మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపణ
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్, బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, రాజేష్ నాయక్ లు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అవినీతి, అధికార దుర్వినియోగం పై దుయ్యబట్టారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇందిరమ్మ రాజ్యం లో రేవంత్ కుటుంబ పాలన నడుస్తోంది,” అన్నారు. “రేవంత్ తన సోదరులను తెలంగాణ మీదకు వదిలేశాడు. రేవంత్ సోదరులు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తూ అసెంబ్లీ కమిటీ హాల్ లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదా లేకున్నా స్పీకర్ దగ్గర వికారాబాద్ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. కొడంగల్ లో తిరుపతి రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంచుతుంటే మా జెడ్పిటీస్ మహిపాల్ అడ్డుకున్నారు,” అన్నారు.
“రేవంత్ మరో సోదరుడు కొండల్ రెడ్డి కి ఏ హోదా ఉందని అధికారులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తోడుగా ఉన్నారు. కొండల్ రెడ్డి కాన్వాయ్ లో పదుల సంఖ్యలో వాహనాలు ఉంటాయి. వారికి అధికారులు రాచ మర్యాదలు చేస్తున్నారు,” అని సుమన్ వివరించారు.
“రేవంత్ అమెరికా పర్యటనలో స్వచ్ బయో తో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీ రేవంత్ మరో సోదరుడు ఎనుముల జగదీశ్ రెడ్డి ది. పదిహేను రోజుల క్రితమే ఆ కంపెనీ ఏర్పాటయ్యింది. ఇవే కాకుండా రేవంత్ సోదరుల ఆద్వర్యం లో నాలుగు సంస్థలు ఏర్పాటు అయ్యాయి. ఈ సంస్థల ద్వారానే రేవంత్ బ్లాక్ మనీని వైట్ గా మారుస్తున్నారు. ప్రధాన కంపెనిలే కాకుండా రేవంత్ సోదరులు అనేక మైక్రో సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. రేవంత్ సోదరులు రియల్టర్ల ను బెదిరించి విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నారు ” అని తెలిపారు.
తెలంగాణ లో ఇపుడు నడుస్తోంది రేవంత్, ఆయన సోదరుల సామ్రాజ్యం. తెలంగాణ బుద్ది జీవులు మేధావులు రేవంత్ సోదరుల ఆగడాలపై స్పందించాలి. రేవంత్ అధికార దర్పం, అవినీతి పై తెలంగాణ సమాజం ఆలోచించాలి అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర పుట్టుకకు అస్తిత్వానికి కారణమైన పార్టీ బీ ఆర్ ఎస్. పద్నాలుగేళ్లు తెలంగాణ రాష్టం కోసం పోరాడాం, పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాము. బీ ఆర్ ఎస్ బీజేపీ లో విలీనం అవుతుందని తెలంగాణ అంటే ఇష్టం లేని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ బీ ఆర్ ఎస్ కచ్చితంగా ఉంటుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతుంది అని అన్నారు.