విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మంగళగిరితో ముడిపడిన బంధం నన్ను చేనేత కుటుంబసభ్యుడిని చేసింది. చేనేత కళాకారుల కష్టాలు చూశాను. సమస్యలపై పూర్తి అవగాహన వచ్చింది.
యువగళం పాదయాత్రలో చేనేత రంగం లక్షలాది మంది జీవనానికి ఉపయోగపడటమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే ఓ కళ అని పూర్తిస్థాయి అవగాహన కలిగింది. చేనేతరంగానికి పూర్వవైభవం తీసుకొస్తామని పాదయాత్రలోనే మాటిచ్చాను. సమాంతరంగా మన మంగళగిరిలో చేనేతలకు చేయూతనందించే వివర్స్ శాల పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి టాటా తనేరా సంస్థ తో అనుసంధానం చేసాం.
పేద చేనేత కళాకారులకు మగ్గాలు, ఇతర సామాగ్రి అందించాను. చేనేత రంగం, కార్మికుల సమస్యలన్నీ శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొందిస్తోంది. మన మంగళగిరి-మన చేనేత అనే నినాదంతో దేశవ్యాప్తంగా మన చేనేత వస్త్రాలకు బ్రాండింగ్ కల్పిస్తున్నాం.
ప్రధాని నరేంద్ర మోదీని మంగళగిరి చేనేత కళాకారులు నేసిన శాలువాతో సత్కరించాను. నా తల్లి, నా భార్య మంగళగిరి చేనేత చీరలు ధరిస్తూ, మన చేనేత కళకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. చేనేతలకు చేయూతనందించడం మా ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటి. చేనేత కళకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.
నన్ను ఆదరించి, ఆశీర్వదించిన చేనేత కుటుంబసభ్యులందరికీ చేనేత దినోత్సవం సందర్భంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.