Suryaa.co.in

Andhra Pradesh

మా ప్రభుత్వంతోనే యాదవుల ఉన్నతి

– మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత, పార్థసారధి, రాంప్రసాద్ రెడ్డి

విజయవాడ : మా ప్రభుత్వంతోనే యాదవుల ఉన్నతి సాధ్యమని మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సవిత, కొలుసు పార్థసారధి, రాంప్రసాద్ రెడ్డి స్పష్టంచేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నర్సింహాయాదవ్ సహా డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి, రాంప్రసాద్ రెడ్డితో కలిసి మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. ముందుగా అచ్చెన్నాయుడు.. యాదవ కార్పొరేషన్ పాలక వర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ రాకతోనే బీసీలకు రాజకీయ స్వాతంత్ర్యం లభించిందన్నారు. వెనుబడిన కులాలకు సీఎం చంద్రబాబునాయుడు మరింత ప్రాధాన్యమిస్తున్నారన్నారు. అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా బీసీలకు గుర్తింపు తీసుకొస్తున్నారన్నారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా గొల్ల నర్సింహయాదవ్ ఎంపిక సరైనదన్నారు. ఆయనెప్పుడూ పసుపు చొక్కాతోనే కనిపిస్తారన్నారు. సీఎం చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు నర్సింహయాదవ్ అని చెప్పారు.

యాదవులను వ్యాపారులుగా చేస్తాం : మంత్రి సవిత

యాదవులకు రాజకీయంగా, ఆర్థికంగా టీడీపీ ప్రభుత్వాలతోనే సాధ్యమని మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుత కేబినెట్ లో 8 మంది బీసీలను మంత్రులుగా సీఎం చంద్రబాబు అవకాశమిచ్చారన్నారు. వారిలో సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారధి యాదవ సామాజిక వర్గానికే చెందినవారన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను పల్లా శ్రీనివాస యాదవ్ కు అప్పగించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానూ యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ను నియమించారన్నారు.

యాదవులకు గొర్రెలు, మేకలు, గోవుల యూనిట్లు అందజేయడానికి స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. యాదవులను వ్యాపారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు రూపొందించారన్నారు. ఊరిలోనే ఉండి పశువుల మేత ఆర్థికంగా లబ్ధి కలిగేలా పశుగ్రాసం సాగుతో పాటు పశువుల ధాణా కూడా అందజేసేలా చర్యలు తీసుంటున్నట్లు మంత్రి సవిత వివరించారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన నర్సింహా యాదవ్ కు మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబుతోనే బీసీలకు న్యాయం : మంత్రి పార్థసారధి

సీఎం చంద్రబాబునాయుడితోనే బీసీలకు న్యాయం జరుగుతోందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. జగన్ అయిదేళ్ల పాలనలో వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కార్పొరేషన్ల పాలక వర్గాలకు నిధులు లేవు సరికదా…కూర్చీలు కూడా సమకూర్చలేదన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే జగన్ చూశారని మండిపడ్డారు.

మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీలో కష్టపడే వారికి ప్రాధాన్యముంటుందని మరోసారి నిరూపితమైందన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, టీడీపీకి బీసీలు ఎప్పుడూ బ్యాక్ బోన్ గానే ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కొనకళ్ల నారాయణరావు, వీరంకి గురుమూర్తి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ కూటమి నాయకులు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన యాదవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE