Suryaa.co.in

Andhra Pradesh

స్కిల్ కేసులో అసలు దొంగ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే

స్కిల్ డెవలప్మెంట్ కేసులో సర్వం డొల్ల… ఈ కేసు దెబ్బకు మా పార్టీ అవుతుంది గుల్లా
ఫైళ్లను మాయం చేసిన ఘనత మా ప్రభుత్వానిదే
హవ్వ… ఫైళ్లన్నవి లేకుండానే కేసు నమోదా?!
రఘురామిరెడ్డి విధులను నిర్వహిస్తున్నది ఎక్కడ??
సిట్ అధికారి గానా?, ఇంటలిజెన్స్ విభాగంలో నా? లేకపోతే సిఐడి అధికారిగా పనిచేస్తున్నారా?
ఈ ప్రశ్న కు ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పేది ఎవరు?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో న్యాయమూర్తి హిమబిందు తీర్పుపై ఓ సాధారణ పౌరుడిగా విశ్లేషిస్తా
సిఐడి అధికారులు నమోదు చేసిన కేసును ఏసీబీ కోర్టులో విచారించడమెందుకు?, గతంలో విశాఖపట్నంలో విచారించేందుకు నిరాకరణ
17A ప్రకారం ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రుల స్థాయి వ్యక్తుల అరెస్టు గవర్నర్ అనుమతి తప్పనిసరి
చంద్రబాబు అరెస్టులో ఈ నిబంధనలేవీ పాటించని సిఐడి పోలీసులు
వైఎస్ హయాంలోనే కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం షురూ
టెండర్ లేకుండానే అమూల్ పాలు కొనుగోలు… ప్రతి నెల అడ్వాన్సులు చెల్లింపు
అయినా జగన్మోహన్ రెడ్డి చేసేది తప్పు కాదు కానీ… లక్షలాదిమంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం చంద్రబాబు చేసిన తప్పా?
ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి అండగా నిలబడ్డ వాడే నిజమైన స్నేహితుడు
చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు ఉన్నాను… ఎప్పుడూ ఉంటానన్న జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమర్థనీయం
దొంగ ఓట్ల నమోదు పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్…
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

స్కిల్ డెవలప్మెంట్ కేసు సర్వం డొల్ల… ఈ కేసు దెబ్బకు మా పార్టీ అవుతుంది గుల్లా అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఈ కేసులో నూటికి నూరు శాతం మా ప్రభుత్వమే దోషి. ఫైల్ లేకుండానే కేసు నమోదు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఒరిజినల్ ఫైల్ ఉంటే ఆనాటి ప్రభుత్వ అదనపు కార్యదర్శి అజయ్ కల్లం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యదర్శిగా వ్యవహరించిన ప్రేమ్ చంద్రారెడ్డి లు అరెస్టు చేయాల్సి వస్తుందని, అసలు కుంభకోణమే జరగని కేసులో సొంత సామాజిక వర్గ అధికారులు ఇరుక్కుపోతారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తన రాజకీయ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సిట్ పోలీసు అధికారి రఘురామిరెడ్డిల సహకారంతో ఒరిజినల్ ఫైల్స్ మాయం చేశారన్నారు. నోట్ ఫైల్ అన్నదే లేకుండా కేసు నమోదు చేయడం ఏమిటో అంతు చిక్కడం లేదన్నారు .

మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘు రామ కృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పివి రమేష్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేశామని చెబుతున్న సిఐడి అధికారులు , అదే వ్యక్తి ఒరిజినల్ ఫైల్ లేకుండా కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారని గుర్తు చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు ద్వారా ఈ ప్రభుత్వం భూస్థాపితం కావడం ఖాయం. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సు నిర్వహిస్తుంటే, చంద్రబాబు నాయుడు అరెస్టు వల్ల, ఆ సదస్సు గురించి తెలుగు రాష్ట్రాలలో పట్టించుకున్న వారే లేరు.

ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు కేసు అప్డేట్స్ కోసమే నిరీక్షించే పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తనకు తానే పిన్నవయస్కుడినని చెప్పుకునే ముఖ్యమంత్రికి చివాట్లు పెట్టనున్నట్లు తెలిసిందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.

సిట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చట్టంలో ప్రొవిజన్ లేదు
సిట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చట్టంలో ప్రొవిజన్ లేదు. ప్రభుత్వం ప్రత్యేక ఆర్డర్ తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ, చట్టంలో ఆ ప్రొవిజన్ లేకపోవడంతో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అమరావతి భూముల కొనుగోలుపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) అధికారిగా రఘురామిరెడ్డిని నియమించింది.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు, మాజీ మంత్రి నారాయణ ను వేధించడానికి ఈ సిట్ ఏర్పాటు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో స్కామ్ జరిగిందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. గతంలో రఘురామిరెడ్డి నేతృత్వంలో ఏర్పాటుచేసిన సిట్ కు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగించలేదు.

ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో స్కామ్ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, సిఐడి పోలీసులకు దర్యాప్తు బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుంది. రఘురామిరెడ్డి ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో తెలియక పోయినప్పటికీ ఆయన దర్యాప్తు చేసిన కేసు సిఐడి చీఫ్ సంజయ్ పాట పాడినట్లు మీడియా ప్రతినిధులకు చదివి వినిపించారు. ఈ కేసు దర్యాప్తులో రఘురామిరెడ్డి పాత్ర ఏమిటి?. సిట్ అధికారిగా వ్యవహరిస్తున్నారా? లేకపోతే సిఐడి విభాగంలో అధికారిగా కొనసాగుతున్నారా?

ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో విధులను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఒకే అధికారి మూడు చోట్ల విధులను నిర్వహిస్తున్నారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రఘురామిరెడ్డి ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో స్కాం జరిగినట్లు, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉత్తర్వులను జారీ చేయలేదు. ఇప్పుడు బ్యాక్ డేట్ లో ఏమైనా ఉత్తర్వులను జారీ చేస్తారా?, లేకపోతే ఇప్పటికీ ఇప్పుడు సిట్ ఏర్పాటు చేస్తున్నామని అంటారా?? అంటూ రఘు రామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు.

గవర్నర్ అనుమతి తీసుకోలేదు… అయినా ప్రధాన ప్రతిపక్ష నేత అరెస్ట్
ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రుల స్థాయి వ్యక్తులను అరెస్టు చేసేటప్పుడు గవర్నర్ అనుమతి తీసుకోవాలని చట్టంలోని 17A సెక్షన్ చెబుతోంది. అయినా ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసే ముందు, సిఐడి పోలీసులు గవర్నర్ అనుమతి తీసుకోలేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి హిమబిందు 2018 కి ముందు జరిగిన సంఘటనలకు ఈ నిబంధన వర్తించదని తన తీర్పులో వెల్లడించారు.

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కేసు తీర్పును పరిగణలోకి తీసుకొని ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. అచ్చం నాయుడు కేసు అసలు సుప్రీంకోర్టుకు వెళ్లలేదు. సుప్రీంకోర్టు తీర్పు ను సరిగ్గా అన్వయించుకోలేక ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును ఇచ్చారు. ఇదే విషయాన్ని సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 2018లో కేసు పెట్టకుండా ఉండి ఉంటే, అనుమతి తప్పనిసరి అని అదే విషయాన్ని తీర్పులో వెల్లడించడం జరిగిందన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ఒక రకంగా ఉంటే, దాన్ని తల లేని సుధాకర్ రెడ్డి వినిపించిన వాదనలతో న్యాయమూర్తి హిమబిందు ఏకీభవిస్తూ తీర్పునిచ్చారని అన్నారు. ఈ ఒక్క పాయింట్ మీద కేసును కొట్టివేయవచ్చునని తెలిపారు. చట్టంలోని 405, 409 సెక్షన్ ఇంటర్ లింకు గా ఉంటాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 409 సెక్షన్ అనేది అప్లికేబులే కాదు. ఈ కేసులో అసలు ఫైల్ అన్నదే లేదు. రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు నాయుడు వద్దకు డబ్బులు వచ్చాయని, ఆయన అకౌంట్లో డబ్బులు ఉన్నాయని ఎక్కడ కూడా పేర్కొనలేదు.

ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ వి ఆర్ కృష్ణారావు, సునీత అనే అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. పోలీసులు అడ్డమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తే, ఆ సెక్షన్లు వర్తిస్తాయా?, లేదా? అన్నది చూసుకోవలసిన బాధ్యత న్యాయమూర్తిదేనని రఘు రామ కృష్ణంరాజు వెల్లడించారు.

ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలతో ఏకీభవించినప్పటికీ, రాష్ట్ర హైకోర్టు ఈ కేసు ను కొట్టి వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ కేసులో 409 సెక్షన్ అప్లికేబుల్ కాదు కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడుకి బెయిల్ కచ్చితంగా మంజూరు చేసే అవకాశం ఉంది. చట్టంలోని 17A సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకపోవడాన్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

సిఐడి కేసు… ఏసీబీ కోర్టుకు ఎందుకొచ్చింది?!
సిఐడి పోలీసులు దర్యాప్తు చేసిన కేసు ఏసీబీ కోర్టుకు రావడమనేది ఆశ్చర్యాన్ని కలిగించిందని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. అవినీతి అన్నది జరగకుండా చూడడమే ఏసీబీ శాఖ బాధ్యత. సిఐడి అధికారులు దర్యాప్తు చేసిన కేసులను విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానం ఉంది. ఇటీవల విశాఖలో ఇదేవిధంగా సిఐడి పోలీసులు ఏసీబీ కోర్టుకు వెళితే వెళ్లండెహే… అని అన్నారని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. ఈ విషయంపై ఎవరితోనైనా బహిరంగ చర్చకు నేను సిద్ధమే. దమ్ముంటే ఎవరైనా ముందుకు వచ్చి తనతో చర్చించాలని రఘురామకృష్ణంరాజు సవాల్ చేశారు.

ప్రభుత్వ అధికారుల అవినీతి కేసులను విచారించడానికి ఏసీబీ కోర్టులు ఉన్నాయి. సిఐడి దర్యాప్తు చేసిన కేసులను తీసుకోవడానికి కాదని పేర్కొన్నారు. నోట్ ఫైల్ కూడా లేకుండా, గవర్నర్ అనుమతి లేకుండా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతపైన సిఐడి నమోదు చేసిన కేసును ఏసీబీ కోర్టు విచారించడం అన్నదే ఆశ్చర్యాన్ని కలిగించింది. సిఐడి కోర్టుకు వెళితే తమకు అనుకూలంగా తీర్పు రాదని భావించారా?, సుప్రీంకోర్టు ఉత్తర్వులను, హైకోర్టు మిస్ అండర్స్టాండ్ చేసుకుంటే, ఆ తీర్పు కాపీని న్యాయమూర్తి చదువుకొని ఉత్తర్వులను వెల్లడించాలి.

ఈ కేసులో తీర్పు వెలువడక ముందే రాజమహేంద్రవరం ఎస్పీ, జైలు మార్గంలోని రహదారులను ఎలా క్లియర్ చేశారు. ముందస్తుగా ఎలా 144 సెక్షన్ విధించారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి పస లేదని, ఈ కేసులో బెయిల్ లభించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు పై పాత కేసులలో పిటి వారెంట్ లు జారీ చేసే అవకాశం ఉంది. ఎన్ని కేసులు నమోదు చేసిన మహా అయితే 15 రోజులలో అన్ని కేసుల నుంచి ఆయన బయటకు వస్తారు. ప్రజల తరఫున పోరాడుతున్న నారా చంద్రబాబు నాయుడు లాంటి నాయకులకు ప్రజలే సైన్యం అవుతారు. అటువంటి సైన్యంలో నేను ఒకరినని రఘు రామ కృష్ణంరాజు వెల్లడించారు.

నారా లోకేష్ కు సంఘీభావాన్ని తెలియజేశా
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై నా నిరసనని వ్యక్తం చేస్తూ, నారా లోకేష్ తో మాట్లాడి నా సంఘీభావాన్ని తెలియజేశానని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి అండగా నిలబడ్డవారే నిజమైన స్నేహితులు. గతంలో నేను కష్టాల్లో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు నాకు, నా కుటుంబానికి ఎంతో అండగా ఉండి, మద్దతునిచ్చారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసు నేపథ్యంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంతో సరైనవని పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తోనే ఉన్నానని, భవిష్యత్తులోనూ ఉంటానని చెప్పారని గుర్తు చేశారు. ఏదైతే ఇప్పుడు మీరు చేస్తున్నారో.. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు చూస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరిక చేశారన్నారు. అది నిజమైన ఛాలెంజ్ అని, అదే అసలు సిసలు హీరోయిజం అని పేర్కొన్నారు. జైలులో చంద్రబాబు నాయుడు ప్రాణాలకు రక్షణ లేదన్న రఘురామకృష్ణం రాజు, గతంలో జైల్లో మొద్దు శ్రీను, ఓం ప్రకాష్ హత్యలు చూశామన్నారు.

అటువంటిది ఇల్లు కంటే జైలు సేఫ్ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి మతిలేని మనుషులు అంటున్నారని ధ్వజమెత్తారు. తమ రాజకీయ ప్రత్యర్థులను పాయిజన్ ద్వారా హత్య చేయడానికి ప్రణాళికలు చేసి, విదేశాల నుంచి తెప్పించారని ఇప్పటికే వాటి వివరాలను ప్రజలకు వెల్లడించాను. ఏసీబీ కోర్టులో హౌస్ రిమాండ్ ఇచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. అయినా, చంద్రబాబు నాయుడు వారం రోజుల వ్యవధిలో బయటకు వస్తారు.

హైకోర్టులో న్యాయం జరిగిన జరగకపోయినా, సుప్రీంకోర్టులో న్యాయం జరిగి తీరుతుంది. భవిష్యత్తులో ఎటువంటి తింగరి కేసులు పెట్టనున్నారో ఇప్పటికే మా పార్టీ నాయకులు వాగేశారు. ఆ పేపర్ క్లిప్పింగ్స్ చాలు… బెయిల్ రావడానికన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఎవరు బెంగ పెట్టుకోవద్దన్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పారు. గుండె నిబ్బరంతో ఉండాలని సూచించారు. నారా లోకేష్ సైతం అరెస్టు చేస్తామని మా పార్టీ పిల్ల నాయకులంతా చెబుతున్నారన్నారు.

చంద్రబాబు నాయుడు ని 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరడం వెనక కుట్ర కోణం దాగి ఉంది. ఆయనకు 15 రోజులపాటు నిద్ర లేకుండా చేసి, చంపాలని చూస్తున్నారన్నారు. అయినా ఈ కేసు లో చంద్రబాబు నాయుడుకి వెంటనే బెయిల్ లభిస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు, అరాచక వేధింపులను జనం కూడా చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

జగన్ కు అమూల్ పై అంత ప్రేమ ఎందుకు?
జగన్ కు అమూల్ పై అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, టెండర్లు ఆహ్వానించకుండానే పాల సరఫరా చేసే కాంట్రాక్టర్ ను అమూల్ కు ఎందుకు కట్టబెట్టారని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం అనే సాంప్రదాయం ప్రారంభమయ్యింది. స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 శాతం నిధులను మాత్రమే మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేసే పథకాలకు టెండర్లను ఆహ్వానించి ఉంటే అమూల్ తో పాటు, విజయ వంటి సంస్థలు పోటీపడేవని అన్నారు.

ప్రతి నెల అడ్వాన్స్ తీసుకొని అమూల్ సంస్థ పాలను సరఫరా చేస్తుందన్నారు. అమూల్ కు డబ్బులు ఇచ్చి బిల్లులు ఇవ్వకపోయినా తప్పులేదు కానీ స్కిల్ డెవలప్మెంట్ కోసం 10 శాతం నిధులు మంజూరు చేయడమే తప్పయిందా? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ రంగులు వేసి తుడిపి వేయడానికి మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలను వెచ్చించారని గుర్తు చేశారు.

అమూల్ కు 300 కోట్ల రూపాయలు ముందే అడ్వాన్స్ ఇచ్చారన్నది నిజమా కాదా అంటూ నిలదీశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తాను చేసిన ఫిర్యాదు పై స్పందిస్తూ ఈనెల 8వ తేదీన తనకు ఒక లేఖ రాశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉందని, జిల్లా కలెక్టర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

LEAVE A RESPONSE