ పంచాయతీల నుంచి దారి మళ్లించిన రూ.8,868 కోట్లు, జెన్‌కో, ట్రాన్స్‌కోల నుంచి తీసుకున్న రూ.,3600 కోట్లు జీపిఎఫ్ ఫండ్ నుంచి తీసుకున్న 17 వేల కోట్లు, ఇలా అనధికారంగా తీసుకున్న రుణాలన్నీ కలిపితే మొత్తం 10.77 కోట్లు అప్పులున్నాయని చెప్పానన్నారు.
ఈ ప్రకటనకు నేను కట్టుబడి ఉన్నా.. పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నకు 20 నుంచి నెల వరకు సమాధానం పట్టవచ్చని, తాను రాష్ట్ర అప్పులపై నిర్మలా సీతారామన్ ని నాలుగు రోజుల క్రితమే కలసి వివరించానన్నారు. పార్లమెంటు సక్రమంగా జరిగి ఉంటే ఈ ప్రశ్నపై చర్చ జరిగి వాస్తవ వివరాలు బయటకు వచ్చేవని, ఎఫ్‌ఆర్‌బిఎం విషయంలో రాష్ట్ర ప్రభత్వం చూపిన వివరాలు వాస్తవానికి దగ్గరగా లేవని ఆనుమానం వ్యక్తం చేశారు.
నిబంధనల ప్రకారం రూ.40 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకునే వెసులుబాటు రాష్ట్రానికి ఉందని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బిఎం రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుందని, కాని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రిజర్వుబ్యాంకును పక్క దోవ పట్టించినట్లు కనిపిస్తోందన్నారు. 2019లో రూ.5 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2023 నాటికి రూ.15 లక్షల కోట్లకు చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకుకు చూపించిందన్నారు.
ఈ నాలుగేళ్ల కాలంలో ఎలాంటి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా ఎలా రాష్ట్ర ఆదాయం పెరిగిందనేది ప్రశ్నార్ధకమని చెప్పారు. ఈ రూ.15 లక్షల కోట్ల ఆదాయం ఎలా వచ్చిందనే విషయంపై ప్రజలకు వైకాపా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.