-
పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు షర్మిల మేనత్త విమల డిమాండ్
-
సొంత అన్న వివేకా హత్యపై ఇప్పటిదాకా మాట్లాడని విమల
-
అన్న హత్యపై విచారణ ఏమైందని నిలదీయని విమల
-
వివేకాది హత్య అని నిర్ధారణ అయినా కేసు ఆలస్యం
-
నత్తలలతో పోటీ పడుతున్న వివేకా హత్య కేసు
-
పాస్టర్ ప్రవీణ్‌ది ప్రమాదమంటున్న పోలీసులు
-
అయినా ప్రవీణ్ మృతిపై విచారణకు విమల డిమాండ్
-
షర్మిల, సునీత ప్రశ్నలకు జవాబు లేని మేనత్త విమల
-
మేనత్త విమల తీరుపై వైఎస్ అభిమానుల కన్నెర్ర
( మార్తి సుబ్రహ్మణ్యం)
రక్తం పంచుకుపుట్టిన సొంత అన్న గొడ్డలిపోటుకు గురయి ఏళ్లవుతోంది. ముందు అన్న మరణాన్ని గుండెపోటు అన్నారు. రక్తవిరోచనాలన్నారు. చివరాఖరకు గొడ్డలిపోటుగా తేల్చారు. ఇది ఏళ్ల తరబడి తెలుగు టీవీ సీరియల్ జీడిపాకంలా సాగుతూనే ఉంది.నానదు. తేలదు. సారీ.. తేల్చరు!
అటు హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఈ కేసును ఎందుకు ఇంతకాలం నాన్చుతున్నారని సీబీఐని చీవాట్లు పెట్టింది. అయినా నో రెస్పాన్స్. పాపం ఇద్దరి ఆడకూతుళ్లు ఆ హత్య కేసు తేల్చాలని కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్నారు. నిందితులను అరెస్టు చేయాలని ఆర్తిగా అర్ధిస్తున్నారు. అయినా నో యూజ్.
ఇప్పుడు ఆ ఇంటికి ఏకైక పెద్దదిక్కు ఇద్దరు అన్నల ముద్దల చెల్లెలయిన మేనత్తమాత్రమే. ఆ మేనత్తేమో గొడ్డలిపోటు వైపున్నారు. పోనీ సొంత అన్నను చంపిన వారిని అరెస్టు చేయమని డిమాండ్ చేస్తారా అంటే లేదు. పైగా అసలు హత్యో కాదో తెలియని, అది ప్రమాదవశాత్తూ జరిగిన మరణమేనని పోలీసులు చెప్పినా పట్టించుకోకుండా.. పాస్టరు మరణంపై విచారణకు డిమాండ్ చేస్తున్న ఈ మేనత్తపై మేనకోడళ్లు చిర్రుబుర్రులాడుతున్నారు.
ఏంది అత్తా ఇది? సొంత అన్న చంపిన వాళ్ల గురించి మాట్లాడవా? పాస్టరు మరణంపై విచారణ అడుగుతావా? ఏం.. నీ అన్నను చంపిన వాళ్లకు పట్టుకోవద్దా అత్తా? అన్నది ఇప్పుడు మేనకోడళ్ల ప్రశ్న. వైఎస్ వివేకానందరె డ్డి హత్యపై విచారణ కోరిన తమ మేనత్త వైఎస్ విమలారెడ్డిని.. ఆమె మేనకోడళ్లయిన వైఎస్ షర్మిలారెడ్డి, డాక్టర్ సునీత.. వైఎస్ అభిమానులతో కలసి జమిలిగా సంధిస్తున్న ప్రశ్నలివి!
కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని రాష్ట్రానికి విడిచిపెట్టి, పులివెందులలో అన్నీ తానై నడిపించిన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయి ఏళ్లవుతోంది. ఇంతవరకూ కేసు అంగుళం ముందుకు కదిలింది లేదు. కేసు పురోగతి చూసి నత్తలు కూడా నవ్వుకుంటున్నాయి. పాపం.. కూతురు డాక్టర్ సునీత, అన్న బిడ్డ షర్మిలారెడ్డి ఇద్దరూ ధర్మదేవత ఎదుట మోకరిల్లారు.
పేరుగొప్ప దర్యాప్తు సంస్థ సీబీఐ మాత్రం, గుప్పెడు నిద్రమాత్రలు మింగిన దానిలా సుఖనిద్ర పోతోంది. అప్పుడప్పుడూ జడ్జిగారి హుంకరింపులు తప్ప, కేసు ఒక అంగుళం కదిలింది లేదు. మాకు న్యాయం చేయమంటూ ఇద్దరు ఆడబిడ్డలు రోడ్డెక్కి కొంగుజాపి అర్ధించినా, న్యాయదేవత ఇప్పటికీ కనికరించిందీ లేదు. పోనీ ఫ్యామిలీ అన్నా దన్నుగా ఉంటుందా అంటే.. జగన్, భారతి, అవినాష్, మేనత్త విమల అంతా గొడ్డలిపోటు వైపేనాయె! ఎటొచ్చీ పాపం సునీత, షర్మిల ఇద్దరే ఒంటరి జీవులు!
పోనీ ‘ఎడుగూరి సందింటి’ కుటుంబానికి పెద్ద దిక్కయిన మేనత్త కామ్రేడ్ విమలమ్మయినా, ఇద్దరు ఆడబిడ్డల వైపు నిలబడ్డారా అంటే అదీలేదు. సొంత అన్నను అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికితే.. ‘నా అన్నను చంపిన కిరాతకులను శిక్షించండి’ అని ఈ పులివెందుల చెల్లెమ్మ ఇప్పటిదాకా నినదిస్తే ఒట్టు. పైగా ‘అవినాష్‌రెడ్డి అమాయకుడు. వదిలేయమ’ని మేనకోడళ్లకు రి మండేషన్ ఒకటి.
సొంత అన్నను చంపిన వారిని శిక్షించమని ఇప్పటివరకూ కోరని ఈ మేనత్త.. ఇప్పుడు ప్రవీణ్ అనే పాస్టర్ మృతిపై విచారణ జరిపించాలని కోరడం.. సునీత అండ్ షర్మిలకే కాదు. వైఎస్ అభిమానులకు బోలెండ కోపం తెప్పించింది. సొంత అన్న హత్య గురించి ఇప్పటివరకూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ప్రమాదానికి గురై మరణించిన పాస్టరు గురించి మాట్లాడటమే దానికి కారణం!
పాస్టర్ ప్రవీణ్‌ది హత్యా? సహజ మరణమా? అంటూ మీడియా చానెళ్లు గత కొద్దిరోజుల నుంచి, చర్చల పేరంటం పెట్టి వీక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. చివరాఖరకు సదరు పాస్టరు గారు, ఆగిన చోటల్లా మద్యం బాటిళ్లు కొని, తాగి బండి నడిపి.. ఆ క్రమంలో మూడు, నాలుగుసార్లు కిందపడి దెబ్బలు తగిలించుకున్నట్లు సీసీ టీవీ పుటేజీల్లో బయటపడిన నిజాలను జనం చూశారు. బహుశా ఆ ప్రమాదంలో భాగంగానే, పాస్టరు గారు మృతి చెంది ఉండవచ్చు. పోలీసులు కూడా అదే ధృవీకరిస్తున్నారు.
అసలు పాస్డరు గారిని చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఆయనకు ఎవరితో ఆస్తిగొడవలు లేవు. భూముల పంచాయతీలు అసలే లేవు. యూట్యూబ్ చానెళ్లలో అన్యమతంపై ఘాటు విమర్శలు తప్ప, ఆయనపై ఎలాంటి ఫిర్యాదులు కూడా కనిపించవు. అసలు పాస్టరు గారిని చంపితే ఎవరికి లాభమన్నదీ ఒక ప్రశ్న. ఆయనేమీ కోటీశ్వరుడు కాదు. క్రైస్తవంపై మమకారం ఉన్న సాధారణ, మధ్య తరగతి పాస్టర్. ఆయనను చంపితే ఆస్తి దక్కుతుందనడానికి, ఆయన సంపాదించుకున్న ఆస్తులూ లేవు. ఇద్దరు ఆడపిల్లల తండ్రి.
ఇలా ఏ కోణంలో చూసినా, పాస్టరు గారిని చంపాల్సిన అవసరం ఎవరికీ ఉండదన్నది నిష్టుర నిజం. ఇక మద్యం అనేది వ్యక్తిగత బలహీనత. ప్రభుత్వమే దానిని ప్రోత్సహిస్తుంది కాబట్టి, అది నేరం కూడా కాదు. కాకపోతే తాగి బండి నడపటమే నేరం. అదే ఇప్పుడు పాస్టరు గారి ప్రాణాలకు అపాయం తెచ్చింది.
కానీ జగనన్న మేనత్త విమలమ్మ మాత్రం, వైసీపీ క్రైస్తవ నేతలతో గొంతు కలిపి.. పాస్టరు మృతిపై విచారణంటూ యాగీ చేయడం, వైఎస్ అభిమానులకు రుచించడం లేదు. ఓ పక్క పోలీసులు, వారు విడుదల చేసి సీసీ టీవీ పుటేజీలన్నీ పాస్టరు గారిది సహజమరణమన్నట్లే చెబుతున్నాయి. అయినా విమలమ్మ, ఆయన మరణంపై విచారణకు డిమాండ్ చేస్తోంది.
తన భర్త మరణాన్ని రాజకీయం చేయవద్దని, ఏపీ ప్రభుత్వ విచారణపై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ ..పాస్టర్ ప్రవీణ్ భార్య, తమ్ముడు స్పష్టం చేసినా, విమలమ్మ అండ్ కో స్వరం మాత్రం భిన్నంగా ఉండటం శాంతికాముకులైన క్రైస్తవులకూ రుచించడం లేదు.
మరోవైపు తన సొంత అన్న వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నిర్దయగా హత్య చేసిన ఆనవాలు, ప్రపంచం మొత్తం చూసి కొన్నేళయింది. ఆయన ఒక్కగానొక్క బిడ్డ డాక్టరమ్మ అనాధయింది. తనకు కొండంత ధైర్యంగా ఉన్న చిన్నాయనను పోగొట్టుకున్న షర్మిలమ్మ కూడా దిక్కులేనిదయింది. మొత్తంగా మొగదిక్కులేని ఆడ సంసారమయింది. ఫలితంగా కష్టమైనా, నష్టమైనా ఆ సిస్టర్సే భరించాల్సిన దుస్థితి.
ఈ స్థితిలో తన అన్నను చంపిన వారి సంగతి తేల్చాలని.. రాణిరుద్రమ లెవల్లో జూలు విదిలించాల్సిన ఈ పులివెందుల రెడ్డమ్మ.. దాని సంగతి పక్కనపెట్టి, సాధారణ మరణమైన పాస్టరు మృతిపై విచారణ జరపాలని గొంతెత్తడంపై, వైఎస్ అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు. రాయలసీమ, అందునా కడప.. అందునా పులివెందులలో పుట్టిన బిడ్డలకు, మిగిలిన వారికంటే పౌరుషం పాలెక్కువగనే ఉంటుంది.
రక్తసంబంధీకులను మట్టుపెట్టిన ప్రత్యర్థులను, మట్టిలో పూడ్చేంతవరకూ విశ్రమించని సంస్కృతి అది. సినిమాల్లోనే కాదు. నిజజీవితంలోనూ ఇవి తెలిసిన దృశ్యాలే. కానీ ‘పులివెందుల పులి’ మేనత్త విమలమ్మలో మాత్రం అందుకు భిన్నంగా, రక్తసంబంధీకుడిని కడతేర్చిన వారి సంగతి తేల్చాలన్న పట్టుదల కనిపించకపోవడమే.. వైఎస్ అభిమానులను విస్మయపరుస్తోంది. బహుశా రక్తసంబందీకుడిని రక్తసంబంధమే కడతేర్చిందన్న మొహమాటమే దానికి కారణం కావచ్చన్నది వైఎస్ అభిమానుల అభిప్రాయం.